‘ఆమెను చంపేసినవారికి మిలియన్ డాలర్లిస్తాం’
లండన్: కుర్దీష్-దానిష్ మహిళను చంపేసే వారికి తాము మిలియన్ డాలర్లు ఇస్తామంటూ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. కనీసం ఆమె జాడ అయినా తమకు తెలియజేయాలంటూ కోరింది. యూనివర్సిటీ విద్యను వదిలేసిన జోనా పలానీ (23) అనే కుర్దీష్ మహిళ.. 2014లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నడుంకట్టింది. సిరియా, ఇరాక్‌లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో పోరాటానికి దిగి పలువురిని హతం చేసి వార్తల్లోకెక్కింది. ఇది చూసి జీర్ణించుకోలేకపోతున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆమెను ఎలాగైనా హత్య చేయాలని కుట్రలు చేస్తున్నారు.
అయితే, ఆమె ప్రస్తుతం కోపెన్ హాగన్ జైలులో ఉంది. 2015 జూన్‌లో ఆమెపై ఎక్కడికి వెళ్లొద్దంటూ డెన్మార్క్ విధించిన నిషేధాన్ని అతిక్రమించిందని జైలులో పెట్టారు. రేపటి నుంచి విచారణ మొదలుకానుంది. నిజంగానే ఆమె నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే దాదాపు రెండేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. పలానీకి బెదిరింపులు రావడం ఇది తొలిసారేం కాదు. ‘నేను సైనికురాలిగా పనిచేస్తే డెన్మార్క్, ఇతర దేశాలకు ఎందుకు ప్రమాదమో నాకు అర్దం కావడం లేదు. ఇస్లామిక్ స్టేట్ ను డెన్మార్క్ కూడా అంతమొందించాలని అనుకుంటుంది కదా’ అంటూ ఆమె తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. పాలిటిక్స్ లో డిగ్రీ చదువుతున్న జోనా మధ్యలోనే చదువు మానేసి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు కుర్దీష్ సేనల్లో చేరింది.