కొత్త టెన్షన్
పాత పద్ధతి అన్నారు.. కొత్త ప్రశ్నపత్రం ఇచ్చారు!
పది పరీక్షలపై విద్యార్థుల ఆందోళన
పదో తరగతి సిలబస్ ఈ ఏడాది మారింది. అయినా బోధన తీరుపై ఉపాధ్యాయులకు నేటికీ శిక్షణ లేదు. ఫలితంగా వారికి సరైన అవగాహన రాలేదు. పాఠ్యాంశాలు అర్థంకాక విద్యార్థులు ఇప్పటికే తలలు బాదుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మారిన సిలబస్ ప్రకారం కొత్త ప్రశ్నపత్రం ఇంటర్నెట్లో విడుదల చేయడంతో విద్యార్థి, ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
నర్సీపట్నం టౌన్ : పదో తరగతి సిలబస్ మార్పు.. ఉపాధ్యాయులకు శిక్షణ లేకపోవడం.. పాఠ్యాంశాలు విద్యార్థులకు అర్థకాపోవడంపై ఇప్పటికే ఆందోళన నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులను శాంతపరిచే ఉద్దేశంతో పరీక్షలు పాత పద్ధతిలోనే జరుగుతాయంటూ విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, తాజాగా మారిన సిలబస్ ప్రకారం కొత్త పద్ధతిలో టెన్త్ నమూన ప్రశ్నపత్రాన్ని విద్యాశాఖ ఆన్లైన్ పెట్టడంతో ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేపుతోంది. దీన్ని పరిశీలించిన ఉపాధ్యాయులు పాత విధానంలో మాదిరిగా ప్రశ్నను నేరుగా అడగకుండా తికమక పెట్టేలా ఇచ్చారని చెబుతున్నారు.
విద్యార్థుల సామర్థ్యానికి కఠిన పరీక్ష!
ఇది ఇప్పటి వరకు విద్యార్థులకు పరిచయం లేని కొత్త విధానం. విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి సొంతంగా జవాబులు రాయాల్సిన పరిస్థితి. ఈ నెల 18 నుంచి త్రైమాసిక పరీక్షలు ప్రారంభం కానుండటం విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. వాస్తవానికి పాఠశాలల్లో తరగతులు మొదలై ఇప్పటికి మూడు నెలలు గడిచాయి. ఇప్పటి వరకు కనీసం ప్రశ్నపత్రం ఎలా ఉండాలో నిర్ణయించుకోలేని విద్యాశాఖ తాజాగా దానిని నెట్లో విడుదల చే యడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇలాంటి సమయంలో ఎలాంటి సన్నద్ధత లేకుండా త్రైమాసిక పరీక్షలు కొత్త పద్ధతిలో ఏ విధంగా రాయాల నే దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఉపాధ్యాయులు మథనపడుతున్నారు. నూతన పద్ధతి అమలుకు మరికొంత సమయం ఇచ్చి ఉంటే బాగుంటుందని వారు సూచిస్తున్నారు.
ఆరు నుంచి ఉంటే బాగుండేది
కొత్త సిలబస్లో ప్రతి పాఠానికి కృత్యాలు చేయాలంటున్నారు. మాకు ఇప్పటి వరకు వాటిపై పెద్ధగా అవగాహన లేదు. ఒకేసారి పదో తరగతిలో అనేటప్పటికి ఇబ్బందిగా ఉంటుంది. అదే ఆరో తరగతి నుంచి ఉంటే మాకు అలవాటయ్యేది. కొత్త ప్రశ్నపత్రం నమూనా ఎలా ఉంటుందో కూడా మేము ఇప్పటి వర కూ చూడలేదు. నమూనాపై అవగాహన లేకుండా నేరుగా పరీక్షలు ఎలా రాస్తాం. కనీసం అర్ధసంవత్సర పరీక్షల వరకైనా మాకు సమయం ఇవ్వాలి. ప్రశ్నపత్రానికి అనుగుణంగా పాఠ్యాంశాలు బోధించాలి.
-జె.పద్మావతి (పదోతరగతి)
విద్యార్థులకు ఇబ్బందే
కొత్త ప్రశ్నపత్రం నమూనాపై మాకే పూర్తిగా అవగాహన లేదు. ఇక విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు? బాగా చదివే వారికి కష్టం కాకున్నా యావరేజ్, బిలో యావరేజ్ పిల్లలు నష్టపోతారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల వారికే నష్టం. విద్యాశాఖ ఈ విషయంలో తగు ఆలోచన చేయాలి.
- ఆంజనేయ (హెచ్ఎం, జెడ్పీ హైస్కూల్, నర్సీపట్నం)