JSW cement
-
2020లో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఐపీఓ!
ముంబై: సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లోని సిమెంట్ విభాగం, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ 2020 కల్లా ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) రానుంది. ఈ కంపెనీ ఐపీఓ సైజు రూ.4,500 కోట్ల రేంజ్లో ఉండొచ్చని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా ప్రమోటర్ వాటాలో నాలుగో వంతు షేర్లను విక్రయించాలని జేఎస్‌డబ్ల్యూ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 12.8 మిలియన్ టన్నులుగా ఉంది. దీన్ని వచ్చే ఏడాదిమార్చి కల్లా 14 మిలియన్ టన్నులకు పెంచుకోనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీలేశ్ నర్వేకర్ పేర్కొన్నారు. 2020 కల్లా 20 మిలియన్ టన్నులకు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నామన్నారు. సిమెంట్ ఉత్పత్తి ఈ స్థాయికి చేరాకే ఐపీఓకు వస్తామన్నారు. కంపెనీ విలువ రూ.18,000 కోట్లు ఐపీఓకు వచ్చే నాటికి జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ కంపెనీ విలువ రూ.18,000 కోట్లుగా ఉండేలా చూసుకోవాలని లకి‡్ష్యంచినట్లు నీలేశ్ చెప్పారు. ఈ ఐపీఓలో భాగంగా ప్రమోటర్లు తమ వాటాలో నాలుగో వంతు షేర్లను విక్రయించే అవకాశం ఉందన్నారు. అంటే ఈ ఐపీఓ సైజు రూ.4,500 కోట్ల రేంజ్లో ఉండొచ్చు. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి, ఉత్పత్తి పెంచుకోవటానికి వినియోగిస్తామన్నారు. -
స్లాగ్ లారీలను కట్టడి చేయండి
నంద్యాల (కర్నూలు): పాణ్యం రైల్వే స్టేషన్ నుంచి లారీల్లో స్లాగ్‌ను లోడ్‌కు మించి జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీకి తీసుకొని వెళ్తున్నా.. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆరోపించారు. పట్టణంలోని శోభా ఫంక్షన్హాల్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లారీల్లో ఎక్కువ స్లాగ్‌ను తీసుకొని వెళ్లడంతో అది రోడ్డుమీద పడుతోందన్నారు. స్లాగ్ ఒక్కసారి కంట్లో పడితే కంటి చూపు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి.. అధిక లోడుతో వెళితే సీజ్ చేయాలన్నారు. నంద్యాల సిటీకేబుల్(డిజిటల్ టీవీ కమ్యూనికేషన్) యాజమాన్యం కేబుల్ వ్యవస్థ అంతా తమ చేతుల్లోనే ఉంచుకోవాలని చూస్తోందన్నారు. దీని కోసం ఆపరేటర్లను భయపెట్టడం, వారు తగ్గకపోతే కనెక్షన్ తక్కువ ధరకే ఇచ్చి వారిని దెబ్బతీయడం చేస్తోందన్నారు. గడివేముల మండలంలో కొందరు ఆపరేటర్లు సిటీకేబుల్ నుంచి పక్కకు వచ్చి సొంతంగా కేబుల్ ఏర్పాటు చేసుకుంటే వారిని దెబ్బతీయడానికి నెలకు రూ.130 ఉన్న కనెక్షన్‌ను ఒక్క గడివేముల మండలంలో మాత్రం రూ.50కే ఇస్తున్నారన్నారు. గడివేముల మండలం నుంచి ఇన్ని సంవత్సరాలు కోట్లాది రూపాయలు ఆదాయం తీసుకున్నారని, ఆ ఆదాయంతో రూ.50కి కనెక్షన్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. అయితే నంద్యాల పట్టణంలో కూడా రూ.50కే కనెక్షన్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. సిటీకేబుల్ యజామాన్యం ప్రజలను, ఆపరేటర్లను ఇబ్బందులు పెడితే త్వరలోనే తాను నంద్యాలలో కేబుల్‌టీవీ ఏర్పాటు చేస్తానన్నారు. తాను ఎన్నడు వ్యాపార విషయాల్లో జోక్యం చేసుకోలేదని, ఎవరి వ్యాపారం వారు చేసుకుంటారని, అయితే స్వచ్ఛం దంగా పని చేసుకుంటున్న గడివేముల ఆపరేటర్లను భయపెట్టడం తగదన్నారు. కార్యక్రమంలో పాణ్యం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సూర్యనారాయణరెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ వైస్ చైర్మన్ ఆర్బీ చంద్రశేఖర్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, బాలహుసేని, బిలకలగూడూరు చంద్రశేఖర్‌రెడ్డి, ఆపరేటర్లు పాల్గొన్నారు. -
రెండేళ్లలో మూడు రెట్లకు ఉత్పత్తి సామర్థ్యం
► నిర్మాణంలో మరిన్ని కొత్త ప్లాంట్లు ► అక్టోబరు నుంచి మార్కెట్ జోష్ ► ‘సాక్షి’తో జేఎస్‌డబ్ల్యు సిమెంట్ ► సీఈవో అనిల్ కుమార్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీలో ఉన్న జేఎస్‌డబ్ల్యు సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెద్ద ఎత్తున పెంచుతోంది. ప్రస్తుతం కంపెనీకి ఉన్న ప్లాంట్ల వార్షిక సామర్థ్యం 6 మిలియన్ టన్నులు. పశ్చిమ బెంగాల్, కర్నాటక, తమిళనాడు, ఒడిశాలో సంస్థ కొత్త ప్లాంట్లు నెలకొల్పుతోంది. రెండేళ్లలో ఈ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని జేఎస్‌డబ్ల్యు సిమెంట్ డెరైక్టర్, సీఈవో అనిల్ కుమార్ పిళ్లై వెల్లడించారు. ఇవి కార్యరూపంలోకి వస్తే ఉత్పత్తి సామర్థ్యం 18 మి. టన్నులకు చేరుకుంటుందని చెప్పారు. ఇందుకు కంపెనీ రూ.1,700 కోట్లకుపైగా వెచ్చిస్తున్నట్టు సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మార్కెట్ పరిస్థితి, కంపెనీ విస్తరణ గురించి ఆయనింకా ఏమన్నారంటే.. కొనుగోళ్లకు సిద్ధం.. తూర్పు భారత్‌లో అడుగు పెట్టాలన్నది జేఎస్‌డబ్ల్యు సిమెంట్ ప్రణాళిక. ఈ నేపథ్యంలోనే లఫార్జ్ ఇండియా చేతిలో ఉన్న ప్లాంట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డాం. చత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లో ఈ ప్లాంట్లున్నాయి. కొనుగోలు ప్రక్రియ కొలిక్కి రాలేదు. కంపెనీ వృద్ధికి తోడవుతుందని భావిస్తే ప్లాంట్ల కొనుగోళ్లకు సిద్ధం. దక్షిణాది మార్కెట్లో కంపెనీకి 4.5-5% వాటా ఉంది. 2014-15లో 2.12 మిలియన్ టన్నుల సిమెంటు, గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్(జీజీబీఎస్) 1 మి. టన్నులు విక్రయించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.27 మి. టన్నుల సిమెంటు, 1.4 మి. టన్నుల జీజీబీఎస్ విక్రయాలు అంచనా వేస్తున్నాం. నిర్మాణాలకు సరైన సమయం.. కంపెనీకి ఉన్న ప్లాంట్ల వినియోగం ప్రస్తుతం 50-55 శాతముంది. అక్టోబరు నుంచి ఇది మెరుగుపడి 60%కి చేరుతుందని భావిస్తున్నాం. తక్కువ డిమాండ్, ప్లాంట్ల సామర్థ్యం అధికంగా ఉండడం పరిశ్రమకు అతి పెద్ద అడ్డంకి. దక్షిణాది ప్లాంట్లకే ఈ సమస్య ఉంది. ఉత్తరాదిన ఉన్న పలు కంపెనీల ప్లాంట్ల వినియోగం 70-75% దాకా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో బస్తా ధర రూ.250 ఉంది. గతేడాది ఇదే సమయంలో ఈ ధర ఏకంగా రూ.310 నమోదైంది. ఏదేమైనా ప్రస్తుతమున్న సిమెంటు ధరలు చాలా తక్కువ. ఇళ్లు కట్టుకోవడానికి కస్టమర్లకు ఇదే సరైన సమయం. అక్టోబరు నుంచి మంచి రోజులు.. దక్షిణాది సిమెంటు మార్కెట్ 2015-16లో 4 శాతం తిరోగమన వృద్ధి చెందింది. మార్కెట్ తిరిగి అక్టోబరు నుంచి గాడిలో పడుతుందని విశ్వసిస్తున్నాం. దీర్ఘకాలిక మన్నికను దృష్టిలో పెట్టుకుని జాతీయ రహదారులను సిమెంటు కాంక్రీటుతో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది సిమెంటు పరిశ్రమకు పెద్ద బూస్ట్‌నిస్తుంది. తారు రోడ్ల జీవిత కాలం కొన్నేళ్లే. సిమెంటు రోడ్ల జీవిత కాలం 25 ఏళ్ల పైమాటే. రెండు మూడేళ్లలో కొత్త రోడ్లన్నీ సిమెంటు కాంక్రీటువే కనపడనున్నాయి. అలాగే కొత్త రైల్వే ప్రాజెక్టులు, ఇతర మౌలిక వసతులు, ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని.. వెరశి సిమెంటుకు డిమాండ్ పెరిగి పరిశ్రమకు మంచి రోజులు రానున్నాయి.