
న్యూయార్క్: విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడటంతో 32 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఇస్తాంబుల్ నుంచి న్యూయార్క్ బయలుదేరిన టర్కీష్ ఎయిర్‌లైన్స్ విమానంలో శనివారం రోజున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విమానం మరో గంటలో న్యూయార్క్ జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుందన్న సమయంలో ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానంలో అల్లకల్లోల వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో ప్రయాణికలతో పాటు, ఫ్లైట్ సిబ్బందికి కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. అదృష్టావశాత్తు విమానం శనివారం సాయంత్రం 5.30 గంటలకు జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయంలో క్షేమంగా ల్యాండ్ అయింది.
ఈ ఘటనపై న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్ అధికార ప్రతినిధి స్టీవ్ కోల్‌మన్ మాట్లాడుతూ.. ‘ది బోయింగ్ 777 విమానం 326 ప్రయాణికులు, 21 మంది సిబ్బందితో ఇస్తాంబుల్ నుంచి న్యూయార్క్‌కు బయలుదేరింది. విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యే 45 నిమిషాల మందు విమానంలో భయానక పరిస్థితి నెలకొంది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణికులు ఆందోళకు గురయ్యారు. ఈ ఘటనలో మొత్తం 32 మంది గాయపడగా.. వారిలో కొందరిని అధికారులు చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటన వల్ల ఇతర విమానాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేద’ని తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఓ వ్యక్తి కాలు విరిగినట్టు సమాచారం. గాయపడినవారిలో ఓ చిన్నారి కూడా ఉన్నారు.