భారత్‌లో కొలువుల జోరు!
కలసి వస్తున్న దేశీయ వ్యాపారాల్లో వృద్ధి
అమెరికన్ ఎక్స్‌ప్రెస్, సీఎఫ్‌ఓ రీసెర్చ్ వెల్లడి
న్యూఢిల్లీ: భారత్‌లో ఉద్యోగావకాశాలు వేగంగా వృద్ధి చెందగలవన్న అంచనాలున్నాయని ఒక నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారత్‌లోనే ఉద్యోగావకాశాలు వేగంగా వృద్ధి చెందుతాయని కార్పొరేట్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతమున్న వ్యాపారాల్లో వృద్ధి ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తుందని వారు భావిస్తున్నారు. సీఎఫ్‌ఓ రీసెర్చ్ సంస్థతో కలసి అమెరికన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వే నివేదిక ప్రకారం... ఉద్యోగావకాశాలు భారత్‌లోనే అధికంగా ఉన్నాయని 78 శాతం మంది అభిప్రాయపడ్డారు.
భారత్ తర్వాతి స్థానాల్లో అమెరికా(61 శాతం), చైనా (50 శాతం) నిలిచాయి. ఆర్థిక వృద్ధి జోరుగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కంట్రీ బిజినెస్ హెడ్ గ్లోబల్ కార్పొరేట్ పేమెంట్స్ సరు కౌశాల్ చెప్పారు. ఆర్థిక వృద్ధే కాకుండా ఉద్యోగాలు కూడా భారత్‌లోనే అధికంగా రానున్నాయని పేర్కొన్నారు. అయితే ప్రతిభ గల ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. ఉద్యోగాలు చేయడానికి తగిన నైపుణ్యాలున్న అభ్యర్థులను తయారు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తమ తమ కంపెనీల్లో ఇటీవల కాలంలో ఆదాయం కంటే ఉద్యోగుల భర్తీ పెరిగిందని భారత్ నుంచి సర్వేలో పాల్గొన్నవారిలో 29 శాతం మంది అభిప్రాయపడ్డారు.