తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు.. ఒకేసారి 50కి పైగా ప్రాంతాల్లో
సాక్షి, హైదరాబాద్: గడిచిన నాలుగైదు నెలలుగా వరసబెట్టి ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేస్తున్న దాడులు రియల్ ఎస్టేట్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తాజాగా బుధవారం నగరంలోని పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దాదాపు 30కి పైగా బృందాలు బుధవారం తెల్లవారుజాము నుంచే రియల్ ఎస్టేట్ సంస్థలు ఆదిత్య హోం, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో విల్లాలు నిర్మిస్తున్న ఉర్జిత్ కన్స్ట్రక్షన్స్, సీఎస్కే బిల్డర్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి.
ఐదారు సంవత్సరాలుగా వారు చూపెడుతున్న లెక్కలకు, చెల్లిస్తున్న ఆదాయ పన్నుకు పొంతనలేని కారణంగానే ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అదే విధంగా గురువారం కూడా కొన్ని సంస్థల్లో సోదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. బంజారాహిల్స్‌లోని శ్రీఆదిత్య హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కోటారెడ్డి, ఆయన కుమారుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న ఆదిత్యరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి.
కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో గల లోధా బెల్లెజలో నివాసం ఉండే ఉర్జిత్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్స్ శ్రీనివాసరెడ్డి, వీరప్రకాష్ నివాసాల్లో బుధవారం ఉదయం రెండు వాహనాల్లో వచ్చిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్, పంజాగుట్ట ప్రాంతాల్లోని కార్యాలయాలు, నివాసాల్లో కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మరో బిల్డర్ మాధవరెడ్డి ఇంట్లో, సీఎస్కే కార్యాలయంలోనూ ఐటీ అధికారులు దాడులు కొనసాగించారు.
ఈ సంస్థలన్నీ ఐటీ రిటర్న్స్‌లో పలు అవకతవకలకు పాల్పడినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండికొట్టినట్లు నిర్ధారణ కావడంతోనే ఆ శాఖ అధికారులు ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ దాడుల సందర్భంగా పలు కీలక పత్రాలు, డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్‌్కలు స్వా«దీనం చేసుకున్నారు.