నైపుణ్యముంటే.. కొలువుకు కొదవలేదు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో విద్యనభ్యసించి నైపుణ్యం కనబరిచిన వారికి ఉద్యోగ అవకాశాలు వెదుక్కుంటూ వస్తున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) గణాంకాలను చూస్తే ఈవిషయం స్పష్టమవుతుంది. ఆ గణాంకాల ప్రకారం గత ఏడాదిలో దేశంలోని వివిధ విద్యాసంస్థల్లో చదివిన వారిలో 7.77 లక్షల మందికి ప్లేస్మెంట్స్ లభించాయి. వీటిలో అత్యధికం ఇంజనీరింగ్ తదితర టెక్నాలజీ కోర్సులలోని వారికే దక్కాయి. టెక్నాలజీలో నైపుణ్యం ఉన్న వారికి కరోనా కాలంలోనూ కొలువులకు కొదవలేదని నిపుణులు చెబుతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నియామకాల సరళి కూడా దీనిని స్పష్టం చేస్తోంది. గతంలో కన్నా 20 శాతం పెరుగుదలతో ప్యాకేజీ ఆఫర్లు అందాయని ఆ గణాంక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఐఐటీ విద్యార్థులు అంతర్జాతీయంగానే కాదు, దేశీయంగానూ అత్యధిక వేతన ప్యాకేజీలు అందుకుంటున్నారు. ఈ సంవత్సరం దేశీయ సంస్థలలో ముఖ్యంగా క్లౌడ్ ఆధారిత టెక్ సంస్థలు అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నాయి. ఆర్అండ్డీ విభాగాల్లో ఐఐటీ గ్రాడ్యుయేట్లకు అధిక డిమాండ్ ఉంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనాలసిస్ వంటి వాటిలో నైపుణ్యాలున్న విద్యార్థులకు అధిక ప్యాకేజీలను ఇవ్వడానికి కంపెనీలు ముందుకు వస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా కారణంగా క్యాంపస్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలు ఆన్లైన్లో వర్చువల్గా నిర్వహిస్తున్నారు.
అ‘ధర’గొడుతున్న ప్యాకేజీలు
ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ ముంబై, ఐఐటీ ఖరగ్పూర్ సహా ఇతర ఐఐటీల విద్యార్థులు అంతర్జాతీయ ఆఫర్లను ఎక్కువగా అందుకుంటున్నారు. ఆయా ఐఐటీలు వెలువరిస్తున్న గణాంకాల ప్రకారం.. అంతర్జాతీయ సంస్థల ఆఫర్లలో డచ్ సంస్థ ఆప్టివర్ ఈ ఏడాది ఐఐటీ ముంబైలో చేపట్టిన డ్రైవ్లో గరిష్టంగా 1.39 కోట్ల ప్యాకేజీని ఇచ్చింది. సోనీ సంస్థ (జపాన్) రూ. 1.14 కోట్లు, హోండా –ఆర్అండ్డి (జపాన్) రూ. 57.85 లక్షలు, తైవాన్ సెమీకండక్టర్ తయారీ సంస్థ రూ. 53.52 లక్షలు, క్వాల్కమ్ రూ. 46.41 లక్షలు, వరల్డ్క్వాంట్ రూ. 39.70 లక్షలు, మోర్గాన్ స్టాన్లీ రూ. 37.25 లక్షలు, ఉబెర్ రూ.35.38 లక్షలు, ఎన్ఇసి (జపాన్) రూ. 34.73 లక్షలు ప్యాకేజీని ఇచ్చాయి.
⇔ ఐఐటీ రూర్కీ విద్యార్థులలో గరిష్ట వేతనం ఈ ఏడాది రూ. 80 లక్షల వరకు వచ్చింది. గత ఏడాదిలో రూ. 60 లక్షలు మాత్రమే. జాతీయ సంస్థలతో పాటు ఏడు అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ నియామక డ్రైవ్ చేపట్టాయి. ఇక్కడ 484 మందికి మంచి ఆఫర్లు వచ్చాయి.
⇔ ఐఐటి గువహటి విద్యార్థికి గత ఏడాదిలో గరిష్ట వేతనం రూ. 52 లక్షలు కాగా ఈ ఏడాది రూ. 70 లక్షల వరకు పెరిగింది. ఈసారి నాలుగు అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ ప్లేస్మెంట్స్ను నిర్వహించాయి. 353 మందికి ప్లేస్మెంట్లు వచ్చాయి.
⇔ ఐఐటీ కాన్పూర్లో ఈ ఏడాది చేపట్టిన ప్లేస్మెంట్సులో అత్యధిక దేశీయ ఆఫర్ రూ. 82 లక్షలు. గతేడాది కన్నా ఇది 32 శాతం ఎక్కువ.
దేశీయ ప్యాకేజీల్లోనూ పెరుగుదల
ఈ ప్లేస్మెంట్ సీజన్లో ఐఐటీ విద్యార్థులకు అంతర్జాతీయ సంస్థల ఆఫర్లను మించి దేశీయ టెక్ సంస్థలు వేతనాలు ప్రకటిస్తుండడం విశేషం. గతంతో పోలిస్తే 30 నుంచి 35 శాతం అధికంగా వేతనాలు పెరిగాయి. మద్రాస్, రూర్కీ, గువహటి తదితర ఐఐటీల్లో దేశీయ సంస్థలు ప్రకటించిన వేతనాలు అంతర్జాతీయ ప్యాకేజీలను దాటాయి. విదేశాలకు వెళ్లేకన్నా దేశంలోనే ఉంటూ అంతకన్నా ఎక్కువ సంపాదించే అవకాశం ఉండటంతో దేశీయ కంపెనీలవైపు విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. మైక్రోసాఫ్ట్, ఉబర్ వంటి సంస్థలతో పోటీపడుతూ.. ఎమ్టీఎక్స్ గ్రూప్, క్వాంట్బాక్స్ రీసెర్చ్, గ్రావిటన్ వంటి సంస్థలు టెక్ విద్యార్థులకు రూ. 70 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నాయి.
ఏఐసీటీ ఈ గణాంకాల ప్రకారం ఆయా విభాగాలలో ప్లేస్మెంట్లు దక్కిన వారి సంఖ్య..
విభాగం
దేశంలో
ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్
649
ఆర్కిటెక్చర్ ప్లానింగ్
2,184
డిజైన్
104
ఇంజనీరింగ్, టెక్నాలజీ
6,05,297
మేనేజ్మెంటు
1,15,599
ఎంసీఏ
17,219
ఫార్మసీ
33,428
హోటల్ మేనేజ్మెంటు
2,555
మొత్తం
7,77,035
గత ఐదేళ్లలో ప్లేస్మెంట్సు ఇలా
2015–16
7,01,527
2016–17
7,22,868
2017–18
7,15,918
2018–19
7,94,815
2019–20
7,77,035
ఏపీలో గత ఐదేళ్లలో ఇలా
2015–16
56,359
2016–17
60,404
2017–18
61,431
2018–19
75,028
2019–20
74,204
నైపుణ్యమే ప్రధానం..
కరోనా తరువాత ప్రపంచం డిజిటల్ యుగంలోకి చొచ్చుకుపోతోంది. 3డీ ప్రింటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్సెస్లే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో నైపుణ్యం, విభిన్నమైన ఆలోచనలు, సృజనాత్మకత ఉన్న వారికి ఎక్కువ అవకాశాలు దక్కుతాయి. ప్లేస్మెంట్ ఇచ్చే సంస్థలు ఇకపై విద్యా సంస్థలకు ప్రాధాన్యమిచ్చే పరిస్థితి ఉండదు. విద్యార్థుల్లోని నైపుణ్యాలనే పరిగణనలోకి తీసుకుంటాయి. ప్రస్తుతం పలు డిజిటల్ సైట్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిద్వారా నైపుణ్యాలు పెంపొందించుకొనే వారికి అవి స్కోర్లు ఇస్తున్నాయి. ఆ స్కోర్లు బాగా ఉన్న వారిని కంపెనీలు ఆన్లైన్లోనే పరీక్షించి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. రానున్న కాలంలో క్యాంపస్ ఎంపికలు ఉండకపోవచ్చు. – ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి, ఉపకులపతి, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం
సామర్థ్యాలు పెంచుకోవాలి
ఐఐటీల్లో చదివే విద్యార్థులలోనే కాకుండా ఇతర కాలేజీ విద్యార్థుల్లో కూడా మంచి తెలివి తేటలుంటాయి. విద్యార్థులు ఆత్మస్థయిర్యంతో నైపుణ్యాలను వ్యక్తపరిచే సామర్థ్యాలు అలవర్చుకోవాలి. నైపుణ్యముంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. విద్యార్థులకు మార్కులు, ర్యాంకులే కాకుండా మారుతున్న ప్రపంచానికి అవసరమైన పరిజ్ఞానం, నైపుణ్యాలను వారికి నేర్పిస్తున్నాం. కరోనా సమయంలోనూ శిక్షణ ఇవ్వడంతో మంచి అవకాశాలు విద్యార్థులకు వచ్చాయి. – డాక్టర్ వి.మధుసూదనరావు, రెక్టార్, వీ.ఎం.రావు, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విశాఖపట్నం