నా హద్దులేంటో నేనే నిర్ణయించుకుంటా !
సినిమాల్లో అవకాశాలు రావడం అంత సులభం కాదు. ఒక వేళ అదృష్టం కొద్దో, ప్రతిభను చూసో,లేక సిఫారసు కారణంగానో అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోవడం కష్టసాధ్యమే.అందుకు అన్ని విధాల సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇక కథానాయికల విషయానికి వస్తే కాంపిటీషన్ ఎక్కువే. దాన్ని తట్టుకుని నిలబడాలి. అలాంటి అన్ని అర్హతలు పొందే ఈ రంగంలోకి వచ్చాను అంటున్నారు నటి సాక్షీఅగర్వాల్. ఇప్పటికే కోలీవుడ్‌లో యూగన్, తిరుట్టి వీసీడీ, ఆద్యన్, క క కా పో చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం జీవన్‌కు జంటగా జయిక్కర కుదిరై చిత్రంలో నటిస్తున్నారు.ఆ అమ్మడితో చిట్‌చాట్...
ప్ర: ప్రస్తుతం సినిమాలో మీ స్థానం ఏమిటీ?
జ: నేనీ రంగాన్ని ఇష్టపడి ఎంచుకున్నాను. ఇం జినీరింగ్, ఎంఏ పట్టభద్రురాలిని. మాది పూర్తిగా వ్యా పార కుటుంబం. నేను నటనను ఎంచుకోవడం తో వారు షాక్ అయ్యా రు. అందుకు కారణం లేకపోలేదు. నేను ఉత్తమ విద్యార్థినిని.ఏ కలెక్టరో, డాక్టరో అవతానని వారి ఆశించారు. అందుకే నేను నటినవుతానంటే నా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. నా ప్రయత్నంతోనే నటిగా ఎదుగుతున్నాను.
ప్ర: నటిగా రాణించడానికి ఎలాంటి శిక్షణ తీసుకున్నారు?
జ: ముందుగా వాణిజ్య ప్రకటనల్లో నటించాను.ర్యాంప్‌షోలు, ఫ్యాషన్ షోలు చేశాను. సినిమానే నా జీవితం అని నిర్ణయించుకున్న తరువాత అందుకు తగ్గట్టుగా మారాలని భావించాను. అమెరికా, లాస్ఏంజిల్స్ నగరంలోని ప్రముఖ సినీ శిక్షణ స్టూడియో లీ స్ట్రాస్బెర్గ్ థియేటర్లో నటనలో శిక్షణ పొందాను. అక్కడ శిక్షణ పొందిన పలువురు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారు. నాలుగు నెలలు కఠినంగా శ్రమించి మెథడ్ ఆఫ్ యాక్టింగ్ అనే టెక్నికల్ నటనను నేర్చుకున్నాను. అక్కడ శిక్షణ పొందిన తొలి దక్షిణాది నటిని నేనే.
ప్ర: మెథడ్ ఆఫ్ యాక్టింగ్ అంటే?
జ: మన జీవితాల్లో జరిగిన, ఎదురైన సంఘటనలను పాత్రల ద్వారా చూపే నటననే మెథడ్ ఆష్ యాక్టింగ్ అంటారు.
ప్ర: అక్కడ ఇంకా ఏమి నేర్చుకున్నారు?
జ : బూటీబెర్న్ అనే నటనను నేర్చుకున్నాను. ప్లాటీస్, కిక్బాక్స్ లాంటి వాటిలో కూడా శిక్షణ పొందాను. ఇవి మెథడ్ ఆఫ్ యాక్టింగ్‌కు విరుద్ధమైన శిక్షణ. ఎమోషనల్ మెమరి రీకాల్ టెక్నిక్. ఇది పూర్తిగా నటుడి మ్యాజిక్. అదే విధంగా ఛాలెంజింగ్‌తో కూడింది.
ప్ర: గ్లామర్ విషయంలో మీ హద్దులు?
జ: ఎలాంటి పాత్ర అయినా నటించడం సులభమే గానీ గ్లామర్ పాత్రలు పోషించడం కష్టతరమే. ప్రేక్షకుల్ని తన గ్లామర్‌తో ఆకట్టుకోవడం మరింత కష్టం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన గ్లామర్ నచ్చుతుంది. ఇక గ్లామర్ అన్నది కళలో ఒక భాగం అనే భావిస్తాను. గ్లామర్‌గా నటించడం అన్నది శారీరక భాష, భంగిమలు, దుస్తులు, కెమెరా కోణాలు, దర్శకుడి కల్పన లాంటి వాటిపై ఆధారపడి ఉంటుంది.ఇక గ్లామర్‌లో నా హద్దులేమిటన్నది నేనే నిర్ణయించుకుంటాను.