ఝాన్సీరాణిది హత్యే..?
♦ పురుగుల మందు తాగించి హత్య చేసిన తల్లి, భర్త!
♦ ఝాన్సీని చంపేస్తానని భర్త చెప్పిన ఆడియో రికార్డు స్వాధీనం
♦ కేసు విచారణ 80 శాతం పూర్తయింది: సీఐ వెంకటేశ్వరరావు
నకిరేకల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వివాహిత ఝాన్సీరాణి అనుమానాస్పద మృతి అంశం మరో మలుపు తిరిగింది. ఝాన్సీరాణిది ఆత్మహత్య కాదని.. ఆమె తల్లి, భర్త కలసి ఆమెను హత్య చేశారని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. ఆ ఇద్దరూ కలసి ఝాన్సీకి బలవంతంగా పురుగుల మందు తాగించి చంపినట్లుగా భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఝాన్సీ తల్లి పద్మ, భర్త విజేందర్‌రెడ్డి పోలీసు విచారణలో అంగీకరించారని.. నకిరేకల్‌లోని ఓ ఫెర్టిలైజర్ షాప్‌లో పురుగుల మందును విజేందర్రెడ్డే కొనుగోలు చేసినట్లు నిర్ధారణ అయిందని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ కేసు దర్యాప్తు వివరాలను పోలీసులు వెల్లడించడం లేదు. 80 శాతం విచారణ పూర్తయిందని మాత్రం చెబుతున్నారు. పద్మ, విజేందర్రెడ్డిలతో పాటు ఝాన్సీ స్నేహితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో కేసు మిస్టరీని బహిర్గతం చేయనున్నట్లు తెలుస్తోంది.
మలుపు తిప్పిన ఫిర్యాదు లేఖలు
తనకు న్యాయం చేయాలంటూ డీజీపీ, విమెన్ ప్రొటెక్షన్ సెల్, జిల్లా జడ్జి, ఎస్పీ, నకిరేకల్ పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఝాన్సీ పేరుతో వెళ్లిన లేఖలే ఈ కేసును ఛేదించేందుకు ఉపయోగపడినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... గత నెల 23న విజేందర్‌రెడ్డి ఝాన్సీ చదివే కాలేజీ వద్దకు వెళ్లాడు. మరునాడు ఫేర్వెల్ పార్టీ ఉందని, ఆ ఒక్కరోజు ఝాన్సీని అక్కడ ఉండనివ్వాలని ఆమె స్నేహితులు కోరినా వినకుండా నకిరేకల్‌కు తీసుకువచ్చాడు. అదే రోజున తనతో కాపురం చేయాల్సిందిగా ఝాన్సీని విజేందర్ హింసించినట్టు తెలుస్తోంది.
తల్లి చెప్పినా కూడా ఆమె వినలేదని.. దాంతో ఆగ్రహంతో విజేందర్, పద్మ కలసి ఝాన్సీకి బలవంతంగా పురుగుల మందు తాగించి, గదిలో బంధించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఝాన్సీ మృతదేహాన్ని విజేందర్ స్వగ్రామమైన నల్లగొండ మండలం దీపకుంటకు తరలించి దహనం చేశారని తెలుస్తోంది. ఇంతకు ముందు కూడా ఝాన్సీకి ఇష్టం లేకున్నా తనతో కాపురం చేయాలంటూ విజేందర్ హింసించేవాడని, తన మెడపై భర్త పెట్టిన కత్తి గాట్లను ఆమె తన స్నేహితులకు చూపించిందని పోలీసుల విచారణలో వెల్లడైంది.
లోతుగా విచారణ...
కేసు విచారణలో భాగంగా హైదరాబాద్‌లోని నాదర్గుల్లో ఝాన్సీ చదువుతున్న ఎంవీఎస్ఆర్ కళాశాలలోనూ పోలీసులు దర్యాప్తు చేశారు. సాయిరామ్‌ను వారు ప్రశ్నించగా... ఝాన్సీ తనకు స్నేహితురాలు మాత్రమేనని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఐఎస్ సదన్‌లో ఝాన్సీ ఉన్న హాస్టల్ వార్డెన్ నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. ఝాన్సీ ఎముకలు, బూడిదను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఇక గత నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు నకిరేకల్‌లోని ఓ ఫెర్టిలైజర్ షాప్‌లో విజేందర్ పురుగుల మందును కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
చంపేయాలన్న ఉద్దేశంతోనే..
ఝాన్సీని చంపేయాలని విజేందర్ ఎప్పుడో నిర్ణయించుకున్నాడని దర్యాప్తులో తేలినట్టు సమాచారం. తనతో పెళ్లయి రెండేళ్లవుతున్నా భర్తగా అంగీకరించడం లేదని, కాపురం చేయడం లేదనే ఆగ్రహంతో, కళాశాలలో ఝాన్సీ స్నేహితుడు సాయిరాంతో ఆమెకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో విజేందర్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఝాన్సీ తన దుస్థితి గురించి స్నేహితులకు చెప్పి బాధపడేదని, సాయిరామ్‌కు కూడా అలాగే చెప్పడంతో.. అతను విజేందర్కు ఓ ఎస్సెమ్మెస్ పంపాడని, దాంతో సాయిరామ్‌కు విజేందర్ ఫోన్ చేసి మాట్లాడాడని సమాచారం. తాను తలచుకుంటే 20 లక్షల కట్నంతో తనకు పిల్లనిస్తారని, ఝాన్సీ తన మాట వినకుంటే చంపేస్తానని విజేందర్‌రెడ్డి ఆ ఫోన్ సంభాషణలో చెప్పిన ఆడియో రికార్డింగ్ పోలీసులకు లభించినట్లు తెలుస్తోంది. ఝాన్సీ తల్లి పద్మ కూడా సాయిరామ్‌కు ఫోన్ చేసి బెదిరించిన ఆడియో కూడా దొరికినట్లు సమాచారం.
లేఖలు పంపిందెవరు?
ఝాన్సీని 23వ తేదీన హైదరాబాద్ నుంచి నకిరేకల్‌కు విజేందర్ తీసుకెళ్లాడు. 24వ తేదీన సరూర్‌నగర్ పోస్టాఫీసు నుంచి స్పీడ్‌పోస్టులో ఆమె పేరిట లేఖలు జిల్లా అధికారులకు వచ్చాయి. ఆ లేఖలను ఝాన్సీ స్నేహితుడు సాయిరామ్ పంపాడని పోలీసులు తొలుత సందేహించారు. తాను పంపలేదని సాయిరామ్ పోలీసులకు చెప్పడంతో.. పోస్టాఫీసులోని సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా లేఖలు పంపిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
80శాతం మేర కేసు పురోగతి
ఝాన్సీ మృతి కేసు విచారణ 80 శాతం పూర్తయింది. త్వరలోనే మిస్టరీ ఛేదిస్తాం. ఝాన్సీ భర్త విజేందర్‌రెడ్డి నకిరేకల్‌లోని ఓ ఫెర్టిలైజర్ షాపులో పురుగుల మందు కొనుగోలు చేసినట్టు మా దర్యాప్తులో తేలింది. ఝాన్సీ పురుగుల మందు కారణంగా మరణించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఝాన్సీయే పురుగుల మందును తాగింది, లేక ఆమె తల్లి, భర్త తాగించి హత్య చేశారా అన్నది తేలాల్సి ఉంది.
- వెంకటేశ్వరరావు, నకిరేకల్ సీఐ