ఉత్తేజం
సాక్షి, కడప : జన ఉద్యమానికి నూతన ఉత్తేజం చేకూరింది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన నిరాహార దీక్షలు సమైక్య సమరానికి ఊతమిస్తున్నాయి. శిబిరాలకు వేలాది మందిగా జనాలు తరలివచ్చి వైఎస్సార్ సీపీ పోరాటానికి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. జేఏసీ ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు దీక్ష చేపట్టిన వారిని పరామర్శించి సంఘీభావం తెలిపారు. విభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో విజయం తథ్యమన్న భరోసాను సమైక్యవాదులకు కల్పిస్తున్నారు.
కడపలో నియోజకవర్గ సమన్వయకర్త అంజాద్బాషతోపాటు వైఎస్సార్ సీపీ నేతలు చేపట్టిన దీక్షలు గురువారం సాయంత్రం ముగిశాయి. దీక్షకు పెద్ద ఎత్తున ఉద్యోగులు, పట్టణ ప్రజలు సంఘీభావం తెలిపారు.
జమ్మలమడుగులో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డిలు చేపట్టిన నిరాహార దీక్షలు రెండవరోజు కొనసాగాయి. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామా ల నుంచి ముస్లిం మైనార్టీలు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలిపారు.
రాయచోటి పట్టణంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డితోపాటు 20 మంది చేపట్టిన నిరాహార దీక్ష గురువారంతో ముగింది. ఈ దీక్షకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కర్షక, నియోజకవర్గ వ్యాప్త ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి సంఘీభావం తెలిపారు. శిబిరం వద్ద వంటా వార్పు, చెక్కభజన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
బద్వేలులో వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డితోసహా 20 మంది నిరాహార దీక్షను చేపట్టారు.
ఈ దీక్షలు గురువారం సాయంత్రంతో ముగిశాయి. దీక్షలకు మద్దతుగా కాశినాయన సొసైటీ అధ్యక్షుడు రామిరెడ్డి, వైఎస్సార్సీపీ నేతప్రభాకర్రెడ్డితోపాటు 22 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలిపారు. రాష్ట్ర విభజన జరిగితే తలెత్తే ఇబ్బందులను చిత్రపటం ద్వారా కళ్లకు కట్టినట్లు వివరించారు.
పులివెందులలో వైఎస్సార్సీపీ నేతలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త వైఎస్ అవినాష్‌రెడ్డి నేతృత్వంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట 100 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ప్రజలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. టీ.నోట్‌కు నిరసనగా 72 గంటల బంద్‌కు వైఎస్ అవినాష్‌రెడ్డి పిలుపునిచ్చారు.
కమలాపురం పట్టణంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డితోపాటు 11 మంది చేపట్టిన నిరాహార దీక్షలు గురువారంతో ముగిశాయి. వీరికి మద్దతుగా 60 మంది రిలే దీక్షలు చేపట్టారు.
రాజంపేట పట్టణంలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డితోపాటు 40 మంది చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. వీరికి మద్దతుగా నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి సంఘీభావాన్ని తెలిపారు. టీ.నోట్ వెలువడిందన్న విషయం తెలియగానే ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ బంద్‌కు పిలుపునిచ్చింది.
మైదుకూరులో వైఎస్సార్ సీపీ క్రమశిక్షణా కమిటీ సభ్యుడు రఘురామిరెడ్డి నిరాహార దీక్ష గురువారం సాయంత్రంతో ముగిసింది. ఈయన దీక్షకు మద్దతుగా దువ్వూరు, చాపాడు మండలాలకు చెందిన 50 మంది వైఎస్సార్సీపీ నేతలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. అంధులతో పాటకచేరి, కత్తిసాము విన్యాసాలు అలరించాయి.శిబిరం వద్దే వంటా వార్పు చేపట్టారు. డీసీసీబీ అధ్యక్షుడు తిరుపాల్‌రెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డితోపాటు ఐదుమండలాలకు చెందిన వైఎస్సార్ సీపీముఖ్య నేతలు, నాయకర్తలు, ప్రజలు తరలివచ్చి సంఘీభావం తెలిపారు.
ప్రొద్దుటూరులో నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో 34 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఈ దీక్షలకు పెద్ద ఎత్తున ఉద్యోగులు, ప్రజలు సంఘీభావం తెలిపారు.
రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పెనగలూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు,కొల్లం బ్రహ్మానందరెడ్డి, అజయ్‌రెడ్డితోపాటు 10 మంది నిరాహార దీక్ష కొనసాగింది. వీరికి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రజలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఆటపాటలు, డప్పు విన్యాసాలతోపాటు సమైక్య నినాదాలతో హోరెత్తించారు.