అంధకారంలో జోగిపేట
జోగిపేట, న్యూస్‌లైన్: గ్రామ పంచాయతీగా ఉన్న కాలం నాటి నుంచి ట్రాన్స్‌కో బిల్లులు చెల్లించకపోవడంతో ప్రస్తుతం అవి రూ.2.50 కోట్లు మేర పేరుకుపోయాయి. గతంలోనే ట్రాన్స్‌కో అధికారులు సరఫరా నిలిపివేసేందుకు సిద్ధమైనా, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కలుగజేసుకుని సర్దిచెప్పడంతో ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం జోగిపేట లోని వీధి దీపాలకు సంబంధించి నగర పంచాయతీ రూ.1.21 కోట్లు, పట్టణానికి సరఫరా చేసే తాగునీటి బోరుమోటార్ల బిల్లులకు సంబంధించి రూ.1.24 కోట్లు బకాయి ఉంది. ప్రతినెల తాగునీటి బోరుమోటార్, వీధి దీపాలకుగాను రూ.15 లక్షల వరకు బిల్లులు వస్తున్నాయి. చాలా కాలంగా సర్కార్ నుంచి నిధులు రాకపోవడంతో నగర పంచాయతీ అధికారులు ఈ బిల్లులు చెల్లిం చడం లేదు. దీంతో తాజాగా ట్రాన్స్‌కో అధికారులు జోగిపేట, అందోల్ పట్టణాల్లో ఉన్న 32 బ టర్ఫ్లయి లైట్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో రెండు పట్టణాల్లోనూ అంధకారం అలముకుంది.
రూ. 30 లక్షలు చెల్లిస్తేనే సరఫరా
ప్రస్తుతం నగర పంచాయితీ బకాయి పడి ఉన్న బకాయి బిల్లులో రూ.30 లక్షలు చెల్లిస్తే సరఫరా పునరుద్ధరిస్తాం. ఈ విషయం ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ దృష్టిలో కూడా ఉంది. నగర పంచాయతీ అధికారులు బిల్లు చెల్లింపు వ్యవహారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందువల్లే సరఫరా నిలిపివేశాం.
- విజయ్‌కుమార్, ట్రాన్స్‌కో డీఈ
పంచాయతీ కాలం నాటి బిల్లులవి
ప్రస్తుతం ట్రాన్స్‌కో చెల్లించాల్సిన బకాయిలో ఎక్కువ మొత్తం గ్రామ పంచాయతీ కాలం నాటిది. అప్పటి బకాయి చెల్లించమంటే మాకేం సంబంధం. అయినప్పటికీ రూ.5 లక్షలు సోమవారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేశాను. 15 రోజుల్లో ప్రభుత్వం నుంచి నిధులు రాగానే బకాయి చెల్లిస్తాను.
-జి.విజయలక్ష్మి, కమిషనర్, జోగిపేట పంచాయతీ