పీజీ ఆయుష్కు ప్రత్యేక ఎంట్రన్స్
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పీజీ ఆయుష్ కోర్సులకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. వర్సిటీ పాలకమండలి సమావేశం సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీజీ నీట్లో లేనటువంటి పీజీ ఆయుష్, నర్సింగ్, న్యూట్రిషన్, పబ్లిక్ హెల్త్ వంటి కోర్సులకు 2017–18లో అడ్మిషన్లకు ప్రత్యేకంగా వర్సిటీ ఆధ్వర్యంలోనే ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దాదాపు 500 వరకు సీట్లున్న ఈ కోర్సులకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష కోసం పాలకమండలి అనుమతి ఇచ్చింది.
వర్సిటీలో పరీక్షలన్నింటినీ డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించారు. దీనివల్ల నిష్పాక్షికంగా వ్యవహరించడానికి వీలుకలగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మెడికల్, డెంటల్, నర్సింగ్ కాలేజీలకు చెందిన దాదాపు 250 మంది ప్రిన్సిపల్స్ అందరూ అకడమిక్ సెనెట్‌లో సభ్యులుగా ఉన్నారు. అన్ని కాలేజీలకు ప్రాతినిధ్యం అన్న పద్ధతిని సవరించి కేవలం 20 మంది ప్రిన్సిపల్స్ మాత్రమే సభ్యులుగా ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులకు బోర్డ్ ఆఫ్ స్టడీస్‌ను నెలకొల్పారు. అందులో వైస్ ఛాన్స్‌లర్‌సహా పలువురు వైద్య నిపుణులు సభ్యులుగా ఉంటారు. ఈ సమావేశంలో వైస్ ఛాన్స్లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, ఆయుష్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, వైద్య విద్య మాజీ సంచాలకులు డాక్టర్ పుట్టా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.