joint counselling
-
ఎవరి దారి వారిదే!
* సొంతంగా కౌన్సెలింగ్‌కు తెలంగాణ సర్కారు మొగ్గు * ఉన్నత విద్యా మండలి చైర్మన్ నియామకం * అధికారులతో విద్యా మంత్రి చర్చ * నేడు సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష * విధాన నిర్ణయం తీసుకునే అవకాశం * ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశంపై సందిగ్ధం సాక్షి, హైదరాబాద్: ఎవరి కౌన్సెలింగ్ వారిదేనా? ఎంసెట్‌పై కరీంనగర్లో సీఎం కేసీఆర్ మంగళవారం చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వ కసరత్తును చూస్తే ప్రస్తుతం ఇదే అనుమానం కలుగుతోంది. సొంత కౌన్సెలింగ్వైపే రాష్ర్ట ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది! తాజా పరిణామాలను బట్టి రెండు రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి కౌన్సెలింగ్ సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే కాలేజీలకు అఫిలియేషన్ల(అనుమతులు) ప్రక్రియ ఆరంభించిన రాష్ర్ట ప్రభుత్వం తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేసి మంగళవారం గెజిట్ నోటిఫై కూడా చేసింది. మండలి చైర్మన్‌గా పాపిరెడ్డిని నియమించింది. ఈ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు, విద్యా శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, సాంకేతిక విద్యా కమిషనర్ శైలజా రామయ్యార్, న్యాయ శాఖ అధికారులతోపాటు పాపిరెడ్డి కూడా పాల్గొన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌పై 5 గంటలకుపైగా చర్చించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. న్యాయపరమైన అంశాల్లో ఎలా ముందుకు సాగాలనే విషయంతో పాటు ఈ నెల 11న జరిగే తదుపరి విచారణలో ఏయే అంశాలను సుప్రీంకోర్టుకు వివరించాలనే అంశంపై లోతుగా చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ర్టంలో తెలంగాణ విద్యార్థులకే ప్రయోజనాలు కల్పించడం, వారి హక్కులను కాపాడే క్రమంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి లోబడి, సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి సొంత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అవసరమైన అన్ని కోణాల్లో చర్చించినట్లు తెలిసింది. మరోవైపు ఈనెల 7 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఏపీ ఉన్నత విద్యా మండలి జారీ చేసిన నోటిఫికేషన్‌పై చర్చించేందుకు మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఎంసెట్ ప్రవేశాల కమిటీ వాయిదా వేసింది. తెలంగాణకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యే వీలు లేకపోవడంతో.. దీన్ని బుధవారం నిర్వహించాలని ఏపీ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. అయితే ఇందులో తెలంగాణ అధికారులు, తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధికారులు పాల్గొనే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ పాల్గొన్నా.. రాష్ట్రంలో విద్యార్థులకు ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు లేనందున ఏపీ కౌన్సిల్ నిర్వహించే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో తెలంగాణ విద్యార్థులు పాల్గొనబోరనే అంశాన్ని తేల్చి చెప్పే అవకాశం ఉంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా పాపిరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో ఎలాగూ తెలంగాణ కౌన్సిల్ ఏర్పాటైనందున రాష్ర్ట విద్యార్థులకు కౌన్సెలింగ్ కోసం తేదీలను వేరుగా ప్రకటిస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం యోచి స్తోంది. మంగళవారం సచివాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. విద్యార్థులకు సర్టిఫికెట్లు అందకుండా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఏపీ కౌన్సిల్ ఎలా చేపడుతుందని, ఏ సర్టిఫికెట్లు వెరిఫై చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా కౌన్సెలింగ్ జరిగే అవకాశం కనిపించడం లేదు. ఈ అంశాలన్నింటిపై బుధవారం ఉదయం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే సమావేశం అనంతరం కౌన్సెలింగ్‌పై తెలంగాణ సర్కారు విధాన ప్రకటన వెలువడే అవకాశముంది. -
‘గోదావరి’పై కిరికిరి!
► చంద్రబాబు లేఖతో ఇరు రాష్ట్రాల మధ్య కొత్త వివాదం ► ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలంటున్న ఆంధ్రప్రదేశ్ సీఎం ► ఉమ్మడి రాష్ర్టంలో చేపట్టినవాటికి అవసరం లేదంటున్న తెలంగాణ సర్కార్ సాక్షి, హైదరాబాద్: విద్యుత్తు, సాగునీరు, స్థానికత, ఉమ్మడి కౌన్సెలింగ్ తదితర అంశాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇప్పటికే వివాదాలు కొనసాగుతుండగా, తాజాగా గోదావరి నదిపై ప్రాజెక్టుల అనుమతుల అంశం మరో కొత్త వివాదానికి తెరలేపింది. గోదావరిపై నిర్మించే ప్రాజెక్టులకు కేంద్ర పరిధిలోని అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి చేయాలంటూ ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం కొత్త వివాదానికి తెరలేపింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉండాలంటూ బాబు కోరడం వెనుక, తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టుల విషయంలో తన ప్రమేయం ఉండాలని భావిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు సందేహిస్తున్నారు. దీనికి కేంద్రం ఓకే చెబితే... పోలవరం ప్రాజెక్టు అనుమతికీ తెలంగాణ సీఎం ఓకే చెప్పాల్సి వస్తుంది. కానీ పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపడుతున్న దృష్ట్యా దీని అనుమతి విషయంలో తెలంగాణ సీఎం ప్రాధాన్యం పెద్దగా ఉండకపోవచ్చన్నది బాబు ఆలోచనగా చెబుతున్నారు. సమైక్య రాష్ట్రంలో గోదావరి జలాల కేటాయింపు మొత్తం 1400ల టీఎంసీల వరకు ఉండగా, అందులో తెలంగాణకు 900, ఆంధ్ర ప్రాజెక్టులకు 500 టీఎంసీలు కేటాయించారు. ప్రస్తుతం గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రధాన ప్రాజెక్టులన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ప్రాణహిత-చేవెళ్ల(160 టీఎంసీలు), శ్రీపాద ఎల్లంపల్లి (60 టీఎంసీలు), కంతానపల్లి (50 టీఎంసీలు), గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ (దేవాదుల- 38 టీఎంసీలు), కొమరం భీమ్ (8.5 టీఎంసీలు) ప్రాజెక్టులతో పాటు స్వర్ణ, సుద్దవాగు, సాత్నూర, జగన్నాథ్‌పూర్ వంటి రెండు, మూడు టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు మరో పది వరకు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో చాలా వాటికి కేంద్ర జల సంఘం నుంచి పూర్తిస్థాయి అనుమతులు లభించలేదన్న వాదనను తెరపైకి తెచ్చిన ఏపీ ప్రభుత్వం, ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల్లో తమ వాదనను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. తద్వారా గోదావరిలో సుమారు 200 టీఎంసీల నీటిని అదనంగా కేటాయింపజేసుకోవాలనే ఆలోచన ఉన్నట్లు తెలంగాణ సాగునీటి నిపుణులు, అధికారులు ప్రభుత్వానికి వెల్లడించారు. చంద్రబాబు లేఖపై ఇప్పటికే స్పందించిన తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ‘బాబు చెబుతున్నట్లే జరిగితే... పోలవరం విషయంలోనూ తెలంగాణ ముఖ్యమంత్రి అనుమతి కావాలంటే ఒప్పుకుంటారా?’ అని ప్రశ్నించారు. ఇదే విషయమై కేంద్రానికి ఒక లేఖ రాస్తామని స్పష్టం చేశారు. కొత్త ప్రాజెక్టులకు మాత్రమే వర్తింపు! ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదని తెలంగాణ నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో కృష్ణా, గోదావరి వివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ అని పేర్కొన్నారే తప్ప అనుమతుల అంశమేమీ లేదని గుర్తుచేస్తున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లి కేంద్రానికి లేఖ రాయడంతోపాటు, వచ్చేనెల 6న జరగబోయే గోదావరి బోర్డు సమావేశంలోనూ ప్రస్తావించాలని భావిస్తున్నారు.