మీరు ఒక కేసు పెడితే.. మేం నాలుగు కేసులు పెడతాం | Chandrababu comments on Telangana Govt | Sakshi
Sakshi News home page

మీరు ఒక కేసు పెడితే.. మేం నాలుగు కేసులు పెడతాం

Published Tue, Mar 5 2019 3:27 AM | Last Updated on Tue, Mar 5 2019 9:02 AM

Chandrababu comments on Telangana Govt - Sakshi

సాక్షి, తిరుపతి/చిత్తూరు: ‘కేసీఆర్‌ చెప్పిన రిటర్న్‌ గిఫ్ట్‌ ఇదే. కసి తీర్చుకుంటాం. డేటా మాదైతే.. దొంగతనం జరిగిందనడానికి మీరెవరు?’ అని ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి అనంతరం అలిపిరి బస్టాండ్‌లో జనం లేని బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రజల డేటాను టీడీపీ నాయకులు హైదరాబాద్‌లో చేస్తున్న చోరీపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. డేటా దొంగతనానికి సంబంధించి ఒక్కొక్కటిగా నిజాలు వెలుగులోకి వస్తుండడం తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ ప్రసంగించారు.

తెలంగాణ ప్రభుత్వం ఒక కేసుపెడితే, తాము నాలుగు కేసులు పెడతామని, మీ మూలాలు కదిలిపోతాయని హెచ్చరించారు. దొంగలించబడిందని చెబుతున్న డేటాపై విచారణ చెయ్యడానికి తెలంగాణ ప్రభుత్వానికి అధికారం లేదన్నారు. తాను తలచుకుంటే హైదరాబాద్‌లో ఒక్క కంపెనీ కూడా ఉందడని హెచ్చరించారు. తనపై కావాలనే విరోధం పెట్టుకుంటే, షిఫ్టింగ్‌ రిప్లై ఇస్తానని వ్యాఖ్యానించారు. పరిపానల చెయ్యమని ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని, మీ ఇష్టానుసారం చెయ్యడానికి కాదని మండిపడ్డారు. హైదరాబాద్‌ ఉమ్మడి క్యాపిటల్‌ అని గుర్తు చేశారు.

తోక జాడిస్తే కత్తిరిస్తా జాగ్రత్త!
చిత్తూరు సభల్లో సీఎం మాట్లాడుతూ.. ‘‘నాకు తెలియని డేటానా? 1980 నుంచి ఈ డేటా మాట వింటున్నా. హైదరాబాద్‌కు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తెచ్చిన వాడిని. నా దగ్గరే తోక జాడిస్తున్నారు. కత్తిరిస్తా జాగ్రత్త..! తెలుగుదేశం ఓట్లను తొలగించడానికి వైఎస్సార్‌సీపీ కుట్ర పన్నుతోంది. ఎవరో దారిన పోయే దానయ్య కేసు వేస్తే తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తోంది. డేటా అంటే తెలీని మీరా మా ప్రభుత్వ డేటాను కాపాడేది?’ అని మండిపడ్డారు. దీనిపై కోర్టుకైనా వెళ్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు పాకిస్తాన్‌తో యుద్ధమంటూ డ్రామాలాడుతున్నారని కేంద్రంపై విమర్శించారు.

దేశంలో ఎక్కడాలేని అభివృద్ధి రాష్ట్రంలో చేశాం..
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో ఎక్కడాలేని అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతోందని చంద్రబాబు చెప్పారు. చిత్తూరు జిల్లాలో మదనపల్లె, పుంగనూరు, పలమనేరులలో జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణా జలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు. రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే రూ.24 వేల కోట్ల రుణమాఫీ, డ్వాక్రా మహిళల కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. సింగిరిగుంటకు చెందిన పింఛనుదారు ఆంజమ్మ తన పింఛను డబ్బులను అమరావతి నిర్మాణానికి రూ.10 వేలు విరాళం ఇవ్వగా ఆమెకు ముఖ్యమంత్రి పాదాభివందనం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement