kaleswara temple
-
ప్రాణహిత పుష్కర సంబరం
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి, మంచిర్యాల: ప్రాణహిత పుష్కరాలకు నదీతీరం, త్రివేణి సంగమం సంసిద్ధమైంది. నదులకు 12 ఏళ్లకోసారి నిర్వహించే పుష్కరాల్లో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల గుండా ప్రవహించే ప్రాణహిత నదికి బుధవారం నుంచి పుష్కరాలు నిర్వహిస్తున్నారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని (సరస్వతి) నదులు కలిసే త్రివేణి సంగమ స్థానం కాళేశ్వరానికి భక్తులు పోటెత్తనున్నారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో నిర్వహించే ఈ పుష్కరాలకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఘాట్లను ఏర్పాటు చేశాయి. ఈనెల 24 వరకు జరిగే ఈ పుష్కరాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి మండల కేంద్రం, మహారాష్ట్ర వైపు సిరోంచ, నగు రంలో ఈ ఘాట్లు ఉన్నాయి. బుధవారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అర్జునగుట్ట వద్ద పుష్కరాలను ప్రారంభించనున్నారు. అన్ని పుష్కరఘాట్ల వద్ద విధుల నిర్వహణ కోసం సుమారు ఆరువేల మంది పోలీసులు, ఇతర శా ఖల సిబ్బంది పనిచేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రాణహిత జననం, పయనం: గోదావరి నదికి అతి పెద్ద ఉపనది ప్రాణహిత. పెన్‌గంగా, వార్దా నదిలో తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత పురుడు పోసుకుంది. ఈ నది తుమ్మిడిహెట్టి నుంచి 113 కి.మీ. ప్రవహిస్తుంది. బెజ్జూర్ మండలం గూడెం, సోమిని, తలాయి, వేమనపల్లి మండలం రావులపల్లి, వేమనపల్లి, కలలపేట, ముల్కల్లపేట, రాచర్ల, వెంచపల్లి, కోటపల్లి మండలం జనగామ, నందరాంపల్లి, పుల్లగామ, సిర్సా, అన్నారం, అర్జునగుట్ట గ్రామాల మీదుగా పయనిస్తుంది. మహారాష్ట్ర వైపు గడ్చిరోలి జిల్లాలోని చప్రాల నుంచి ప్రారంభమై అయిరి, ఇందారం, తోగుల వెంకటాపూర్ మీదుగా ప్రవహిస్తూ రేగుంట, కొత్తూర్, తేకడా, గిలాస్పేట, రాయిపేట, రంగాయపల్లి, హమురాజీ, సిరోంచ మీదుగా భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం (కాళేశ్వర ముక్తేశ్వరులుగా వెలిసిన పరమేశ్వరుడి పుణ్యక్షేత్రం) వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. పుష్కర ఘాట్లు ఇవే.. ►కాళేశ్వరం త్రివేణి సంగమం – జయశంకర్ భూపాలపల్లి జిల్లా ►తుమ్మిడిహెట్టి– కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ►అర్జునగుట్ట–మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ►వేమనపల్లి – మంచిర్యాల జిల్లా మండల కేంద్రం ►సిరోంచ, నగురం – మహారాష్ట్ర ఇలా చేరుకోవచ్చు.. ►కాళేశ్వరం: హైదరాబాద్ నుంచి కాజీపేట, వరంగల్ వరకు రోడ్డు, రైలు మార్గాలు ఉన్నా యి. వరంగల్ నుంచి రోడ్డుమార్గన భూపా లపల్లి మీదుగా కాళేశ్వరం చేరుకోవచ్చు. ►అర్జునగుట్ట: హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నుంచి మంచిర్యాల వరకు రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి. అక్కడి నుంచి చెన్నూరు మీదుగా అర్జునగుట్ట ఘాట్‌కు చేరుకోవచ్చు. ►తుమ్మిడిహెట్టి: కుమురంభీం జిల్లా కౌటాల మండలం తుమ్మిడి హెట్టి ఘాట్‌కు వెళ్లాలంటే హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నుంచి మంచిర్యాల మీదుగా రైళ్లు కాగజ్‌నగర్ వరకు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సిర్పూర్ టీ మీదుగా తుమ్మిడిహెట్టికి చేరుకోవచ్చు. ►వేమనపల్లి: నిజామాబాద్, కామారెడ్డి, జిల్లాల నుంచి జగిత్యాల మీదుగా మంచిర్యాల చేరుకుని అక్కడి నుంచి వేమనçపల్లికి వెళ్లవచ్చు. -
కాళేశ్వరంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం కాళేశ్వరం చేరుకున్న కేసీఆర్‌కు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కేసీఆర్ దంపతులకు ఆశీర్వచనం అందజేసి శేషవస్త్రం కప్పి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం కేసీఆర్ తిరిగి కన్నెపల్లికి చేరుకుని అక్కడినుంచి హెలికాప్టర్లో మేడిగడ్డ బ్యారేజీకి వెళ్తారు. మధ్యాహ్నం 1.30 వరకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పనుల పరిశీలన, ప్రగతిపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తారు. అక్కడినుంచి రామగుండంలో మధ్యాహ్న భోజనం, విరామం తర్వాత హైదరాబాద్‌కు బయలుదేరతారు. కాగా, శనివారం రోజున పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తెలంగాణ విద్యుత్ కర్మాగారాన్ని పరిశీలించిన కేసీఆర్ రాత్రి అక్కడే బస చేశారు. ఈ రోజు ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో కన్నెపల్లి చేరుకున్న కేసీఆర్ అక్కడి నుంచి కాళేశ్వరానికి వచ్చారు. -
పట్టు చీర చిక్కేదెలా ?
కాళేశ్వరం భూపాలపల్లి జిల్లా : స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్ర«శేఖర్‌రావు దంపతులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరాలయంలోని శుభానందదేవి(పార్వతీ) అమ్మవారికి సమర్పించిన పట్టుచీర మాయమైన ఘటనపై విచారణ నత్తనడకన సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2016, మే 2న సీఎం కేసీఆర్, శోభ దంపతులు కాళేశ్వరాలయంలో శుభానందదేవి అమ్మవారికి రూ.36 లక్షలతో బంగారు కిరీటం బహూకరించి, పట్టు చీరను సమర్పించి మొక్కులు చెల్లించిన విషయం తెలిసిందే. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుకు అదే రోజున భూమిపూజ చేశారు. అయితే ఆ చీర కొన్నాళ్లుగా కనిపించడం లేదు. విషయం బయటకి పొక్కడంతో సిబ్బంది చీరను మార్చి మోసం చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. నాలుగు రోజులైనా.. సీఎం కేసీఆర్ అమ్మవారికి సమర్పించిన చీర మా యమైన విషయం నాలుగు రోజుల క్రితం వెలుగు చూసినా అధికారుల్లో చలనం రావడం లేదు. కేవలం ఆలయ ఉపప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తికి ఈఓ మారుతి మెమో జారీ చేసి చేతులు దులిపేసుకున్నారు. గతంలో కాళేశ్వరాలయంలో ఈఓలుగా పనిచేసిన ఇద్దరికి కూడా తమ వివరణ ఇవ్వాలని ఎండోమెంట్ ఉన్నతస్థాయి అధికారులు మెమోలు జారీ చేస్తున్నట్లు తెలిసింది. పోలీసులకు ఫిర్యాదే లేదు.. చీర మాయం విషయమై సంబంధిత ఈఓ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. పోలీ సులు మాత్రం ప్రాథమికంగా విచారణ జరిపారు. సంబంధిత ఈఓ చీర మాయంపై ఫిర్యాదు చేస్తే విచారణలో వేగం పెంచి చీర చిక్కును ఛేదిస్తామని సీఐ రంజిత్ పేర్కొంటున్నారు. అర్చకుడికి మెమో జారీ.. పట్టు చీర మాయంపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆలయ ఉపప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తికి ఈఓ మారుతి మెమో జారీ చేశారు. గతంలో కాళేశ్వరాలయంలో ఈఓలుగా పనిచేసిన ఇద్దరికి తమ వివరణ ఇవ్వాలని ఎండోమెంట్ ఉన్నతస్థాయి అధికారులు మెమోలు జారీ చేసినట్లు తెలిసింది. చీరమార్చి మోసం! సీఎం సమర్పించిన చీర మాయమైందని బయటకి పొక్కడంతో మరో ఇద్దరు అర్చకులు, ఓ ఉద్యోగి కలసి మరో చీరను వరంగల్ బట్టల దుకాణంలో కొనుగోలు చేసి ఆలయ చైర్మన్, ఈఓల ముందు ఉంచారు. ఆ చీర సీఎం సమర్పించిన చీర కాదని మరో వర్గం ఆరోపించడంతో కథ అడ్డం తిరిగింది. దీంతో ఈవ్యవహరమంతా బట్టబయలైంది. భద్రతపై అనుమానాలు... ఆలయంలో సీఎం ఇచ్చిన చీరకు భద్రత లేనప్పుడు బంగారు నగలు, వెండి ఆభరణాలకు ఎలాంటి భద్రత ఉందో అర్థమవుతుంది. ప్రతే ఏటా కాళేశ్వరాలయంలో వీవీఐపీలు విలువైన పట్టు చీరలు అమ్మవారికి బహూకరిస్తారు. ఆ చీరలు కూడా ఆలయంలో కనిపించడం లేదని తెలుస్తోంది. వాటికి సంబంధించిన రికార్డులను కూడా అధికారులు రాయడం లేదు. ఆ విలువైన చీరలు అధికారుల ఇళ్లకు తరలిపోతున్నట్లు బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం సీసీ కెమెరాలు కూడా నాణ్యత లేవని అర్థమవుతోంది. 2 మెగా పిక్సల్ కెమెరాలను ఆలయంలో అమర్చినట్లు తెలిసింది. నాకు అధికారికంగా ఆదేశాలు రాలేదు... కాళేశ్వరాలయంలో చీరం మాయంపై విచారణాధికారిగా నన్ను నియమించలేదు. కలెక్టర్ మౌఖికంగా చెప్పారు. అధికారికరంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఆదేశాలు ఇస్తే విచారణ ప్రారంభిస్తా. – మోహన్‌లాల్, డీఆర్ఓ, భూపాలపల్లి చీర మాయంపై ఫైలు అందింది.. కాళేశ్వరాలయంలో సీఎం అందజేసిన చీర మాయంపై సంబంధించిన ఫైలు పరిశీలిస్తున్నాం. త్వరలో చర్యలు తీసుకుంటాం. – కృష్ణవేణి, ఎండోమెంట్, విజిలెన్స్ అధికారి -
కాళేశ్వర క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
కాళేశ్వరం: శని త్రయోదశిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలో సుప్రసిద్ధ కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయానికి శనివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలోని శనీశ్వరుడికి పూజలు నిర్వహించారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాల, సర్ప దోష నివారణకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 20 వేల మంది భక్తులు తరలివచ్చినట్టు అంచనా. -
కాళేశ్వరున్ని దర్శించుకున్న డిప్యూటి స్పీకర్
కరీంనగర్ (మహదేవపూరం): త్రివేణి సంగమ క్షేత్రంలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని డిప్యూటిస్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి సందర్శించారు. సోమవారం కరీంనగర్ జిల్లా మహదేవపురం మండలం కాళేశ్వరం చేరుకున్న డిప్యూటి స్పీకర్ కుటుంబసభ్యులతో సహా పూజలు నిర్వహించారు.