వైద్య పరికరాలు తయారు చేయగలం
హెల్త్‌కేర్ సమ్మిట్‌లో కాకర్ల సుబ్బారావు
సాక్షి, హైదరాబాద్: వైద్య పరికరాలను తయారు చేసే సత్తా మన వాళ్లకు ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం లేకపోవడం వల్లే 80 శాతం పరికరాలను దిగుమతి చేసుకుంటున్నామని నిమ్స్ మాజీ డెరైక్టర్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు చెప్పారు. సీటీస్కాన్, అల్ట్రాసౌండ్ వంటివి ఇప్పటికీ దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. జూలై 23 నుంచి 26 వరకు హైదరాబాద్‌లోని హోటల్ మేరిగోల్డ్, గ్రీన్ పార్క్‌లో నిర్వహించే ‘ఇండో-గ్లోబల్ హెల్త్‌కేర్ సమ్మిట్ మరియు ఎక్స్పో 2015’ వివరాలను ఇండస్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఎస్బీ అనుమోలు శనివారం ఎన్‌కేఎం హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ముఖ్యఅతిథిగా వచ్చిన డాక్టర్ కాకర్ల సుబ్బారావు మాట్లాడుతూ పరిశోధనలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని, ఐటీ రంగానికి దీటుగా ఏటా లక్ష కోట్లకు పైగా ఔషధాల వ్యాపారం జరుగుతోందంటే మందులకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతోందని చెప్పారు. ‘మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా’ వంటి కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని వైద్య పరికరాలను ఇక్కడే తయారు చేస్తే బాగుంటుందని సుబ్బారావు అభిప్రాయపడ్డారు.
అనుమోలు మాట్లాడుతూ గత ఏడాది మూడు రోజుల పాటు హెల్త్‌కేర్ సమ్మిట్, ఎక్స్పో నిర్వహించామని, అప్పుడు వచ్చిన స్పందనను స్ఫూర్తిగా తీసుకుని ఈసారి నాలుగు రోజులపాటు నిర్వహించనున్నామన్నారు. ఈ సమ్మిట్‌లో ప్రపంచ నలుమూలల నుంచి 500 మందికి పైగా వైద్యులు పాల్గొనే అవకాశం ఉందన్నారు.