Jute bag industry
-
అంతా ప్రచార ఆర్భాటమే...
సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ : వెనుకబడిన జిల్లాల అభివృద్ధిలో విజయనగరం ముందున్నట్లు ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అంతా భూటకమే. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. పైగా జూట్, ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమలు మూతబడి నాలుగు న్నరేళ్లయినా తెరుచుకోలేదు. దీంతో జిల్లాలో వేలాది కార్మికులు రోడ్డున పడగా, గ్రామీణ ప్రాంతాల్లో వలసల జోరు పెరిగింది. సహజ, మానవ వనరులు పుష్కలంగా ఉన్న జిల్లా ఇది. కానీ పారిశ్రామిక అభివృద్ధిలో ఎప్పుడూ అట్టడుగు స్థానంలోనే ఉంటోంది. జిల్లాలో సుమారుగా 24 లక్షల జనాభా ఉండగా.. గ్రామీణ ప్రాంతంలో 19 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 5 లక్షల జనాభా ఉన్నారు. జిల్లాలో 43 భారీ, మధ్య తరగతి పరిశ్రలుండగా అందులో 24,025 మంది వరకు ఉపాధి పొందుతున్నారు. వీటిలో స్టీల్, ఫెర్రో అల్లాయీస్, ఫార్మా, సుగర్ కేన్, కెమికల్, జీడి వంటి పరిశ్రమలున్నాయి. అలాగే చిన్న, చిన్న పరిశ్రమలు జిల్లాలో 4,288 వరకు ఉన్నాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీతో వీటిలో 40 శాతం పరిశ్రమలు మూతబడ్డాయి. వీటితో పాటు జూట్ పరిశ్రమలు మూతబడి సుమారు 20 వేల మంది వరకు ఉపాధి కోల్పోయారు. నడుస్తున్న పరిశ్రమల్లో కూడా కార్మికులు, ఉద్యోగుల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో ఉపాధి కోసం విశాఖ, హైదరాబాద్, విజయవాడ, చెన్నై వంటి ప్రాంతాలకు వలసలు పోతున్నారు. ఒప్పందాలన్నీ కాగితాల్లోనే.. ఐదేళ్లుగా విశాఖలో పారిశ్రామిక సదస్సులు జరుగుతున్నాయి. 2016లో జిల్లాలో 8 పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం కుదరగా, రూ.11,932 కోట్లు పెట్టుబడులు వస్తాయని, 20,350 మందికి ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. అలాగే 2017 జనవరి 27, 28 తేదీల్లో మరో 15 పారిశ్రామిక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఒప్పందాలు జరిగాయి. ఈసారి రూ.11 వేల కోట్లతో 4,527 మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. 2018 లోనూ 11 పరిశ్రమలు ఏర్పాటవుతాయని ప్రకటించారు. ఇవేవీ ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. కంపెనీల పేరిట దళిత, గిరిజనుల డి–పట్టా భూములు లాక్కుంటున్నారే తప్ప, గడిచిన ఐదేళ్లలో ఒక్క పరిశ్రమా ఏర్పాటు కాలేదు. పరిశ్రమల పేరిట భూసేకరణ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటు పేరుతో 735.96 ఎకరాల భూమి సేకరించారు. గజపతినగరం మండలం మరుపల్లి, పూసపాటిరేగ మండలం కందివలస, కొత్తవలస మండలం బలిఘట్టాం వద్ద భూములు తీసుకున్నారు. ల్యాండ్ బ్యాంక్ కింద 1,315.18 ఎకరాలు సేకరించారు. ఈ భూమంతా భోగాపురం మండలం కొంగవానిపాలెం, కొత్తవలస మండలం కంటకాపల్లి, చినరావుపల్లి, పెద్దరావుపల్లి, రామభద్రపురం మండలం కొట్టక్కి, ఎస్.కోట మండలం ముసిడిపల్లి, నెల్లిమర్ల మండలం టెక్కలి, గజపతినగరం మండలం మరుపల్లి ప్రాంతాల్లో ఉంది. వీటితో పాటు పతంజలి అయుర్వేద కంపెనీకి 172.84 ఎకరాలు కొత్తవలస మండలంలోని చిన్నరావుపల్లి వద్ద భూసేకరణ చేపట్టారు. వీటన్నింటికీ వచ్చే 2020 పారిశ్రామిక అభివృద్ధి పాలసీ కింద ప్రభుత్వ రాయితీలు, పన్నుల మినహాయింపు, విద్యుత్ సదుపాయాలు వంటి అనేక సదుపాయాలు కల్పిస్తామంటూ మభ్యపెట్టడం మినహా ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు. తీరని అన్యాయం ఐదేళ్ల చంద్రబాబు పాలనలో కార్మిక రంగానికి తీరని అన్యాయం జరిగింది. జిల్లా కేంద్రంలో ఉన్న రెండు జూట్ మిల్లులు మూతపడగా.. వాటి గురించి పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. గతేడాది జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి యాజమన్యంతో చర్చలు జరిపించి జూట్‌మిల్లులు తెరిపిస్తామని ఇచ్చిన హమీ అమలుకు నోచుకోలేదు. ఇలాంటి బూటకపు పాలన ఎప్పుడూ చూడలేదు. కార్మికలోకం ఉసురు తగలక మానదు. –ఎం.రాంబాబు, జూట్‌మిల్లు కార్మికుడు, విజయనగరం. -
జ్యూట్ బ్యాగ్ పరిశ్రమ పెట్టాలంటే...
మీరే పారిశ్రామికవేత్త! ‘ఇంట్లో అందరూ సంపాదన పరులే. నేను మాత్రం ఎందుకు ఖాళీగా ఉండాలి’ అనుకుంటున్నారా? ‘ప్రతి ఒక్కరిలో ఏదో ఓ నైపుణ్యం ఉంటుంది. నాలో నైపుణ్యాన్ని నిరూపించుకోవాలి’ అనుకుంటున్నారా? ఇవేవీ కాదు, ‘డబ్బు సంపాదించాలంటే ఉద్యోగమే మార్గం కాదు. ఉద్యోగాలిచ్చే పరిశ్రమను స్థాపించడం గొప్ప ఆలోచన’ అనుకుంటున్నారా? ఇందులో మీరు ఎలా ఆలోచించినా, మీలో ఏదో చేయాలనే తపన ఉన్నట్టే! మీ ఆలోచనలకు వాస్తవ రూపమివ్వడానికే ఈ ప్రయత్నం. ఈ వారం జ్యూట్ బ్యాగ్ పరిశ్రమ ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం. ఏమేం కావాలి? ఎంత ఖర్చవుతుంది? (ధరలు రూపాయల్లో) 1 జ్యూట్ సూయింగ్ మెషీన్ - 12,000 నుంచి 20,000. ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేయాలంటే ఇండస్ట్రియల్ మెషీన్ తీసుకోవాలి. అది 20,000 ఉంటుంది. 1 కటింగ్ మెషీన్ - 9,000. చేత్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఎక్కువ మోతాదులో కావాలంటే మెషీన్ ఉంటే పని సులువవుతుంది. ఒక మెషీన్‌కు ఒక మనిషి చేత్తో కట్ చేసి అందించగలరు. 1 కటింగ్ టేబుల్ - 12,000. మీది చిన్న గది అయితే టేబుల్ వేయడం కుదరదు. నేల మీద పరచి కత్తిరించుకోవాలి. మరింత ఆకర్షణీయంగా తయారుచేయాలంటే ఎంబ్రాయిడరీ మెషీన్ కూడా తీసుకోవచ్చు. దీని ధర 28,000. 2 ర్యాకులు- ఒక్కొక్కటి 2,500 1 అల్మెరా - 6,000 నుంచి 7,000 ఇతరాలు: 1 కత్తెర - 200 1 పెద్ద స్కేలు - 20 1 టేపు - 5 10 బాబిన్లు, బాబిన్ కేస్లు - 350 మెషీన్ రిపేర్ కోసం స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్ సెట్ - 100 2 ఐలెట్ పంచెస్ (రంధ్రాలు చేయడానికి) - ఒక్కోటి వంద. (‘ఎలీప్’ ఇచ్చిన వివరాలతో...) మ్యాన్‌పవర్: ఇద్దరు కావాలి స్థలం ఎంతుండాలి? ఒక మెషీన్‌తో యూనిట్ పెట్టడానికి కనీసంగా కావల్సిన స్థలం: 12 బై 12 అడుగుల గది. టేబుల్ కూడా అమర్చుకోవాలంటే మరికొంత పెద్దగా ఉండాలి. యాభై వేల రూపాయలు మీ చేతిలో ఉంటే ప్రభుత్వ సబ్సిడీలు, బ్యాంకు రుణాల సహకారంతో పది లక్షల రూపాయల యూనిట్ పెట్టుకోవచ్చు. శిక్షణ ఎలా? భారత ప్రభుత్వపు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ‘వందేమాతరం’ పేరుతో కేంద్ర పరిశ్రమల శాఖ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వాటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ‘ఎలీప్’ నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా 18-45 ఏళ్ల మధ్య వయసు మహిళలు (కనీస విద్యార్హత 5వ తరగతి) శిక్షణ పొందవచ్చు. ఎలాంటివి ఉత్పత్తి చేయొచ్చు? కుషన్ కవర్లు, కర్టెన్లు, సెల్‌ఫోన్ కవర్లు, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, లంచ్ బాక్సుల ఆకారాలను బట్టి వాటిని ఇమిడ్చే బ్యాగులను తయారుచేయవచ్చు. సర్టిఫికెట్ల ఫోల్డర్లు, కూరగాయల సంచుల నుంచి పిక్నిక్కు పనికొచ్చే వెరైటీలు, ఇలా దైనందిన జీవనాన్ని గమనిస్తే ఎన్నో ఆలోచనలొస్తాయి. మార్కెట్ ఎలా? జిల్లా, మండల కేంద్రాలలోని డ్వాక్రా బజార్లలో స్టాల్ అద్దెకు తీసుకుని స్వయంగా అమ్ముకోవచ్చు. ప్రభుత్వం అనుమతించిన మార్కెట్ ఏజెన్సీలతో అంగీకారం కుదుర్చుకోవచ్చు. గుళ్ల దగ్గర, కాలనీలోని దుకాణదారులకు ప్రయోగాత్మకంగా కొన్ని పీసులను ప్రదర్శించమని అడగవచ్చు. ఇంకా, ఎలీప్ ‘విపణి’ కార్యక్రమం ద్వారా అమ్మకందార్లను, కొనుగోలుదార్లను అనుసంధానిస్తోంది. శిక్షణ ఎక్కడ? రిజిస్ట్రేషన్ ఏలా? 1800 123 2388 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించవచ్చు. యాభై వేల రూపాయలు చేతిలో ఉంటే పదిలక్షల యూనిట్ ప్రారంభించే అవకాశాలు నేడు మహిళలకు అందుబాటులో ఉన్నాయి. ఎలీప్ ద్వారా శిక్షణ, పరిశ్రమ పెట్టడానికి అవసరమైన అన్ని రకాల ప్రోత్సాహాలు అందిస్తున్నాం. ఆన్లైన్ మార్కెట్‌కు కూడా తెర తీశాం. జ్యూట్ (జనపనార) పర్యావరణ హితమైనది. దాని వాడకం పెరిగితే పరోక్షంగా రైతులకు ఉపాధి పెరుగుతుంది. - రమాదేవి ఎలీప్(అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) అధ్యక్షురాలు రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి