అనుమానాస్పదస్థితిలో ఇద్దరు మృతి
టేక్మాల్: అనుమానాస్పదస్థితిలో ఇద్దరు మరణించిన ఘటన టేక్మాల్ మండలం కాద్లూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానిక ఎస్ఐ మధుకుమార్ కథనం ప్రకారం... కాద్లూర్ గ్రామానికి చెందిన పోతులబొగుడ కిష్టయ్య, లచ్చమ్మ దంపతులు. వీరి రెండో కుమారుడు బీరప్ప(32). ఇతని రెండున్నరేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో వివాహమైంది. ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో ఏడాది క్రితం విడాకులు తీసుకున్నారు. బీరప్పతోపాటు అతని తల్లిదండ్రులు, సోదరుడు అంతా కలిసి హైదరాబాద్‌లోని షాపూర్లో ఉంటున్నాడు. కొంత కాలంగా అతను ఓ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఇంటికి వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులతో చెప్పిన బీరప్ప ఓ వివాహితను తీసుకొని మంగళవారం కాద్లూర్ వచ్చాడు. వచ్చిన నాటి నుంచి ఇద్దరు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. శుక్రవారం ఇంట్లో నుంచి కుళ్లిపోయిన వాసన రావడంతో సర్పంచ్ యాదయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని ఎంత నెట్టినా తలుపులు తెరుచుకోకపోవడంతో పైభాగం నుంచి ఇంట్లోకి చేరుకుని తలుపులు తీశారు. ఓ మహిళ మృతదేహం నేలపై ఉండగా బీరప్ప శవం దూలానికి వేలాడుతూ కన్పించింది. అక్కడున్న బ్యాగ్‌ను వెతికారు.
అందులో ఉన్న ఎటీఎం కార్డు, ఆధార్‌కార్డుల ద్వారా ఆ మహిళను రత్నకుమారి(38)గా గుర్తించారు. ఈమె హైదరాబాద్‌లోని షాపూర్‌కు చెందిన ఓ సినీ ఆర్టిస్ట్ తల్లిగా ధ్రువీకరించారు. మృతదేహాలు కుళ్లిపోవడంతో స్థానికంగానే పోస్టుమార్టం నిర్వహించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని జోగిపేట సీఐ నాగయ్య పరిశీలించారు. మృతుడి సోదరుడు మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుకుమార్ తెలిపారు.