మీకే కాదు...'మాకూ' ఓ ఎయిర్‌పోర్టు
ఇప్పటివరకూ మనుషులకు మాత్రమే ఎయిర్‌పోర్టులను చూశాం...త్వరలో జంతువులకు ప్రత్యేకంగా ఓ విమానాశ్రయం రానుంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, ఒక దేశం నుంచి మరో దేశానికి వేగంగా వెళ్లేందుకు మానవులైన మనకు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిర్వహించేందుకు విమానాశ్రాయాలు ఉన్నాయి. పిల్లులు, కుక్కలు, కోళ్లు, కొంగలు, పక్షులు, పశువుల రవాణాకు విమాన సర్వీసులు ఇప్పటి వరకు ఎక్కడా లేవు. అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారి అలాంటి సౌకర్యం న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందుబాటులోకి రానుంది.
ఈ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్ పక్కనే వున్న 14.4 ఎకరాల స్థలంలో 48 మిలియన్ డాలర్లతో జంతువుల కోసం ప్రత్యేక టెర్మినల్‌ను నిర్మించాలని నిర్ణయించారు. దీనికి 'ది ఆర్క్' అని అప్పుడే నామకరణం కూడా చేశారు. 2016 నుంచి అందుబాటులోకి రానున్న ఈ టెర్మినల్ నిర్మాణానికి రేస్బ్రూక్ కేపిటల్ అనే ప్రముఖ రియల్టర్ సంస్థకు అనుబంధమైన ఏఆర్కే డెవలప్మెంట్ సంస్థ సంబంధిత సంస్థలతో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే కెన్నడీ విమానాశ్రయం నుంచి ప్రపంచంలో ఎక్కడికైనా సరకు రవాణాలాగా జంతువులను రవాణా చేయవచ్చు. జంతువులంటే పెంపుడు కుక్కలు, పిల్లులు, పక్షుల లాంటివే కాకుండా గుర్రాలు, పశువులు లాంటి పెద్ద జంతువులను కూడా రవాణా చేస్తారట.
1, 78, 000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ టెర్మినల్‌లో ప్రత్యేకంగా మూడు విభాగాలు ఉంటాయి. జంతువుల మేతకు, వాటి విశ్రాంతికి అవసరమైన వేర్వేరు గదులను నిర్మించడమే కాకుండా, వాటికి ఎలాంటి జబ్బులు సోకకుండా నిరంతరం పర్యవేక్షించేదుకు పశువుల డాక్టర్ల కోసం ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు.