మూడు సెగ్మెంట్లపై కన్ను
పునర్విభజనపై ఆశలు
టీఆర్‌ఎస్ శ్రేణుల్లో కలవరం
కోరుట్ల : సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు తనయుడు జువ్వాడి నర్సింగరావు గురువారం టీఆర్‌ఎస్‌లో చేరిన క్రమంలో రానున్న కాలంలో ఆయన ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తాడన్న అంశం స్థానికంగా చర్చనీయమైంది. ఏడాదిన్నర కాలంగా జువ్వాడి నర్సింగరావు ఆయన తమ్ముడు జువ్వాడి కృష్ణారావు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది.
జువ్వాడి నర్సింగరావు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న క్రమంలో జగిత్యాల డివిజన్‌లో తనకు ప్రాబల్యం ఉన్న మూడు సెగ్మెంట్లలో ఏ ప్రాంతంలో పాగా వేస్తారన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది. నియోజకవర్గాల పునర్విభజనపై ప్రచారం జరగుతున్న క్రమంలో అదనంగా ఏర్పడే నియోజకవర్గాల్లో ఏదో ఓ చోట నుంచి ప్రాతినిధ్యం వహిస్తారన్న చర్చ కూడా మొదలైంది.
మూడు సెగ్మెంట్లపై కన్ను
2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఉన్న బుగ్గారం నియోజకవర్గంలో జువ్వాడి రత్నాకర్‌రావు మూడుసార్లు ఎమ్మెల్యేగా కొనసాగారు. అప్పుడు బుగ్గారం నియోజకవర్గంలో ఉన్న కోరుట్ల, ధర్మపురి, రాయికల్, సారంగాపూర్, వెల్గటూర్ మండలాలు నియోజకవర్గాల పునర్విభజన అనంతరం కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో జువ్వాడి రత్నాకర్‌రావు తనయుడు జువ్వాడి నర్సింగరావుకు ఈ మూడు ప్రాంతాల్లో ఓ మోస్తరు అనుచరవర్గం ఉంది. ఆయా ప్రాంతాల్లో రాజకీయంగా కొంత పట్టు ఉంది. 2014లో కోరుట్ల సెగ్మెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన జువ్వాడి నర్సింగరావు సుమారు 46వేల ఓట్లు సాధించారు.
ఆ తరువాత కొంతకాలం నుంచి జువ్వాడి నర్సింగరావు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, జగిత్యాలలో టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్, ధర్మపురిలో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ పార్టీలో స్థిరపడిన క్రమంలో కొత్తగా పార్టీలో చేరిన జువ్వాడి నర్సింగరావుకు ఎక్కడ చోటు దక్కుతుందున్న అంశంలో పార్టీలో తర్జనభర్జనలు మొదలయ్యాయి. జువ్వాడి వర్గీయులు మాత్రం కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి సెగ్మెంట్లలో ఏదో చోట తమకు స్థానం దక్కుతుందన్న ఆశల్లో ఉన్నారు. రానున్న కాలంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జగిత్యాల డివిజన్‌లో ఏర్పాటయ్యే ఏదో ఓ కొత్త సెగ్మెంట్ నుంచి జువ్వాడి నర్సింగరావు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కార్యకర్తల్లో కలవరం..
జువ్వాడి నర్సింగరావు ఏ సెగ్మెంట్‌లో ప్రాతినిధ్యం వహించి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తారన్న అంశంలో పూర్తి స్పష్టత రాలేదు. ప్రధానంగా కోరుట్ల లేదా జగిత్యాల సెగ్మెంట్లలో తన కార్యకలాపాలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ఆయా సెగ్మెంట్లలో పార్టీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. ప్రస్తుతం కోరుట్ల, జగిత్యాల సెగ్మెంట్లలో ఉన్న పార్టీ నాయకులను అనుసరిస్తున్న టీఆర్‌ఎస్ శ్రేణులు రానున్న కాలంలో జువ్వాడి ఈ రెండు ప్రాంతాల్లో ఏదో ఓ చోట నుంచి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తే తమ పరిస్థితి ఏంటన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్ని చోట్ల పార్టీ శ్రేణుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. కొత్త చేరికల నేపథ్యంలో ఆయా సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్ పార్టీలో గ్రూపుల పోరుకు బీజం పడనుందన్న వాఖ్యనాలు వినవస్తున్నాయి.