టాటా స్టీల్ కళింగ నగర్ ప్లాంట్ ప్రారంభం
కళింగనగర్: టాటా స్టీల్ కంపెనీ ఏర్పాటు చేస్తోన్న కళింగ నగర్ స్టీల్ ప్లాంట్ ఒడిషా పారిశ్రామికీకరణకు ఇతోధికంగా తోడ్పాటునందిస్తుందని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. టాటా స్టీల్ కంపెనీ ఏర్పాటు చేస్తోన్న ఇక్కడి ఉక్కు ప్లాంట్‌లో మొదటి దశను జాతికి అంకితం చేసిన సందర్బంలో ఆయన మాట్లాడారు. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో టాటా స్టీల్ కంపెనీ 6 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల ఈ ప్లాంట్‌ను రూ.25,000 కోట్ల పెట్టుబడులతో రెండు దశల్లో ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ ఏర్పాటును ఇక్కడి ప్రజలు వ్యతిరేకిస్తుండటంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య నవీన్ పట్నాయక్ మొదటి దశను ప్రారంభించారు. రూ లక్ష కోట్ల పెట్టుబడులతో ఈ ప్లాంట్‌ను 16 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్‌గా విస్తరించాలని యాజమాన్యం యోచి స్తోందని పట్నాయక్ పేర్కొన్నారు. ఒడిశా అభివృద్ది యాత్రలో ఈ కళింగ నగర్ ప్లాంట్ మరో మజిలి అని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ చెప్పారు. వాటాదారులకు, సమాజానికి కట్టుబడి ఉందనడానికి, టాటా స్టీల్ అంకితభావానికి ఈ కళింగ నగర్ ప్లాంట్ ఒక ప్రతీక అని టాటా స్టీల్ ఎండీ టి. వి. నరేంద్రన్ చెప్పారు. ఈ స్టీల్ ప్లాంట్ దేశంలోనే రెండో అతి పెద్ద ప్లాంట్ అని ఆయన పేర్కొన్నారు. కాగా ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్, సింటర్ ప్లాంట్లకు ఒడిశా స్టేట్ పొల్యుషన్ బోర్డ్ అనుమతులు రావాల్సి ఉంది. దీంతో ఉత్పత్తి కార్యక్రమాలు 2-3 నెలల తర్వాతనే ప్రారంభమవుతాయని అంచనా.