‘ఛీ టూ’...
ఎనభై ఏళ్లు దాటిన హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ క్విన్సీ జోన్స్.. ఇవాంకపై నిందవేయడాన్ని మహిళా లోకం ‘ఛీ’ కొడుతోంది. ‘మీ టూ.. ఛీ’ అంటోంది.
చూస్తుంటే పురుష పుంగవులు రివర్స్ గేర్‌లో మహిళలపై యుద్ధానికి దిగినట్లే కనిపిస్తోంది! ‘మీ టూ’ ఉద్యమం మొదలయ్యాక.. కలిసి పనిచేసే చోట మగ ఉద్యోగులు మహిళా ఉద్యోగులతో మాట్లాడ్డం బాగా తగ్గించారని ఒక వైపు సర్వేలు వెల్లడిస్తుంటే.. ఇప్పుడు క్విన్సీ జోన్స్ అనే 84 ఏళ్ల హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్.. ఒకప్పుడు తను ఇవాంకా ట్రంప్‌తో డేటింగ్ చేశానని ప్రకటించి ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ‘మీ టూ’ అంటూ హాలీవుడ్ నటీమణులు ఫలానా వ్యక్తి తమను లైంగికంగా వేధించాడని ఒకరొకరుగా బయటికి వచ్చి చెప్పుకుంటున్న ఈ తరుణంలో క్విన్సీ జోన్స్.. ఇవాంకాతో తనకు ఉన్న సంబంధం గురించి బయట పెట్టడం వెనుక.. ‘మీ టూ’ ఉద్యమానికి టిట్ ఫర్ ట్యాట్ (తగిన శాస్తి) చేయాలన్న ఉద్దేశం ఉండి ఉండవచ్చునని సామాజిక పరిణామాల పరిశీలకులు భావిస్తున్నారు! ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ టామీహిల్ఫింగర్ దగ్గర జోన్స్ కూతురు కిదాదా పని చేస్తున్నప్పుడు.. అదే ఫీల్డులో ఉన్న ఇవాంకా అక్కడికి వచ్చేవారు. అలా వచ్చి వెళుతున్న సమయంలో ఓసారి.. తనకు క్విన్సీ జోన్స్‌తో కలిసి డిన్నర్ చేయాలని ఉంది అని ఇవాంకా అన్నట్లు కిదాదా ద్వారా జోన్స్‌కి కబురు పంపించాడట టామీ హిల్ఫింగర్. అలా లంచ్ పరిచయం డేటింగ్ వరకు వెళ్లిందని ‘వల్చర్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో çపరమ దరిద్రపుగొట్టు పదాలతో వెల్లడించారు క్విన్సీ జోన్స్.
‘‘మేమిద్దరం ఏ టైమ్‌లో డేటింగ్లో ఉన్నామో సరిగ్గా చెప్పలేను కానీ కుష్నర్తో (ఇవాంకా భర్త) ఇవాంక డేటింగ్ చేయడానికి ముందే అనుకుంటాను. బహుశా 2007లో కావచ్చు’’ అని క్విన్సీ జోన్స్ అప్పటి తీపి జ్ఞాపకాలేవో గుర్తు చేసుకోడానికి ప్రయత్నించినట్లుగా పద భావాలు ప్రదర్శించారు. దీనిపై ఇంతవరకు ఇవాంకా కానీ, ట్రంప్కానీ ఏమీ స్పందించలేదు. ఇవాంకాకు 2009తో కుష్నర్తో పెళ్లయింది. ఆమె భర్తగా కుష్నర్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి. యు.ఎస్.లోని ప్రముఖ మహిళలంతా మగజాతిపై పగబట్టినట్లు లైంగిక ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి, ఆడజాతిపై అక్కడి పురుషజాతి కట్టుకథలతో, ఉత్తుత్తి సర్వేలతో ప్రతీకారం తీర్చుకోబోతున్నారా? ‘మీ టూ’ లాంటి ఒక మగ ఉద్యమానికి క్విన్సీ జోన్స్ ఆద్యుడు కాబోతున్నాడా? చూడాలి.