ఇండిపెండెంట్‌గా జశ్వంత్ పోటీ
నేడు బార్మర్ నుంచి నామినేషన్
పార్టీ అభ్యర్థిగానా కాదా అన్నది వారే తేల్చాలి
పార్టీలో విభేదాలున్నాయి...
అవి తిరుగుబాట్లుగా మారొచ్చు
జోధ్‌పూర్: బీజేపీ తనకు టికెట్ ఇవ్వకపోవడంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తంచేసిన ఆ పార్టీ ప్రముఖుడు జశ్వంత్ సింగ్(76) తన సొంత నియోజకవర్గం బార్మర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగనున్నట్లు ఆదివారమిక్కడ ప్రకటించారు. ‘‘అవును, నేను రేపు బార్మర్ నుంచి నామినేషన్ వేస్తున్నాను. స్వతంత్ర అభ్యర్థా కాదా అన్నది పార్టీ వైఖరిపై ఆధారపడి ఉంటుంది’’ అని ఆయన అన్నారు.
ప్రస్తుతం డార్జిలింగ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జశ్వంత్.. బార్మర్ సీటు టికెట్‌ను తనకు కాకుండా కాంగ్రెస్ నుంచి వచ్చిన సోనారామ్ చౌదరికి ఇవ్వడంపై శనివారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పార్టీకి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించగా.. ‘‘నేను పార్టీకి 48 గంటల గడువిచ్చాను. అయితే ఇంతవరకు నన్నెవరూ పార్టీ తరఫున సంప్రదించలేదు.
నా సహచరులు, సన్నిహితులతో మాట్లాడి పార్టీలో ఉండాలా లేదా అన్నది నిర్ణయించుకుంటాను’’ అని అన్నారు. తన సొంత నియోజకవర్గంపై, తన సొంత ప్రజలపై తాను సెంటిమెంటల్‌గా లేకపోతే, ఇక ఏ విషయంలో ఉండాలని ఆయన ప్రశ్నించారు. మీ సేవలను తదనుగుణంగా వినియోగించుకుంటామని రాజ్‌నాథ్ సింగ్ అంటున్నారని అనగా.. తానేమీ ఫర్నీచర్‌ను కాదన్నారు.
పార్టీ గెలిచాక ప్రభుత్వంలో ఏదైనా పదవి ఇస్తారన్న వార్తలపై ప్రశ్నించగా.. అలాంటిదేమీ తనకు అవసరం లేదని, వాళ్ల దగ్గరే ఉంచుకోమని అన్నారు. రాజస్థాన్‌లో జశ్వంత్ మద్దతుదారులు నరేంద్ర మోడీ పోస్టర్లను చించేయడంపై ప్రశ్నించగా.. దీన్ని బట్టి ఏం జరుగుతోందన్నది పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సర్దుబాటు రాజకీయాలు తనకు పడవన్నారు. అంతర్గత కుమ్ములాటల వల్ల బీజేపీ నష్టపోతుందని చెప్పారు. పార్టీలో విభేదాలు బయటపడుతున్నాయని, ఇవి తిరుగుబాట్లుగా మారే అవకాశముందని, పార్టీ ముందే మేలుకుంటే మంచిదని అన్నారు.
తండ్రి వెంటే తనయుడు!
జశ్వంత్ సింగ్ కుమారుడు, రాజస్థాన్ ఎమ్మెల్యే మన్వీంద్ర సింగ్.. తన తండ్రి అడుగుజాడల్లోనే నడిచే అవకాశముందని సంకేతాలిచ్చారు. రాజస్థాన్ సీఎం వసుంధర రాజే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తలపెట్టిన సమావేశానికి ఆయన ఉద్దేశపూర్వకంగా గైర్హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యం రీత్యా ఆయన నెలపాటు సెలవు తీసుకున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అశోక్ పర్ణమి తెలిపారు.
జశ్వంత్‌కు మద్దతుగా బీజేపీ కార్యకర్తల ఆందోళన
జశ్వంత్‌కు టికెట్ ఇవ్వకపోవడానికి నిరసనగా పలువురు బీజేపీ జిల్లా కమిటీ సభ్యులు ఆదివారం పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చారు. సమావేశం నిర్వహించి.. జశ్వంత్‌కు బార్మర్ టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘కాదు’ అన్న దాన్నీ నవ్వుతూ స్వీకరించాలి: జైట్లీ
జశ్వంత్ ఇప్పటికే పార్టీలో పలు పదవులు అనుభవించారని, పార్టీ పట్ల ఆయన విధేయతకు ప్రస్తుత పరిస్థితులు పరీక్షలాంటివని బీజేపీ నాయకుడు అరుణ్ జైట్లీ అన్నారు. పార్టీ ‘కాదు’ అని చెప్పినప్పుడు దాన్ని కూడా ఆయన నవ్వుతూ స్వీకరించాలన్నారు.
స్వతంత్ర బరిలో మరో నేత!: రాజస్థాన్‌లోని సికార్ లోక్‌సభ టికెట్‌ను నిరాకరించినందుకు మరో సీనియర్ బీజేపీ నేత సుభాష్ మహారియా సైతం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ఆదివారం ప్రకటించారు. 26న ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు.