ఝాన్సీరాణిది హత్యే
* తల్లి, భర్తే నిందితులు: డీఎస్పీ
* పురుగుల మందు తాగించి మట్టుబెట్టిన వైనం
నకిరేకల్: వివాహిత ఝాన్సీరాణిది హత్యేనని తేలింది. కాపురం చేయడంలేదని కన్నతల్లి, భర్త పురుగులమందు తాగించి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. గురువారం డీఎస్పీ సుధాకర్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన పద్మ కుమార్తె ఝాన్సీరాణికి విజేందర్‌రెడ్డితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఝాన్సీకి ఈ పెళ్లి ఇష్టం లేదు.
కాపురం చేయాలని విజేందర్‌రెడ్డి కోరగా బీటెక్ పూర్తయ్యే వరకు తనను ఇబ్బంది పెట్టొద్దని వేడుకుంది. గత నెల 23తో ఆమె బీటెక్ పూర్తయ్యింది. అదేరోజు విజేందర్‌రెడ్డి ఆమెను నకిరేకల్‌కు తీసుకువచ్చి లొంగతీసుకోవాలని ప్రయత్నించగా ప్రతిఘటించింది. దీంతో భర్త, తల్లి కలసి గత నెల 24న పురుగులమందు తాగించి హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని ఝాన్సీ సోదరుడు శివశంకర్‌రెడ్డి, అత్తమామ జయమ్మ, జానకిరామ్‌రెడ్డి, కిరణ్‌కుమార్, అజయేందర్‌రెడ్డితో కలసి నల్లగొండ మండలం దీపకుంటకు తీసుకెళ్లి దహనం చేశారు. ఝాన్సీరాణి పేరిట వచ్చిన లేఖల ఆధారంగానే కేసును ఛేదించినట్టు డీఎస్పీ తెలిపారు. అయితే ఆ లేఖలు ఎవరు పంపారనేది ఇంకా తేలలేదని చెప్పారు.