'సింగిల్స్ డే' అమ్మకాల్లో రికార్డ్.. రూ.10 లక్షల కోట్ల వ్యాపారం
చైనాలో 'సింగిల్స్ డే' పేరుతో నిర్వహించే ఆన్లైన్ షాపింగ్ సేల్‌లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిగాయి. తాజాగా జరిగిన ఆన్లైన్ షాపింగ్ సేల్‌లో దాదాపు రూ.10 లక్షల కోట్లు(139 బిలియన్ డాలర్లు) విలువైన వ్యాపారం జరిగింది. మునుపెన్నడూ లేనంతగా చైనీయుల షాపింగ్ చేసినట్లు వెల్లడైంది. కరోనావైరస్ మహమ్మారి వల్ల ఖర్చు తగ్గినప్పటికి గత సంవత్సరం రికార్డును బద్దలు కొట్టారు. గతేడాది 'సింగిల్స్ డే' సందర్భంగా రూ.5 లక్షల కోట్లు(74 బిలియన్ డాలర్లు) విలువ చేసే అమ్మకాలు జరిగాయి.
నవంబర్ 1 నుంచి నవంబర్ 11 వరకు సాగిన సింగిల్స్ డే ఆన్లైన్ షాపింగ్ సేల్‌లో అలీబాబా పోర్టల్ ద్వారా 84.5 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిగినట్లు కంపెనీ తెలిపింది. దాని ప్రధాన ప్రత్యర్థి JD.com ఈ ఏడాది 54.6 బిలియన్ డాలర్లు లావాదేవీలను జరిపినట్లు పేర్కొంది. సాధారణంగా నవంబర్ 11న ముగిసే ఈ సింగిల్స్ డే ఈవెంట్ ప్రపంచంలోని అతిపెద్ద ఆన్ లైన్ షాపింగ్ ఫెస్టివల్. వినియోగదారులను ఆకర్షించడానికి బ్రాండ్లు, వ్యాపారులు భారీగా డిస్కౌంట్లను అందించడంతో జోరుగా ప్రచారం జరిగింది. దీంతో ఈ ఏడాది గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు భారీగా జరిగాయి.
(చదవండి: యాపిల్ తిక్క కుదిరింది.. ఉద్యోగులకు రూ.223 కోట్లు చెల్లింపు)
సింగిల్స్ డే అంటే..?
అలీబాబా గ్రూప్ 2009 నవంబరు 11న మొదటి సారి 'సింగిల్స్ డే' పేరుతో షాపింగ్ ఫెస్టివల్‌ను ప్రారంభించింది. 11వ నెల, 11వ తేదీలో అన్నీ ఒకట్లు ఉండటంతో ఈ రోజును 'సింగిల్స్ డే' పేరుతో పిలుస్తారు. ఈ సమయంలో కంపెనీలు పలు ఆఫర్లు ప్రకటిస్తుండటం వల్ల ప్రజలు కూడా భారీ స్థాయిలో కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇది కేవలం ఆన్లైన్ షాపింగ్ ఈవెంట్ కాకుండా, చైనా ఆర్థిక వ్యవస్థలో అతి ముఖ్యమైన అంతర్గత చలామణి సమయమని అక్కడి ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. టెస్ట్ రైడ్‌కి మీరు సిద్ధమా?)