jewellery demand
-
కొత్త బంగారు లోకం
సాక్షి, అమరావతి: నిన్నా మొన్నటి వరకు 22 క్యారెట్ల బంగారు ఆభరణాల కొనుగోలుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రజల అభిరుచిలో గణనీయమైన మార్పు వచ్చింది. ప్రస్తుతం 14 –18 క్యారెట్ల బంగారంతో చేసిన ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారు. బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడం వల్లే ప్రజలు ఇలా నిర్ణయం మార్చుకున్నారని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వారి బడ్జెట్‌కు తగినట్టుగా తక్కువ క్యారెట్లతోనే ఆభరణాలు తయారు చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. 2021లో దేశ వ్యాప్తంగా 611 టన్నుల బంగారు ఆభరణాలు అమ్ముడైనట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా అమ్ముడవుతున్న బంగారు ఆభరణాల్లో 25 శాతం భారతీయ పెళ్లి కూతుళ్ల కోసమే కొంటున్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. మరోవైపు యువత మోడ్రన్ దుస్తులు ఎక్కువగా ధరిస్తుండటంతో వాటికి అనుగుణంగా ఆభరణాలను తయారు చేస్తున్నట్టు దేశీయ బంగారం వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికీ బంగారం అమ్మకాల్లో 80 శాతం 22 క్యారెట్ల ఆభరణాలే ఉన్నప్పటికీ.. తక్కువ క్యారెట్ల ఆభరణాలకు క్రమంగా డిమాండ్ పెరుగుతున్నట్టు పేర్కొంటున్నారు. గాజులు హారాలదే హవా దేశంలో అమ్ముడవుతున్న బంగారు ఆభరణాల్లో గాజులు, హారాల వాటాయే అత్యధికం. మొత్తం అమ్మకాల్లో 30–40 శాతం వాటా గాజులు ఆక్రమించగా.. హారాల వాటా 30–40 శాతం ఉంటోంది. ఆ తర్వాత స్థానంలో నెక్లెస్‌లు 15–20 శాతం వాటా ఉంటే.. చెవిదిద్దులు, చేతి ఉంగరాల అమ్మకాలు 5–15 శాతం చొప్పున ఉంటున్నాయి. ఒక్కొక్క నెక్లెస్ కోసం సగటున 30 నుంచి 60 గ్రాములను వినియోగిస్తుంటే.. గాజుల కోసం 10 నుంచి 15 గ్రాములు, చెయిన్ల కోసం 10 నుంచి 20 గ్రాములు, ఉంగరాలు, చెవిదిద్దుల కోసం 3నుంచి 8 గ్రాముల వరకు బంగారాన్ని వినియోగిస్తున్నారు. పెళ్లి ఆభరణాల వాటా 55 శాతం దేశీయ ఆభరణాల అమ్మకాల్లో వివాహాల సందర్భంగా వినియోగించే ఆభరణాల వాటా 55 శాతం వరకు ఉంది. దేశంలో ఏటా సగటున 1.10 కోట్ల నుంచి 1.30 కోట్ల పెళ్లిళ్లు జరుగుతున్నట్టు అంచనా. ఆ తర్వాత పంటలు చేతికి వచ్చినప్పుడు, అక్షయ తృతీయ, ధన్‌తేరాస్ వంటి పర్వదినాల్లో బంగారం అమ్మకాలు అధికంగా జరుగుతున్నాయి. ఆ రోజుల్లో 60 టన్నుల బంగారం అమ్ముడవుతోంది. కాగా.. పట్టణ ప్రజలతో పోలిస్తే.. గ్రామీణులే అత్యధికంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారని వెల్లడైంది. మొత్తం బంగారం అమ్మకాల్లో 58 శాతం గ్రామీణ మధ్యతరగతి ప్రజలే కొంటున్నారు. రోజువారీ ధరించే నగల కొనుగోళ్ల వాటా 35 నుంచి 40 శాతం ఉండగా.. ఫ్యాషన్ జ్యూవెలరీ వాటా 5–10 శాతం వరకు ఉంది. దక్షిణాది ప్రజలు అత్యధికంగా ఇష్టపడే టెంపుల్ జ్యూవెలరీ, కుందన్ వంటి భారీ మోడల్స్‌ను ఇప్పుడు ఉత్తరాది వారు కూడా ధరించడానికి ఇష్టపడుతున్నట్టు సర్వే వెల్లడించింది. పెళ్లిలకు సగటున 35 నుంచి 250 గ్రాముల బరువుండే ఆభరణాలు కొనుగోలు చేస్తుంటే.. రోజువారీ ధరించేందుకు 5 నుంచి 30 గ్రాముల బరువుండే ఆభరణాలను కొంటున్నారు. ఫ్యాషన్ జ్యూవెలరీ అయితే.. 5 నుంచి 20 గ్రాములలోపు వినియోగిస్తున్నారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. -
Fashion: డ్రెస్ కలర్లో ఉండే ఫ్యాబ్రిక్ జ్యువెల్లరీ.. ఇప్పుడిదే ట్రెండ్!
ఆభరణం అంటే..మనకు బంగారం, వెండి ఇతర లోహాలతో చేసిన నగలే కళ్ల ముందు నిలుస్తాయి. అలా కాకుండా డ్రెస్ కలర్లో ఉండే ఫ్యాబ్రిక్ జ్యువెల్లరీ ఇప్పుడు ట్రెండ్‌లో ఉంది. డ్రెస్ ఫ్యాబ్రిక్‌నే జ్యువెల్రీ మేకింగ్‌లోనూ వాడుతూ ఆభరణాలను రూపొందించుకోవడంపై దృష్టి పెడుతోంది నేటి తరం. డ్రెస్‌ను పోలినట్టుగా ఉండే చెప్పులు, హ్యాండ్ బ్యాగ్ ఎంపిక మనకు తెలిసిందే. అలాగే, డ్రెస్‌లోని మెటీరియల్‌తోనే ఆభరణమూ ధరిస్తే... ఆ అందం ఇనుమడిస్తుందని నేటి వనితల ఆలోచన. అందుకే ఇలా ఫ్యాబ్రిక్‌తో రకరకాల ఆభరణాలు తయారు చేయడమే కాదు, వాటి ఎంపిక లోనూ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఒకేరంగులో చిన్న చిన్న మార్పులతో ఉండే ఈ ఆభరణాలు క్యాజువల్ వేర్‌గానూ, ఫ్యాషన్వేర్గానూ అందుబాటులో ఉంది. జరీ జిలుగులూ ఎంబ్రాయిడరీ మెరుగులు ఫ్యాబ్రిక్ దుస్తులపై ఎంబ్రాయిడరీ సొగసు గురించి మనకు తెలిసిందే. పట్టుచీరల అంచుల అందమూ పరిచయమే. ఎంబ్రాయిడరీ డ్రెస్ లేదా జరీ చీర పాతదైపోయిందని పక్కన పెట్టేసేవారు వాటి అంచులను జాగ్రత్తగా కట్ చేసి, ముచ్చటైన ఆభరణాలను రూపొందించుకోవచ్చు. వీటి తయారీలో కావల్సింది నచ్చిన క్లాత్, గట్టి ఫ్యాబ్రిక్, గమ్ లేదా సూదీ దారం, ఇయర్ హుక్స్... సెట్ చేసుకుంటే చాలు. కావల్సిన డిజైన్‌లో ఆభరణాలను రూపొందించుకొని డ్రెస్‌కు తగిన విధంగా ధరించవచ్చు. మేడ్ ఈజీ... వందల రూపాయల్లో అందరికీ అందుబాటులో ఉండే ధరలలో ఆకట్టుకునే ఈ ఆభరణాలు అన్ని వయసువారికీ ముఖ్యంగా కాటన్ డ్రెస్సులు, చీరల మీదకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వెస్ట్రన్ వేర్ మీదకూ వినూత్నంగా వెలిగిపోతున్న ఫ్యాబ్రిక్ జ్యువెలరీ మేకింగ్ కూడా సులువుగానే ఉండటంతో నేటి వనిత విభిన్న రకాల డిజైన్స్‌లో ఫ్యాబ్రిక్ ఆభరణాలను తీర్చిదిద్దుతోంది. జర్మన్ సిల్వర్, బోహో స్టైల్... ఫ్యాబ్రిక్‌ను మెడకు హారంగా, చెవులకు హ్యాంగింగ్స్‌లా సెట్ చేశాక మరిన్ని ఆకర్షణలు జోడించాలంటే ఏదైనా లోహాన్ని జత చేయచ్చు. అందుకు జర్మన్ సిల్వర్, ట్రైబల్ జ్యువెలరీ పీసెస్‌ను ఎంపిక చేసుకొని ఫ్యాబ్రిక్ జత చేయచ్చు. చదవండి: Surbhi Puranik: హీరోయిన్ సురభి ధరించిన లెహంగా ధరెంతో తెలుసా? -
పసిడి దిగుమతిపై ఆంక్షల సడలింపు
ముంబై: బంగారం దిగుమతులపై ఆంక్షలను రిజర్వు బ్యాంకు సడలించింది. ఇప్పటికే అనుమతించిన బ్యాంకులతో పాటు ఎంపిక చేసిన ట్రేడింగ్ హౌస్‌లను పసిడి దిగుమతులకు అనుమతించింది. విదేశీ వాణిజ్య డెరైక్టర్ జనరల్ (డీజీఎఫ్టీ) వద్ద నామినేటెడ్ ఏజెన్సీలుగా నమోదైన స్టార్ ట్రేడింగ్ హౌస్‌లు, ప్రీమియర్ ట్రేడింగ్ హౌస్‌లు ఇకనుంచి 20:80 ఫార్ములా ప్రకారం పుత్తడిని దిగుమతి చేసుకోవచ్చు. ఈ మేరకు రిజర్వు బ్యాంకు బుధవారం ఓ నోటిఫికేషన్ జారీచేసింది. భారీగా పెరిగిపోయిన కరెంటు అకౌంటు లోటు(క్యాడ్)ను, రూపాయి పతనాన్ని అదుపుచేసేందుకు రిజర్వు బ్యాంకు గత జూలైలో బంగారం దిగుమతులపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. కొన్ని బ్యాంకులకు మాత్రమే... అది కూడా 20:80 ఫార్ములాతో దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. దిగుమతి చేసుకున్న బంగారంలో ఐదో వంతును, అంటే 20 శాతాన్ని తిరిగి ఎగుమతి చేయడమే ఈ ఫార్ములా. 2012-13లో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 4.8 శాతంగా ఉన్న కరెంటు అకౌంటు లోటు ప్రభుత్వ చర్యల ఫలితంగా 2013-14లో సుమారు 1.7 శాతానికి తగ్గిపోయిందని అంచనా. గతేడాది ఆగస్టులో అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ.69గా ఉండగా ప్రస్తుతం అది రూ.59 దిగువ స్థాయికి చేరింది. ఆభరణాల తయారీదారులు, బులియన్ డీలర్లు, బ్యాంకులు, వ్యాపార సంస్థల విజ్ఞప్తి మేరకు ఆంక్షలను సడలించారు. బీఎంబీ డిపాజిట్లకు ఇక మరింత రక్షణ! భారతీయ మహిళా బ్యాంక్(బీఎంబీ) డిపాజి టర్లకు మరింత రక్షణ కల్పించే కీలక చర్యను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం తీసుకుంది. ఆర్బీఐ చట్టం, 1934 రెండవ షెడ్యూల్లో బ్యాం క్‌ను చేర్చుతున్నట్లు ఒక నోటిఫికేషన్లో తెలిపింది. దీనిప్రకారం కమర్షియల్ బ్యాంక్ కేటగిరీలోకి బీఎంబీ చేరుతుంది. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన బ్యాంక్ ఇది. రూ.1,000 కోట్ల ముందస్తు మూలధనంతో 2013 నవంబర్ నుంచీ బ్యాంక్ కార్యకలాపాలను ప్రారంభించింది.