ఆర్చరీ ఆణిముత్యాలు
అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న జిల్లా క్రీడాకారులు
విలువిద్యలో ఆరితేరుతున్న యువ కెరటాలు
2008 ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారిణి ప్రణీత
కల్లెడ ఆర్డీఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ
పుట్టింది మారుమూల పల్లెల్లో అయినా.. వారు అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతున్నారు. సమాజంలో గుర్తింపు పొందేందుకు చదువే ముఖ్యం కాదని.. ఆటలతో కూడా తమ ప్రతిభను నిరూపించుకోవచ్చనే లక్ష్యంతో పయనిస్తున్నారు. ఈ మేరకు విదేశాల్లో ప్రాచుర్యం పొందిన విలువిద్య(ఆర్చరీ)లో శిక్షణ పొందుతూ అందులో తమదైన శైలిలో రాణిస్తున్నారు. ఆర్చరీ ఆటలో ఓరుగల్లు కీర్తిని ఖండతరాలు దాటిస్తూ వెలుగొందుతున్న యువ క్రీడాకారులపై ప్రత్యేక కథనం.
పర్వతగిరి : ఒకప్పుడు పక్షులు, జంతువులను వేటాడేందుకు ఉపయోగించిన విలువిద్య(ఆర్చరీ)ను సాధనంగా కాకుండా దానికి కళాత్మక నైపుణ్యాన్ని చేకూర్చి నేటి తరానికి అందజేస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్చరీ క్రీడకు జాతీయ, అంతర్జాతీయస్థాయి గుర్తింపు కల్పించడంతోపాటు ఏకంగా ఒలంపిక్స్ క్రీడల్లో కూడా చేర్చారు. దీంతో విలువిద్యను నేర్చుకునేందుకు చాలామంది విద్యార్థులు, యువకులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో రామాయణం, మహాభారతం లాంటి కథలకే పరిమితమైన ఈ ఆటను భారతదేశంలో తొలిసారిగా 1957లో కోల్‌కతాలో ప్రారంభించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆదరణ లభించని ఆటను 1970లో మరోసారి కోల్‌కతా, ఢిల్లీలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో అప్పటి నుంచి ఆర్చరీకి ప్రాధాన్యత పెరిగిందని పలువురు సీనియర్ క్రీడాకారులు చెబుతున్నారు.
వేమునూరి శారద
పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన వేమునూరి శారద 2006 నుంచి కల్లెడ ఆర్డీఎఫ్లో ఆర్చరీలో శిక్షణ పొందింది. 2008లో అమెరికాలో జరిగిన ప్రపంచస్థాయి సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొని సత్తాచాటింది. అలాగే 2013లో చైనాలో జరిగిన జూనియర్ పోటీల్లో పాల్గొంది. ప్రస్తుతం ఇండియన్ టిబెటియన్ బార్డర్ పోలీస్‌గా విధులు నిర్వహిస్తో్తంది.
నోముల లావణ్య
మండలంలోని రావూరు గ్రామానికి చెందిన నోముల లావణ్య 2006లో కల్లెడ ఆర్డీఎఫ్లో శిక్షణ పొందింది. అలాగే 2011లో ఆమె స్పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో శిక్షణ పొందింది. సీనియర్ విభాగంలో 2012లో చైనా వరల్డ్ కప్ పోటీలకు హాజరైంది. 2014లో జూనియర్ విభాగంలో పాల్గొంది. ప్రస్తుతం ఆమె సాయ్‌లో శిక్షణ పొందుతోంది.
ఆదొండ రాజు
మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన ఆదొండ రాజు 2003 నుంచి కల్లెడ ఆర్టీఎఫ్లో శిక్షణ పొందుతున్నాడు. మెక్సికోలో 2006లో జరిగిన సబ్‌జూనియర్ వరల్డ్ కప్ ఆర్చరీ పోటీల్లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. అలాగే చైనాలో 2007లో జరిగిన ఏషియన్ చాంపియన్‌షిప్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించాడు. తర్వాత ఇరాన్ దేశంలో జరిగిన ఏషియన్ గ్రాండ్ ఫిక్స్ పోటీల్లో భారత జట్టు తరపున పాల్గొని బంగారు పతకం సాధించాడు. వీటితోపాటు పలు ప్రపంచ స్థాయి పోటీల్లో పతకాలు సాధించాడు. ప్రస్తుతం రైల్వేలో సీనియర్ క్లర్క్‌గా పనిచేస్తున్నాడు.
ముద్దరబోయిన రంజిత్ కుమార్
మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన ముద్దరబోయిన రంజిత్‌కుమార్ 2006లో కల్లెడలో శిక్షణ పొందాడు. సౌత్ కొరియా 2014లో జరిగిన ప్రపంచ యూనివర్సిటీ ఆర్చరీ పోటీల్లో పాల్గొన్నాడు. ప్రస్తుతం టాటా స్పోర్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.
సుంకరి లావణ్య
మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన సుంకరి లావణ్య 2008 నుంచి 2010 వరకు కల్లెడ ఆర్డీఎఫ్లో శిక్షణ పొందింది. అనంతరం సౌత్ కొరియాలో 2013లో జరిగిన ప్రపంచ స్థాయి సబ్ జూనియర్ ఆర్చరీ పోటీల్లో భారతజట్టు తరపున పాల్గొంది. ప్రస్తుతం ఆమె హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది.
జాతీయ స్థాయిలో మరికొందరు
కల్లెడ రూరల్ ఫౌండేషన్ (ఆర్డీఎఫ్) కేంద్రంలో ఆర్చరీలో శిక్షణ పొందుతున్న పలువురు విద్యార్థులు జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. ఇందులో మండలంలోని గుగులోత్ నీలా, రిక్కిసింగ్, చిరుత అనిత, ప్రసన్న వాణి, గుగులోత్ ప్రణీత, పెనుబల్లి లక్ష్మణ్‌రావు, అన్నమనేని పూర్ణరాజేష్, బురికి రాజు, తస్సీ, బండారి అంజలి, చెల్లోజు అపూర్వ, గుగులోత్ చందులాల్, ఆదొండ విష్ణు, ఎన్నమనేని అరుణ్, బానోత్ నరేష్, ప్రసన్న కుమార్, ఇస్లావత్ రాజు, మద్దెల విద్యారాణి, వేమునూరి సాయికుమార్ , బైరి విష్ణు పలు బంగారు, రజత పతకాలు సాధించి జిల్లాకు వన్నె తెచ్చారు.
శిక్షణ కేంద్రంగా కల్లెడ ఆర్డీఎఫ్
సాధారణంగా చాలామంది విద్యార్థులు పాఠశాల స్థాయిలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బాల్ బ్యాడ్మింటన్ లాంటి ఆటలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే విదేశాలతోపాటు పేరొందిన నగరాలకే పరిమితమైన ఆర్చరీ క్రీడలో గ్రామీణ ప్రాంత విద్యార్థులను కూడా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన ఎర్రబెల్లి రామ్మో హన్‌రావు తాను స్థాపించిన కల్లెడ రూరల్ ఫౌండేషన్(ఆర్డీఎఫ్) ఆధ్వర్యంలో 2003 నుంచి పాఠశాల, కళాశాల విద్యార్థుల కోసం ఆర్చరీ శిక్షణ కేంద్రాన్ని ప్రత్యేకంగా కల్లెడలో ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆర్చరీ అసోషియేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో 2003లో పశ్చిమ బెంగాల్ కోచ్ ప్రబీర్‌దాస్ పర్యవేక్షణలో అనేక మంది విద్యార్థులకు శిక్షణ ఇప్పించారు. కాగా, ఆర్డీఎఫ్ కేంద్రంలో శిక్షణ పొందిన యువ క్రీడాకారిణి వర్ధినేని ప్రణీత 2008లో బీజింగ్‌లో జరిగిన ఒలింపిక్స్‌కు భారతజట్టు తరపున హాజరైంది.
నైపుణ్యాన్ని వెలికితీయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిభ కలిగిన ఆర్చరీ క్రీడాకారులను గుర్తించి వారి నైపుణ్యాన్ని వెలికితీయాలి. అలాగే క్రీడాకారులకు స్పోర్ట్స్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలి. జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్ది ప్రపంచ స్థాయిలో ఆర్చరీలో ఇండియాకు గుర్తింపు తీసుకురావాలి. తమ ఆర్డీఎఫ్ ఆధ్వర్యంలో తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో 1 నుంచి ఇంటర్ వరకు తరగతులు నిర్వహిస్తున్నాం. అలాగే ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఆర్చరీలో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నాం.
– ఎర్రబెల్లి రామ్మోహన్రావు, కల్లెడ రూరల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు