మాది త్రివేణీ సంగమం - సిరివెన్నెల
‘‘ఇలాంటి కథ, నిర్మాతలు, అన్ని సమయాల్లో దొరకరు. అందుకే ‘కహానీ’ తెలుగు రీమేక్ అవకాశం రాగానే వెంటనే ఒప్పుకున్నా. అయితే ‘కహానీ’లోలాగా ‘అనామిక’లో కథానాయికను గర్భవతిగా చూపించం. నాకిది కొత్త తరహా సినిమా. నేనెలా తీసినా కీరవాణి తన నేపథ్య సంగీతంతో ప్రేక్షకుల్ని కూర్చోబెట్టగలరని గట్టి నమ్మకం’’ అని శేఖర్ కమ్ముల చెప్పారు. ఆయన దర్శకత్వంలో వయాకామ్ 18-ఐడెంటిటీ మోషన్ పిక్చర్స్ - లాగ్‌లైన్ పిక్చర్స్ నిర్మించిన చిత్రం ‘అనామిక’. నయనతార, హర్షవర్థన్ రాణే, వైభవ్ ముఖ్యతారలుగా నటించిన ఈ సినిమా పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ‘ప్రసాద్స్’ సంస్థల అధినేత రమేశ్ ప్రసాద్ పాటల సీడీని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ -‘‘పాటలో ఈ పదాన్ని ఎందుకు వాడారని ప్రశ్నిస్తే కరెక్ట్‌గా చెప్పగలిగే సీతారామశాస్త్రిగారు మనకుండడం మన అదృష్టం. అందుకే ఆయన పాట రాసేవరకూ ఎంత కాలమైనా ఎదురు చూస్తాం’’ అని చెప్పారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మాట్లాడుతూ -‘‘నేను, శేఖర్ కమ్ముల, కీరవాణి కలిసి త్రివేణి సంగమంగా ఈ సినిమా వచ్చింది’’ అన్నారు. ఈ సినిమాకు పడినంత కష్టం ఎప్పుడూ పడలేదని యండమూరి వీరేంద్రనాథ్ చెప్పారు. శేఖర్‌తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉందని వైభవ్ తెలిపారు. ఈ వేడుకలో ఎ. కోదండరామిరెడ్డి, నరేష్ తదితరులు మాట్లాడారు.