జీహాదీలకు సహకరించొద్దు!
బాగ్దాద్/న్యూఢిల్లీ: ఇరాక్‌లో అంతర్యుద్ధానికి కారణమైన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్(ఐఎస్ఐఎల్) లాంటి సంస్థలకు ఆర్థికసాయం చేస్తున్న దేశాలు.. చివరకు అదే ప్రమాదాన్ని ఎదుర్కోక తప్పదని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ వ్యాఖ్యానించారు. ఇరాక్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ముందుకురావాలని గల్ఫ్ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఇరాక్ వెళ్లిన కెర్రీ సోమవారం ప్రధానమంత్రి నౌరి అల్ మాలికి సహా పలువురు కీలక రాజకీయ, మత నేతలతో చర్చలు జరిపారు. తిరుగుబాటును అణచేందుకు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని వారికి సూచించారు. కెర్రీ ఇరాక్ వెళ్లిన రోజే.. హషిమియా పట్టణంలో ఖైదీలను తీసుకువెళ్తున్న భద్రతాబలగాలపై మిలిటెంట్లు చేసిన దాడిలో 69 మంది ఖైదీలు, 9 మంది పోలీసులు మరణించారు.
తిరుగుబాటుదారుల చేతికి తల్ అఫార్
ఇరాక్‌లో సున్నీ తిరుగుబాటుదారుల ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా షియాలు అధికంగా ఉన్న వ్యూహాత్మక పట్టణం తల్ అఫార్ను, అక్కడి విమానాశ్రయాన్ని కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. హోరాహోరీ పోరు అనంతరం ఇరాక్ భద్రతాబలగాలు ఆ పట్టణం నుంచి వెనక్కుతగ్గాయి. దీంతో సిరియా సరిహద్దు ప్రాంతాలన్నీ ప్రభుత్వ నియంత్రణలో లేకుండాపోయాయి. ఇరాక్, సిరియాలను కలిపి ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాగా మార్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న సున్నీ జీహాదీలు ఇప్పటివరకు ఇరాక్‌లోని ఐదు రాష్ట్రాల్లోని అత్యధిక ప్రాంతాలపై అదుపు సాధించారు. కాగా, నజాఫ్‌లో ఓ కంపెనీలో పనిచేస్తున్న ఒక భారతీయుడు గుండెపోటుతో మరణించాడని వార్తలు వచ్చాయని, అందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని భారత ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. మోసుల్‌లో కిడ్నాప్‌నకు గురైన 39 మంది భారతీయులను విడిపించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపింది. భారతీయులు ఉద్యోగాలు చేస్తున్న 12 కంపెనీలతో ఇరాక్‌లోని దౌత్యాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొంది.