కాకినాడలో టీడీపీ విజయం
- 32 స్థానాలతో కార్పొరేషన్ పీఠం దక్కించుకున్న అధికార పార్టీ
- 10 స్థానాల్లో వైఎస్సార్ సీపీ విజయం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. నగరంలో మొత్తం 50 డివిజన్లకు గాను 48 డివిజన్లకు (వివాదం కోర్టులో ఉన్నందున రెండు డివిజన్లకు ఎన్నికలు జరగలేదు) జరిగిన ఎన్నికలకు సంబంధించి శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో అధికార టీడీపీ 32 స్థానాలను కైవసం చేసుకోగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 10 చోట్ల గెలుపొందింది. బీజేపీ మూడు సీట్లు సాధించగా, ఆ పార్టీకి కేటాయించిన మూడు చోట్ల టీడీపీ రెబల్స్‌గా బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపొందారు.
కోట్ల రూపాయలు వెచ్చించి ఓటర్లను ప్రలోభపెట్టి పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడటం ద్వారా గెలుపొందాలన్న టీడీపీ వ్యూహం ఫలించింది. మద్యం, ధన ప్రభావంతో మెజార్టీ సీట్లను గెలుచుకోగలిగారు. ఒక్కో ఓటుకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు పంపిణీ చేసి ఓట్లు రాబట్టుకోవడంలో టీడీపీ నేతలు సఫలమయ్యారు. కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)కు ఓటర్లు షాక్ ఇచ్చారు. 22వ డివిజన్లో పోటీ చేసిన ఆయన సోదరుడి కుమారుడు వనమాడి శివప్రసాద్‌ను ఓడించారు. సమీప ప్రత్యర్థి వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం.జి.కిశోర్ చేతిలో ఓటమి పాలయ్యారు.