‘గోదావరి’పై కిరికిరి!
► చంద్రబాబు లేఖతో ఇరు రాష్ట్రాల మధ్య కొత్త వివాదం
► ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలంటున్న ఆంధ్రప్రదేశ్ సీఎం
► ఉమ్మడి రాష్ర్టంలో చేపట్టినవాటికి అవసరం లేదంటున్న తెలంగాణ సర్కార్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్తు, సాగునీరు, స్థానికత, ఉమ్మడి కౌన్సెలింగ్ తదితర అంశాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇప్పటికే వివాదాలు కొనసాగుతుండగా, తాజాగా గోదావరి నదిపై ప్రాజెక్టుల అనుమతుల అంశం మరో కొత్త వివాదానికి తెరలేపింది. గోదావరిపై నిర్మించే ప్రాజెక్టులకు కేంద్ర పరిధిలోని అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి చేయాలంటూ ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం కొత్త వివాదానికి తెరలేపింది.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉండాలంటూ బాబు కోరడం వెనుక, తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టుల విషయంలో తన ప్రమేయం ఉండాలని భావిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు సందేహిస్తున్నారు. దీనికి కేంద్రం ఓకే చెబితే... పోలవరం ప్రాజెక్టు అనుమతికీ తెలంగాణ సీఎం ఓకే చెప్పాల్సి వస్తుంది. కానీ పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపడుతున్న దృష్ట్యా దీని అనుమతి విషయంలో తెలంగాణ సీఎం ప్రాధాన్యం పెద్దగా ఉండకపోవచ్చన్నది బాబు ఆలోచనగా చెబుతున్నారు.
సమైక్య రాష్ట్రంలో గోదావరి జలాల కేటాయింపు మొత్తం 1400ల టీఎంసీల వరకు ఉండగా, అందులో తెలంగాణకు 900, ఆంధ్ర ప్రాజెక్టులకు 500 టీఎంసీలు కేటాయించారు. ప్రస్తుతం గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రధాన ప్రాజెక్టులన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ప్రాణహిత-చేవెళ్ల(160 టీఎంసీలు), శ్రీపాద ఎల్లంపల్లి (60 టీఎంసీలు), కంతానపల్లి (50 టీఎంసీలు), గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ (దేవాదుల- 38 టీఎంసీలు), కొమరం భీమ్ (8.5 టీఎంసీలు) ప్రాజెక్టులతో పాటు స్వర్ణ, సుద్దవాగు, సాత్నూర, జగన్నాథ్‌పూర్ వంటి రెండు, మూడు టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు మరో పది వరకు ఉన్నాయి.
ఈ ప్రాజెక్టుల్లో చాలా వాటికి కేంద్ర జల సంఘం నుంచి పూర్తిస్థాయి అనుమతులు లభించలేదన్న వాదనను తెరపైకి తెచ్చిన ఏపీ ప్రభుత్వం, ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల్లో తమ వాదనను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. తద్వారా గోదావరిలో సుమారు 200 టీఎంసీల నీటిని అదనంగా కేటాయింపజేసుకోవాలనే ఆలోచన ఉన్నట్లు తెలంగాణ సాగునీటి నిపుణులు, అధికారులు ప్రభుత్వానికి వెల్లడించారు. చంద్రబాబు లేఖపై ఇప్పటికే స్పందించిన తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ‘బాబు చెబుతున్నట్లే జరిగితే... పోలవరం విషయంలోనూ తెలంగాణ ముఖ్యమంత్రి అనుమతి కావాలంటే ఒప్పుకుంటారా?’ అని ప్రశ్నించారు. ఇదే విషయమై కేంద్రానికి ఒక లేఖ రాస్తామని స్పష్టం చేశారు.
కొత్త ప్రాజెక్టులకు మాత్రమే వర్తింపు!
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదని తెలంగాణ నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో కృష్ణా, గోదావరి వివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ అని పేర్కొన్నారే తప్ప అనుమతుల అంశమేమీ లేదని గుర్తుచేస్తున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లి కేంద్రానికి లేఖ రాయడంతోపాటు, వచ్చేనెల 6న జరగబోయే గోదావరి బోర్డు సమావేశంలోనూ ప్రస్తావించాలని భావిస్తున్నారు.