juvvadi ratnakar rao
-
‘జువ్వాడి’ కన్నుమూత
సాక్షి, జగిత్యాల: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు (92) కన్నుమూశారు. అనారోగ్యంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. జువ్వాడి అంత్యక్రియలను ఆయన స్వస్థలం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్‌లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. గోదావరి నది తీరంలో సాయంత్రం 5.30 గంటలకు అంత్యక్రియలు జరిగాయి. జువ్వాడి పార్థివ దేహం వద్ద మంత్రులు టి.హరీశ్‌రావు, ఈట ల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు, మాజీ హోం మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్, కలెక్టర్ రవి, ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్, విద్యాసాగర్‌రావు, శ్రీధర్‌బాబు తదితరులు నివాళులర్పించారు. సర్పంచ్ నుంచి మంత్రి దాకా..:జువ్వాడి రత్నాకర్‌రావు మొదట సర్పంచ్‌గా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1967 నుం చి తిమ్మాపూర్ సర్పంచ్‌గా 12 ఏళ్లు పని చేశా రు. 1979లో జగిత్యాల బ్లాక్ సమితి అధ్యక్షుడిగా పని చేశారు. 1983లో జగిత్యాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి టీడీ పీ అభ్యర్థి జీవన్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 1989లో బుగ్గారం సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించి స్వతం త్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండాకుల గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్లీ 1994 ఎన్నికల్లో ఓటమి పాలైన జువ్వాడి.. 1999, 2004లో అసెంబ్లీ ఎన్నికల్లో బుగ్గారం నుంచి గెలుపొందారు. వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2007–09 వరకు దేవాదాయ, స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా కొనసాగారు. ఆ తరువాత 2009లో అసెంబ్లీ సెగ్మెంట్ల పునర్విభజన తరువాత 2009, 2010 అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. సీఎం కేసీఆర్ సంతాపం: మాజీ మంత్రి రత్నాకర్‌రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రత్నాకర్‌రావు అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో నిర్వహించాలని ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. టీపీసీసీ నేతల సంతాపం: రత్నాకర్‌రావు మృతి పట్ల రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు. సంతాపం తెలిపిన వారిలో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తదితరులు ఉన్నారు. రత్నాకర్‌రావు పార్థివ దేహం వద్ద మంత్రి హరీశ్ రావు తదితరులు -
మాజీ మంత్రి జువ్వాడి కన్నుమూత
సాక్షి, కరీంనగర్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు(93) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రత్నాకర్‌రావు నేడు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీనియర్ నాయకుల్లో ఒకరైన జువ్వాడి రాజకీయ దక్షత ఉన్ననేతగా పేరుగాంచారు. ధర్మపురి సమీపంలోని తిమ్మాపూర్ ఆయన స్వస్థలం. సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ల్యాండ్స్ అండ్ మెజర్మెంట్స్ బ్యాంక్ చైర్మన్‌గా, జగిత్యాల సమితి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1983లో జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 1989లో బుగ్గారం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు. కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ అల్లుడు భీమ్‌సేన్‌ను ఓడించిన జువ్వాడి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. 1999, 2004లో వరసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా పని చేశారు. అయితే 2009 ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓటమిపాలయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇటీవల కరీంనగర్‌లోని తన నివాసానికి తరలించారు. ఆదివారం తెల్లవారు జామున చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో అనారోగ్యంతో జువ్వాడి తుది శ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు నర్సింగరావు, కృష్ణా రావు ఉన్నారు. కాగా, రత్నాకర్‌రావు మృతదేహానికి మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, కరీంనగర్ మేయర్ సునీల్‌రావులు నివాళులర్పించారు. -
‘జువ్వాడి’కి చోటెక్కడో..?
మూడు సెగ్మెంట్లపై కన్ను పునర్విభజనపై ఆశలు టీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరం కోరుట్ల : సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు తనయుడు జువ్వాడి నర్సింగరావు గురువారం టీఆర్ఎస్లో చేరిన క్రమంలో రానున్న కాలంలో ఆయన ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తాడన్న అంశం స్థానికంగా చర్చనీయమైంది. ఏడాదిన్నర కాలంగా జువ్వాడి నర్సింగరావు ఆయన తమ్ముడు జువ్వాడి కృష్ణారావు టీఆర్ఎస్లో చేరుతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. జువ్వాడి నర్సింగరావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న క్రమంలో జగిత్యాల డివిజన్లో తనకు ప్రాబల్యం ఉన్న మూడు సెగ్మెంట్లలో ఏ ప్రాంతంలో పాగా వేస్తారన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది. నియోజకవర్గాల పునర్విభజనపై ప్రచారం జరగుతున్న క్రమంలో అదనంగా ఏర్పడే నియోజకవర్గాల్లో ఏదో ఓ చోట నుంచి ప్రాతినిధ్యం వహిస్తారన్న చర్చ కూడా మొదలైంది. మూడు సెగ్మెంట్లపై కన్ను 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఉన్న బుగ్గారం నియోజకవర్గంలో జువ్వాడి రత్నాకర్‌రావు మూడుసార్లు ఎమ్మెల్యేగా కొనసాగారు. అప్పుడు బుగ్గారం నియోజకవర్గంలో ఉన్న కోరుట్ల, ధర్మపురి, రాయికల్, సారంగాపూర్, వెల్గటూర్ మండలాలు నియోజకవర్గాల పునర్విభజన అనంతరం కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో జువ్వాడి రత్నాకర్‌రావు తనయుడు జువ్వాడి నర్సింగరావుకు ఈ మూడు ప్రాంతాల్లో ఓ మోస్తరు అనుచరవర్గం ఉంది. ఆయా ప్రాంతాల్లో రాజకీయంగా కొంత పట్టు ఉంది. 2014లో కోరుట్ల సెగ్మెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన జువ్వాడి నర్సింగరావు సుమారు 46వేల ఓట్లు సాధించారు. ఆ తరువాత కొంతకాలం నుంచి జువ్వాడి నర్సింగరావు టీఆర్ఎస్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, జగిత్యాలలో టీఆర్ఎస్ ఇన్చార్జి డాక్టర్ సంజయ్, ధర్మపురిలో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ పార్టీలో స్థిరపడిన క్రమంలో కొత్తగా పార్టీలో చేరిన జువ్వాడి నర్సింగరావుకు ఎక్కడ చోటు దక్కుతుందున్న అంశంలో పార్టీలో తర్జనభర్జనలు మొదలయ్యాయి. జువ్వాడి వర్గీయులు మాత్రం కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి సెగ్మెంట్లలో ఏదో చోట తమకు స్థానం దక్కుతుందన్న ఆశల్లో ఉన్నారు. రానున్న కాలంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జగిత్యాల డివిజన్లో ఏర్పాటయ్యే ఏదో ఓ కొత్త సెగ్మెంట్ నుంచి జువ్వాడి నర్సింగరావు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కార్యకర్తల్లో కలవరం.. జువ్వాడి నర్సింగరావు ఏ సెగ్మెంట్లో ప్రాతినిధ్యం వహించి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తారన్న అంశంలో పూర్తి స్పష్టత రాలేదు. ప్రధానంగా కోరుట్ల లేదా జగిత్యాల సెగ్మెంట్లలో తన కార్యకలాపాలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ఆయా సెగ్మెంట్లలో పార్టీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. ప్రస్తుతం కోరుట్ల, జగిత్యాల సెగ్మెంట్లలో ఉన్న పార్టీ నాయకులను అనుసరిస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు రానున్న కాలంలో జువ్వాడి ఈ రెండు ప్రాంతాల్లో ఏదో ఓ చోట నుంచి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తే తమ పరిస్థితి ఏంటన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్ని చోట్ల పార్టీ శ్రేణుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. కొత్త చేరికల నేపథ్యంలో ఆయా సెగ్మెంట్లలో టీఆర్ఎస్ పార్టీలో గ్రూపుల పోరుకు బీజం పడనుందన్న వాఖ్యనాలు వినవస్తున్నాయి.