అంతా ప్రచార ఆర్భాటమే... | When TDP Came to Power, The District Did Not Get A Single Industry | Sakshi
Sakshi News home page

అంతా ప్రచార ఆర్భాటమే...

Published Sat, Mar 16 2019 2:56 PM | Last Updated on Sat, Mar 16 2019 2:56 PM

When TDP Came to Power, The District Did Not Get A Single Industry - Sakshi

 జిల్లా కేంద్రంలో మూతపడి ఉన్న  జూట్‌మిల్లు 

సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ : వెనుకబడిన జిల్లాల అభివృద్ధిలో విజయనగరం ముందున్నట్లు ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అంతా భూటకమే. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. పైగా జూట్, ఫెర్రో అల్లాయీస్‌ పరిశ్రమలు మూతబడి నాలుగు న్నరేళ్లయినా తెరుచుకోలేదు. దీంతో జిల్లాలో వేలాది కార్మికులు రోడ్డున పడగా, గ్రామీణ ప్రాంతాల్లో వలసల జోరు పెరిగింది. సహజ, మానవ వనరులు పుష్కలంగా ఉన్న జిల్లా ఇది.

కానీ పారిశ్రామిక అభివృద్ధిలో ఎప్పుడూ అట్టడుగు స్థానంలోనే ఉంటోంది. జిల్లాలో సుమారుగా 24 లక్షల జనాభా ఉండగా.. గ్రామీణ ప్రాంతంలో 19 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 5 లక్షల జనాభా ఉన్నారు. జిల్లాలో 43 భారీ, మధ్య తరగతి పరిశ్రలుండగా అందులో 24,025 మంది వరకు ఉపాధి పొందుతున్నారు. వీటిలో స్టీల్, ఫెర్రో అల్లాయీస్, ఫార్మా, సుగర్‌ కేన్, కెమికల్, జీడి వంటి పరిశ్రమలున్నాయి. అలాగే చిన్న, చిన్న పరిశ్రమలు జిల్లాలో 4,288 వరకు ఉన్నాయి.

పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీతో వీటిలో 40 శాతం పరిశ్రమలు మూతబడ్డాయి. వీటితో పాటు జూట్‌ పరిశ్రమలు మూతబడి సుమారు 20 వేల మంది వరకు ఉపాధి కోల్పోయారు. నడుస్తున్న పరిశ్రమల్లో కూడా కార్మికులు, ఉద్యోగుల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో ఉపాధి కోసం విశాఖ, హైదరాబాద్, విజయవాడ, చెన్నై వంటి ప్రాంతాలకు వలసలు పోతున్నారు. 

ఒప్పందాలన్నీ కాగితాల్లోనే..
  ఐదేళ్లుగా విశాఖలో పారిశ్రామిక సదస్సులు జరుగుతున్నాయి. 2016లో జిల్లాలో 8 పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం కుదరగా, రూ.11,932 కోట్లు పెట్టుబడులు వస్తాయని, 20,350 మందికి ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. అలాగే 2017 జనవరి 27, 28 తేదీల్లో మరో 15 పారిశ్రామిక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు ఒప్పందాలు జరిగాయి. ఈసారి రూ.11 వేల కోట్లతో 4,527 మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. 2018 లోనూ 11 పరిశ్రమలు ఏర్పాటవుతాయని ప్రకటించారు. ఇవేవీ ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. కంపెనీల పేరిట దళిత, గిరిజనుల డి–పట్టా భూములు లాక్కుంటున్నారే తప్ప, గడిచిన ఐదేళ్లలో ఒక్క పరిశ్రమా ఏర్పాటు కాలేదు. 

పరిశ్రమల పేరిట భూసేకరణ
జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటు పేరుతో 735.96 ఎకరాల భూమి సేకరించారు. గజపతినగరం మండలం మరుపల్లి, పూసపాటిరేగ మండలం కందివలస, కొత్తవలస మండలం బలిఘట్టాం వద్ద భూములు తీసుకున్నారు. ల్యాండ్‌ బ్యాంక్‌ కింద 1,315.18 ఎకరాలు సేకరించారు. ఈ భూమంతా భోగాపురం మండలం కొంగవానిపాలెం, కొత్తవలస మండలం కంటకాపల్లి, చినరావుపల్లి, పెద్దరావుపల్లి, రామభద్రపురం మండలం కొట్టక్కి, ఎస్‌.కోట మండలం ముసిడిపల్లి, నెల్లిమర్ల మండలం టెక్కలి, గజపతినగరం మండలం మరుపల్లి ప్రాంతాల్లో ఉంది. వీటితో పాటు పతంజలి అయుర్వేద కంపెనీకి 172.84 ఎకరాలు కొత్తవలస మండలంలోని చిన్నరావుపల్లి వద్ద భూసేకరణ చేపట్టారు. వీటన్నింటికీ వచ్చే 2020 పారిశ్రామిక అభివృద్ధి పాలసీ కింద ప్రభుత్వ రాయితీలు, పన్నుల మినహాయింపు, విద్యుత్‌ సదుపాయాలు వంటి అనేక సదుపాయాలు కల్పిస్తామంటూ మభ్యపెట్టడం మినహా ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు.

తీరని అన్యాయం
ఐదేళ్ల చంద్రబాబు పాలనలో కార్మిక రంగానికి తీరని అన్యాయం జరిగింది. జిల్లా కేంద్రంలో ఉన్న రెండు జూట్‌ మిల్లులు మూతపడగా.. వాటి గురించి పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. గతేడాది జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి యాజమన్యంతో చర్చలు జరిపించి జూట్‌మిల్లులు తెరిపిస్తామని ఇచ్చిన హమీ అమలుకు నోచుకోలేదు.  ఇలాంటి బూటకపు పాలన ఎప్పుడూ చూడలేదు. కార్మికలోకం  ఉసురు  తగలక  మానదు. 
–ఎం.రాంబాబు, జూట్‌మిల్లు కార్మికుడు, విజయనగరం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement