పౌడర్‌తో కేన్సర్ వచ్చిందని.. రూ. 493 కోట్ల పరిహారం
జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి అతి పెద్ద షాక్ తగిలింది. ఈ కంపెనీ తయారుచేసిన బేబీ పౌడర్, ప్రిక్లీ హీట్ పౌడర్లను కొన్ని దశాబ్దాల పాటు వాడిన ఓ మహిళ అండాశయ ముఖద్వార కేన్సర్‌తో మరణించడంతో.. ఆమె కుటుంబానికి సుమారు రూ. 493 కోట్ల పరిహారం చెల్లించాలని అమెరికా కోర్టు తీర్పు చెప్పింది. మిస్సౌరీ రాష్ట్ర జ్యూరీలోని 60 మంది సభ్యులుగల సెయింట్ లూయిస్ సర్క్యూట్ కోర్ట్ ఈ సంచలన తీర్పును ప్రకటించింది. దీంతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఉత్పత్తుల నాణ్యత ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
జాకీ ఫాక్స్ (62) ఒవేరియన్ కాన్సర్‌తో 2013లో మరణించారు. దీంతో ఆమె కొడుకు మార్విన్ స్కాల్టర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ల టాల్కం పౌడర్‌ను దీర్ఘకాలం పాటు వాడడం వల్లే తన తల్లి అనారోగ్యానికి గురయ్యారని ఆరోపించారు. టాల్క్ బేస్డ్ ఉత్పత్తుల వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్న విషయాన్ని జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించలేదని చెబుతున్నారు. ఇదే అంశంపై మిస్సోరి కోర్టులో వెయ్యి కేసులు, న్యూజెర్సీ కోర్టులో మరో 200 కేసులు కూడా నమోదయ్యాయి. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ మోసం చేసిందని, నిర్లక్ష్యం వహించిందని, కుట్రపూరితంగా వ్యవహరించిందని జ్యూరీ తేల్చినట్లు ఫాక్స్ కుటుంబ న్యాయవాదులు తెలిపారు. తమ ఉత్పత్తులతో ఈ ప్రమాదం ఉందన్న విషయం ఆ కంపెనీకి 1980ల నుంచే తెలుసుని ఓ న్యాయవాది ఆరోపించారు.
అయితే ఈ తీర్పుతో కంపెనీ ప్రతినిధి కరోల్ బ్రిక్స్ విభేదించారు. బాధిత కుటుంబం పట్ల తమకు సానుభూతి ఉందని.. ఆమె క్యాన్సర్‌కు తమ ఉత్పత్తుతలకు సంబంధం లేదని, ఈ తీర్పును సవాల్ చేయనున్నామని తెలిపారు. జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కం పౌడర్‌లో మెగ్నీషియం, సిలికాన్ లు చర్మాన్ని పొడిగా ఉంచడానికి, చెమట పొక్కులు దద్దుర్లు నివారించడానికి సహాయ పడతాయన్నారు.