నాడు మోసం.. నేడు మౌనం! | Chandrababu not commenting on Rayalaseema and Pothireddypadu project | Sakshi
Sakshi News home page

నాడు మోసం.. నేడు మౌనం!

Published Mon, May 18 2020 3:12 AM | Last Updated on Mon, May 18 2020 1:01 PM

Chandrababu not commenting on Rayalaseema and Pothireddypadu project - Sakshi

ప్రాజెక్టులు కడితే మిగులు జలాలపై హక్కు వస్తుందన్న వైఎస్సార్‌.. చంద్రబాబు దీన్ని విస్మరించడంతో 258 టీఎంసీలను కర్ణాటక, మహారాష్ట్రలకు పంచిన ట్రిబ్యునల్‌

సాక్షి, అమరావతి: దేశంలో అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకు శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా వరద జలాలను తరలించి నీటి కష్టాలను కడతేర్చడం, పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌(పీహెచ్‌పీ) కాలువల సామర్థ్యాన్ని 80 క్యూసెక్కులకు పెంచనుండటం, కేటాయించిన జలాలను 800 అడుగుల మట్టం నుంచి తరలించేందుకు సిద్ధం కావటాన్ని తెలంగాణ సర్కార్‌ వ్యతిరేకిస్తుంటే చంద్రబాబు మౌనం వహించడాన్ని సాగునీటి రంగ నిపుణులు తప్పుబడుతున్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకుండా పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో మోసం చేసిన చంద్రబాబు నేడు నోరుమెదపకపోవడాన్ని విమర్శిస్తున్నారు.  (నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలి)

బాబు నిర్వాకంతోనే ఆల్మట్టి ఎత్తు పెంపు 
కర్ణాటక సర్కార్‌ 1996లో ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచుతుంటే నాడు చంద్రబాబు చోద్యం చూశారు. ప్రాజెక్టులు నిర్మిస్తే మిగులు జలాలపై రాష్ట్రానికి హక్కు వస్తుందని అప్పటి ప్రతిపక్ష నేత, దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన సూచనలను పెడచెవిన పెట్టి నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు తెలుగు రాష్ట్రాలకు తీరని ద్రోహం చేశారని విమర్శిస్తున్నారు. చంద్రబాబు నిర్వాకం వల్లే బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుకోవడానికి కర్ణాటకకు అనుమతి ఇచ్చిందని, మిగులు జలాల్లో కర్ణాటకకు 177 టీఎంసీలు, మహారాష్ట్రకు 81 టీఎంసీలు పంపిణీ చేసిందని గుర్తు చేస్తున్నారు. ట్రిబ్యునల్‌ తీర్పు అమల్లోకి వస్తే తెలుగు రాష్ట్రాలకు తీరని నష్టం తప్పదని స్పష్టం చేస్తున్నారు. 

మిగులు హక్కు ఎగువ రాష్ట్రాలకు ధారాదత్తం 
1995 నుంచి 2004 వరకు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతున్నానంటూ ప్రచారం చేసుకుని కృష్ణా జలాలపై హక్కులను ఎగువ రాష్ట్రాలకు ధారపోశారని సాగునీటి రంగ నిపుణులు మండిపడుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ఒత్తిడి వల్ల బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డును పునఃసమీక్షించేందుకు 2000లో ఆదేశాలు జారీ చేసిన కేంద్రం 2004లో బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. కృష్ణా నీటిని వినియోగించుకుని తెలుగు నేలను సస్యశ్యామలం చేసేందుకు జలయజ్ఞంలో భాగంగా దివంగత వైఎస్సార్‌ 2004లో ఏపీలో హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, పులిచింతల, తెలుగుగంగ.. తెలంగాణలో నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, ఎస్సెల్బీసీ తదితర ప్రాజెక్టులు చేపట్టారు. తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీలకు నీళ్లందించే పీహెచ్‌పీ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచితే అప్పట్లో చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో వ్యవహరించారు. పీహెచ్‌పీ సామర్థ్యం పెంపును నిరసిస్తూ తెలంగాణలోనూ, ప్రకాశం బ్యారేజీపై టీడీపీ నేతలతో ధర్నాలు చేయించారు. 2014 నుంచి 2019 వరకు బాబు అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని తరలించేలా ఒక్క ప్రాజెక్టును కూడా చేపట్టలేదు.  

రాష్ట్ర ప్రయోజనాలపై టీడీపీ మౌనం 
కృష్ణా వరద జలాలను ఒడిసి పట్టి రాయలసీమ, నెల్లూ రు జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు నోరుమెదపకపోవడాన్ని సాగునీటి రంగ నిపుణులు తప్పుబడుతున్నారు. టీడీపీ నేతలు మౌనం వహిస్తుండటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కరువు నేలను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు బాసటగా నిలవాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు  రాయలసీమ, నెల్లూరు ప్రజలను మరోసారి మోసం చేస్తూ తన నైజాన్ని బయటపెట్టుకున్నారని పేర్కొంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement