గూగుల్ మేనేజర్‌ను చంపిందీ సీరియల్ జాగర్ కిల్లరా?
న్యూయార్క్: గూగుల్ న్యూయార్క్ కార్యాలయంలో అకౌంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న వనెస్సా మర్కోటి (27) హత్య జరగడానికి ఐదు రోజుల ముందే న్యూయార్క్‌లో స్పీచ్ పాథలోజిస్ట్గా పనిచేస్తున్న 30 ఏళ్ల కరీనా వెట్రానో కూడా జాగింగ్‌కు వెళ్లినప్పుడే హత్యకు గురయ్యారు. ఇద్దరు ఆకర్షణీయమైన యువతులే. ఇద్దరు కూడా న్యూయార్క్‌లో నివసిస్తున్న వారే. ఇద్దరిపై కూడా లైంగిక దాడి జరిపి హత్య చేశారు. ఇద్దరిని హత్య చేసినదీ ఒకే హంతకుడై ఉండవచ్చని, అతను సీరియల్ జాగర్ కిల్లర్ అయివుండవచ్చని న్యూయార్క్ పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పుడే తొందరపడి ఒక నిర్ణయానికి రాలేమని వారు చెప్పారు.
న్యూయార్క్ గూగుల్ కార్యాలయంలో మేనేజర్‌గా పనిచేస్తున్న వనెస్సా ఆదివారం నాడు మసాచుసెట్స్‌లో నివసిస్తున్న తన తల్లిని చూడడానికి వెళ్లి అక్కడ జాగింగ్ చేస్తూ హత్యకు గురైన విషయం తెల్సిందే. (గూగుల్ మేనేజర్ ను రేప్ చేసి హత్య చేశారు) అంతకు ఐదు రోజుల ముందు ఆగస్టు రెండవ తేదీన కరీనా సైకిల్‌పై జాగింగ్‌కు వెళ్లి పొదల్లో అత్యచారం, హత్యకు గురయ్యారు. ఆమె తండ్రి ఫిల్ వెట్రానో మరణించిన కూతురు సహాయార్థం ‘గోఫండ్‌మీ’ ఫేస్బుక్ పేజీ ప్రారంభించగా ఇంతవరకు లక్షడాలర్ల విరాళం అందింది. తన కూతురు హంతకుడిని పట్టిచ్చిన వ్యక్తికి 20వేల డాలర్ల రివార్డును న్యూయార్క్ పోలీసులు ప్రకటించారు. ఆ రివార్డుకుతోడు ఈ మొత్తం డబ్బులను హంతకుడికి పట్టిచ్చిన వ్యక్తికే అందజేస్తానని ఫిల్ వెట్రానో ప్రకటించారు.
ఆకర్షణీయ శరీర సౌష్టవం కలిగిన కరీనాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లు కూడా ఎక్కువ మందే ఉన్నారు. ఆమె ఎప్పటికప్పుడు తన ఫొటోలను అందులో అప్‌గ్రేడ్ చేస్తుంటారు. ఆమె హత్యకు సరిగ్గా మూడు రోజుల ముందు అలెగ్జాండ్ర నికోలెట్టీ అనే 30 ఏళ్ల యువతిని కూడా జాగింగ్ వెళ్లినప్పుడు గుర్తుతెలియని వ్యక్తి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అయితే ఆమెపై అత్యాచారం జరపకుండానే నేరస్థుడు ఆమెను తుపాకీతో కాల్చి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. మిగతా రెండు హత్యల్లాగా కాకుండా ఆమెకు తెలిసిన వ్యక్తే హత్య చేశాడనడానికి ఆధారాలు దొరికాయని పోలీసులు చెబుతున్నారు.