రెండేళ్లలో మూడు రెట్లకు ఉత్పత్తి సామర్థ్యం
► నిర్మాణంలో మరిన్ని కొత్త ప్లాంట్లు
► అక్టోబరు నుంచి మార్కెట్ జోష్
► ‘సాక్షి’తో జేఎస్‌డబ్ల్యు సిమెంట్
► సీఈవో అనిల్ కుమార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీలో ఉన్న జేఎస్‌డబ్ల్యు సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెద్ద ఎత్తున పెంచుతోంది. ప్రస్తుతం కంపెనీకి ఉన్న ప్లాంట్ల వార్షిక సామర్థ్యం 6 మిలియన్ టన్నులు. పశ్చిమ బెంగాల్, కర్నాటక, తమిళనాడు, ఒడిశాలో సంస్థ కొత్త ప్లాంట్లు నెలకొల్పుతోంది. రెండేళ్లలో ఈ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని జేఎస్‌డబ్ల్యు సిమెంట్ డెరైక్టర్, సీఈవో అనిల్ కుమార్ పిళ్లై వెల్లడించారు. ఇవి కార్యరూపంలోకి వస్తే ఉత్పత్తి సామర్థ్యం 18 మి. టన్నులకు చేరుకుంటుందని చెప్పారు. ఇందుకు కంపెనీ రూ.1,700 కోట్లకుపైగా వెచ్చిస్తున్నట్టు సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మార్కెట్ పరిస్థితి, కంపెనీ విస్తరణ గురించి ఆయనింకా ఏమన్నారంటే..
కొనుగోళ్లకు సిద్ధం..
తూర్పు భారత్‌లో అడుగు పెట్టాలన్నది జేఎస్‌డబ్ల్యు సిమెంట్ ప్రణాళిక. ఈ నేపథ్యంలోనే లఫార్జ్ ఇండియా చేతిలో ఉన్న ప్లాంట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డాం. చత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లో ఈ ప్లాంట్లున్నాయి. కొనుగోలు ప్రక్రియ కొలిక్కి రాలేదు. కంపెనీ వృద్ధికి తోడవుతుందని భావిస్తే ప్లాంట్ల కొనుగోళ్లకు సిద్ధం. దక్షిణాది మార్కెట్లో కంపెనీకి 4.5-5% వాటా ఉంది. 2014-15లో 2.12 మిలియన్ టన్నుల సిమెంటు, గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్(జీజీబీఎస్) 1 మి. టన్నులు విక్రయించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.27 మి. టన్నుల సిమెంటు, 1.4 మి. టన్నుల జీజీబీఎస్ విక్రయాలు అంచనా వేస్తున్నాం.
నిర్మాణాలకు సరైన సమయం..
కంపెనీకి ఉన్న ప్లాంట్ల వినియోగం ప్రస్తుతం 50-55 శాతముంది. అక్టోబరు నుంచి ఇది మెరుగుపడి 60%కి చేరుతుందని భావిస్తున్నాం. తక్కువ డిమాండ్, ప్లాంట్ల సామర్థ్యం అధికంగా ఉండడం పరిశ్రమకు అతి పెద్ద అడ్డంకి. దక్షిణాది ప్లాంట్లకే ఈ సమస్య ఉంది. ఉత్తరాదిన ఉన్న పలు కంపెనీల ప్లాంట్ల వినియోగం 70-75% దాకా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో బస్తా ధర రూ.250 ఉంది. గతేడాది ఇదే సమయంలో ఈ ధర ఏకంగా రూ.310 నమోదైంది. ఏదేమైనా ప్రస్తుతమున్న సిమెంటు ధరలు చాలా తక్కువ. ఇళ్లు కట్టుకోవడానికి కస్టమర్లకు ఇదే సరైన సమయం.
అక్టోబరు నుంచి మంచి రోజులు..
దక్షిణాది సిమెంటు మార్కెట్ 2015-16లో 4 శాతం తిరోగమన వృద్ధి చెందింది. మార్కెట్ తిరిగి అక్టోబరు నుంచి గాడిలో పడుతుందని విశ్వసిస్తున్నాం. దీర్ఘకాలిక మన్నికను దృష్టిలో పెట్టుకుని జాతీయ రహదారులను సిమెంటు కాంక్రీటుతో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది సిమెంటు పరిశ్రమకు పెద్ద బూస్ట్‌నిస్తుంది. తారు రోడ్ల జీవిత కాలం కొన్నేళ్లే. సిమెంటు రోడ్ల జీవిత కాలం 25 ఏళ్ల పైమాటే. రెండు మూడేళ్లలో కొత్త రోడ్లన్నీ సిమెంటు కాంక్రీటువే కనపడనున్నాయి. అలాగే కొత్త రైల్వే ప్రాజెక్టులు, ఇతర మౌలిక వసతులు, ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని.. వెరశి సిమెంటుకు డిమాండ్ పెరిగి పరిశ్రమకు మంచి రోజులు రానున్నాయి.