కొవ్వెక్కువై బతికిపోయింది!
బీజింగ్: అదేంటి? అలాగంటారేంటి? చచ్చిపొమ్మని ఎవరైనా చెబుతారా? ....అని అడగాలనుకుంటున్నారు కదూ. అయితే ఈ శీర్షికను మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టే. నిజంగానే ఓ అమ్మాయి కొవ్వెక్కువై బతికింది. ఎలాగంటారా.. కారణమేంటో తెలియదు కానీ ఓ మహిళ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. నిజానికి ఎవరైనా అలా దూకితే మునిగిపోతారు. కానీ ఇక్కడ దూకిన మహిళ మాత్రం మరణించలేదు. పైగా లైఫ్ జాకెట్ వంటివి కూడా వేసుకోలేదు.
మరెందుకు మునిగిపోలేదంటే.. ఇంతకుముందే చదివారు కదా.. కొవ్వెక్కువై! వివరాల్లోకెళ్తే... చైనాలోని గువాంగ్‌డంగ్ ప్రావిన్స్‌లో ఓ మహిళ జోంగషాన్ నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే.. ఆమె శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగిపోకుండా తేలింది. చాలాసేపు ఆమె నీటిపైనే తేలియాడడంతో అటుగా వచ్చిన జాలర్లు ఆమెను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొంత భారీకాయంతో ఉన్న ఆమెను పైకి లేపడానికి పోలీసులు చాలాసేపు ఇబ్బంది పడినా.. పైకి తీసుకురాగలిగారు. వైద్యులు ఆమెను పరిశీలించి.. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు పదార్థాలే నీటిలో మునిగిపోకుండా తేలియాడేలా చేశాయని.. ఇందుకు ఆమె ధరించిన దుస్తులు కూడా ఒకింత సాయపడ్డాయని చెప్పారు.