ప్రేమ ప్రయాణం
‘‘అయిదారేళ్లుగా నాకు చెప్పుకోదగ్గ విజయాల్లేవ్. ఓడిపోతున్నానేమో అనే ఫీలింగ్. ‘ఇంకేదైనా చేసుకుంటే పోలా’ అని కూడా అనుకున్నా. కానీ కసితో చేసిన ఈ సినిమా నన్ను వెనక్కు వెళ్లనీయదని నా నమ్మకం’’ అని శివాజీ అన్నారు. రేవన్ యాదు దర్శకత్వంలో శివాజీ హీరోగా నటించిన చిత్రం ‘బూచెమ్మ బూచోడు’. కైనాజ్ మోతీవాలా కథానాయిక. రమేష్ అన్నంరెడ్డి, ప్రసాద్‌రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివాజీ మాట్లాడుతూ -‘‘నిర్మాతలు రోడ్డున పడకూడదు అనే సద్భావనతో కొన్ని విషయాల్లో రాజీ పడేవాణ్ణి. అది తప్పని ఈ మధ్యే తెలిసింది. ఈ సిని మాకు మాత్రం మంచి నిర్మాతలు దొరికారు.
ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదు. నా గత విజయాలను గుర్తు చేస్తుందీ సినిమా. చక్కని రొమాంటిక్ ఎంటర్టైనర్గా దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచాడు. వచ్చేవారం పాటల్ని, వచ్చేనెల తొలివారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఓ యువజంట ప్రేమప్రయాణమే ఈ చిత్రకథ అని, పూర్తిస్థాయి వినోదాత్మకంగా సినిమా ఉంటుందని దర్శకుడు చెప్పారు. నవరసాలూ ఉన్న సినిమా ఇదని, శివాజీ నటన, కైనాజ్ గ్లామర్, శేఖర్‌చంద్ర సంగీతం ఈ చిత్రానికి హైలైట్స్‌గా నిలుస్తాయని నిర్మాతలు తెలిపారు. ఇంకా రచయిత సాయికృష్ణ, బెక్కెం వేణుగోపాల్ మాట్లాడారు.