
మలేషియాలో నటుడు కేశవన్ మృతి
చెన్నై : యువ కథానాయకుడు 'కేశవన్' శనివారం మలేషియాలో మృతి చెందాడు. కేశవన్ 'క్కాక్కాకా' అనే తమిళ చిత్రంలో హీరోగా నటించారు. నూతన దర్శకుడు విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా ఇటీవల కుటుంబ సభ్యులతో మలేషియా వెళ్లిన కేశవన్ అక్కడ జలపాతాలను సందర్శిస్తూ ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు.
తమ కళ్లముందే కన్న కొడుకు జలపాతంలో కొట్టుకుపొవడంతో అతని తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. కేశవన్ మృతదేహాన్ని ఆదివారం వెలికి తీశారు. కేశవన్ దుర్మరణం తమిళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక టీవీ చానల్‌లో చిత్ర ప్రమోషన్‌లో కేశవన్ పాల్గొన్నాడని, ఆ ప్రోగ్రామ్‌ను తన కుటుంబ సభ్యులతో కలిసి చూడటానికి మలేషియా వెళ్లాడని చిత్ర దర్శకుడు విజయ్ తెలిపారు. క్కాక్కాకా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో చిత్ర హీరో మరణం ఎంతగానో బాధించిందని చిత్ర దర్శకుడు విజయ్ అన్నారు.