ఎవరి దారి వారిదే! | Telangana government to be interested for own counselling | Sakshi
Sakshi News home page

ఎవరి దారి వారిదే!

Published Wed, Aug 6 2014 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM

ఎవరి దారి వారిదే!

ఎవరి దారి వారిదే!

* సొంతంగా కౌన్సెలింగ్‌కు తెలంగాణ సర్కారు మొగ్గు
* ఉన్నత విద్యా మండలి చైర్మన్ నియామకం
* అధికారులతో విద్యా మంత్రి చర్చ
* నేడు సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
* విధాన నిర్ణయం తీసుకునే అవకాశం
* ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశంపై సందిగ్ధం

 
సాక్షి, హైదరాబాద్: ఎవరి కౌన్సెలింగ్ వారిదేనా? ఎంసెట్‌పై కరీంనగర్‌లో సీఎం కేసీఆర్ మంగళవారం చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వ కసరత్తును చూస్తే ప్రస్తుతం ఇదే అనుమానం కలుగుతోంది. సొంత కౌన్సెలింగ్‌వైపే రాష్ర్ట ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది! తాజా పరిణామాలను బట్టి రెండు రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి కౌన్సెలింగ్ సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే కాలేజీలకు అఫిలియేషన్ల(అనుమతులు) ప్రక్రియ ఆరంభించిన రాష్ర్ట ప్రభుత్వం తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేసి మంగళవారం గెజిట్ నోటిఫై కూడా చేసింది. మండలి చైర్మన్‌గా పాపిరెడ్డిని నియమించింది. ఈ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు, విద్యా శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, సాంకేతిక విద్యా కమిషనర్ శైలజా రామయ్యార్, న్యాయ శాఖ అధికారులతోపాటు పాపిరెడ్డి కూడా పాల్గొన్నారు.
 
  ఎంసెట్ కౌన్సెలింగ్‌పై 5 గంటలకుపైగా చర్చించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. న్యాయపరమైన అంశాల్లో ఎలా ముందుకు సాగాలనే విషయంతో పాటు ఈ నెల 11న జరిగే తదుపరి విచారణలో ఏయే అంశాలను సుప్రీంకోర్టుకు వివరించాలనే అంశంపై లోతుగా చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ర్టంలో తెలంగాణ విద్యార్థులకే ప్రయోజనాలు కల్పించడం, వారి హక్కులను కాపాడే క్రమంలో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి లోబడి, సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి సొంత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అవసరమైన అన్ని కోణాల్లో చర్చించినట్లు తెలిసింది. మరోవైపు ఈనెల 7 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఏపీ ఉన్నత విద్యా మండలి జారీ చేసిన నోటిఫికేషన్‌పై చర్చించేందుకు మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఎంసెట్ ప్రవేశాల కమిటీ వాయిదా వేసింది. తెలంగాణకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యే వీలు లేకపోవడంతో.. దీన్ని బుధవారం నిర్వహించాలని ఏపీ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. అయితే ఇందులో తెలంగాణ అధికారులు, తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధికారులు పాల్గొనే పరిస్థితి కనిపించడం లేదు.
 
 ఒకవేళ పాల్గొన్నా.. రాష్ట్రంలో విద్యార్థులకు ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు లేనందున ఏపీ కౌన్సిల్ నిర్వహించే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో తెలంగాణ విద్యార్థులు పాల్గొనబోరనే అంశాన్ని తేల్చి చెప్పే అవకాశం ఉంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా పాపిరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో ఎలాగూ తెలంగాణ కౌన్సిల్ ఏర్పాటైనందున రాష్ర్ట విద్యార్థులకు కౌన్సెలింగ్ కోసం తేదీలను వేరుగా ప్రకటిస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం యోచి స్తోంది.
 
  మంగళవారం సచివాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. విద్యార్థులకు సర్టిఫికెట్లు అందకుండా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఏపీ కౌన్సిల్ ఎలా చేపడుతుందని, ఏ సర్టిఫికెట్లు వెరిఫై చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా కౌన్సెలింగ్ జరిగే అవకాశం కనిపించడం లేదు. ఈ అంశాలన్నింటిపై బుధవారం ఉదయం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే సమావేశం అనంతరం కౌన్సెలింగ్‌పై తెలంగాణ సర్కారు విధాన ప్రకటన వెలువడే అవకాశముంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement