తానేం చేస్తున్నాడో సల్మాన్‌కు తెలుసు
ముంబై: మద్యం మత్తులో వేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే అది జనం ప్రాణాలు పోవడానికి కారణమవ్వొచ్చని సల్మాన్‌ఖాన్‌కు తెలుసని అతనికి ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసిన ముంబై సెషన్ కోర్టు జడ్డి డి.డబ్ల్యు.దేశ్‌పాండే తీర్పులో పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన అమెరికన్ ఎక్స్‌ప్రెస్ లాండ్రీ ప్రాంతంలోనే సల్మాన్ నివాసం కూడా ఉందని, అక్కడ పేవ్‌మెంట్‌పై పేదలు పడుకుంటారనే విషయమూ సల్మాన్‌కు తెలుసని పేర్కొన్నారు. డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా వాహనం నడపడం నేరమని, మద్యం సేవించి నడపం ప్రమాదకరమనేది కూడా తెలుసని వ్యాఖ్యానించారు.
ప్రమాద సమయంలో తాను వాహనం నడుపలేదని, తన డ్రైవర్ అశోక్ సింగ్ నడిపాడనే సల్మాన్ వాదనతో కూడా జడ్జి విబేధించారు. 13 ఏళ్ల విచారణ కాలంలో సల్మాన్ వాంగ్మూలానికి ముందెప్పుడూ అశోక్‌సింగ్ ప్రస్తావనే ఎప్పుడూ రాలేదని ఎత్తిచూపారు. అశోక్సింగ్తో తప్పుడు వాంగ్మూలం ఇప్పించారనే ప్రాసిక్యూషన్ వాదనతో ఆయన ఏకీభవించారు. ఒకవేళ అశోక్సింగే నడిపితే... ఎంతమంది చనిపోయారని అడిగితే అతనెందుకు తడబడతారని జడ్జి ప్రశ్నించారు. నిందితుడే (సల్మాన్‌ఖాన్) వాహనం నడుపుతున్నాడనేది నిరూపితమైందని, అకస్మాత్తుగా టైరు పేలిపోయిందనే వాదనలో పసలేదని అభిప్రాయపడ్డారు.