ఆశ పడింది.. అడ్డంగా దొరికింది
సాక్షి, అనకాపల్లి: కాసులకు కక్కుర్తిపడిన జీవీఎంసీ ఉద్యోగిని అడ్డంగా ఏసీబీకి చిక్కింది. ఆరేళ్ల చరిత్ర కలిగిన జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలో ఇదే తొలి ఏసీబీ కేసు. పబ్లిక్‌హెల్త్ వర్కర్ పదవీ విరమణ చేసిన తర్వాత వారి పీఎఫ్ సొమ్ముకు సంబంధించిన ఫైల్ క్లియరెన్స్ కోసం లంచం తీసుకుంటుండగా జూనియర్ అకౌంటెంట్ తనకాల దేవీలక్ష్మిని పట్టుకున్నామని అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ కె.రంగరాజు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లిలో పబ్లిక్‌హెల్త్ వర్కర్‌గా పని చేసిన ఎర్రంశెట్టి సుభద్ర గత నెలాఖరున ఉద్యోగ విరమణ చేశారు. ఆమెకు రావాల్సిన పీఎఫ్ సొమ్ము కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ ప్రక్రియ పూర్తికి జూనియర్ అకౌంటెంట్ దేవిలక్ష్మి 10 వేల రూపాయలను డిమాండ్ చేసింది. సుభద్ర రూ.8 వేలు ఇచ్చేందుకు ఒప్పుకుంది. తొ లి విడగతగా రూ.6 వేలు ఇచ్చేం దుకు అంగీకరించింది. అయితే లం చం ఇవ్వడం ఇష్టలేని సుభద్ర కుమారుడు శివ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
వారిచ్చిన సలహా మేరకు మంగళవారం ఆరు వేలు రూపాయలను దేవిలక్ష్మికి ఇచ్చేందుకు జీవీఎంసీ కార్యాలయానికి శివ వెళ్లాడు. డబ్బులను కార్యాలయం పక్కన ఉన్న ట్రాక్టర్ వద్ద దేవిలక్ష్మికి ఇచ్చాడు. డబ్బులను తీసుకున్న ఆమె కార్యాలయంలో వేరేగదిలో ఉన్న మరో మహిళ ఉద్యోగిని చేతికి ఇచ్చారు. అయితే అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. వేరొక విభాగానికి చెందిన గదిలో ఉన్న దేవీలక్ష్మిని తన అసలు సీటు వద్దకు రావాలని సూచించారు. బీ–1గా పని చేస్తున్న దేవి తన కుర్చీలో ఆశీనులైన వెంటనే ఆమె రెండు చేతులు ఓ మహిళా అధికారిని పట్టుకొని నిజం చెప్పమని హెచ్చరించారు.
నిజం చెప్పకపోతే కఠినంగా సమాధానం రాబట్టాల్సి వస్తుందని హెచ్చరించడంతో లంచం తీసుకున్న వాస్తవాన్ని దేవి అంగీకరించింది. దీంతో ఏసీబీ డీఎస్పీ కె.రంగరాజు నేతృత్వంలోని సీఐలు ఎం.వి.గణేష్, ఎం.యు.రమణమూర్తి, కె.లక్ష్మణమూర్తి, జి.అప్పారావు ఆమెను విచారించారు. ఏసీబీని ఆశ్రయించిన శివ నుంచి కూడా వివరాలు సేకరించి ఛార్జ్‌షీటు ఫైల్ చేశామని డీఎస్పీ కె.రంగరాజు మీడియాకు వివరించారు. జూనియర్ అకౌంటెంట్ దేవిని కోర్టులో హాజరు పరుస్తామన్నారు. కాగా సాయంత్రం వరకు ఏసీబీ అధికారులు జీవీఎంసీ కార్యాలయంలోనే ఉండడంతో మిగిలిన విభాగాల అధికారులు భయం భయంగా గడిపారు.
పని జరగాలంటే చేయి తడపాల్సిందే!
జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలో ఎటువంటి ఫైల్ కదలాలన్నా ఎంతోకొంత పైకం ముట్టచెప్పాల్సిందేననే ఆరోపణలున్నాయి. చిన్న పని చేసి పెట్టాలన్నా ఇక్కడి ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తారని బాధితులు చెబుతుంటారు. ఉద్యోగుల మధ్య విభేదాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అనకాపల్లి జోన్ పరిధిలో ఒక ఉద్యోగి గతంలో మరణించాడు. సబార్డినేట్ హోదాలో ఉన్న సదరు ఉద్యోగి కుమారినికి మళ్లీ కారుణ్య నియామం ద్వారా ఉద్యోగం వచ్చేందుకు రూ. లక్షా 20వేలు సమర్పించుకోవాల్సి వచ్చిందనే ప్రచారం జరిగింది. ఇది ఉదాహరణ మాత్రమే. ఇక్కడ ఏ పని జరగాలన్నా ఉద్యోగులు లంచం డిమాండ్ చేయడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కాగా 1992లో ఓ ఉద్యోగి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అతన్ని పుట్టకున్నారు.