అతనంటే పిచ్చి ప్రేమ... అందుకే ఆ పచ్చబొట్లు!
త్రిషకు పచ్చబొట్లంటే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పచ్చబొట్లు వేయించుకుంటుంది. ఇక్కడున్న ఫొటోని క్షుణ్ణంగా గమనిస్తే.. త్రిష ఎద భాగంలో ‘నీమో ఫిష్’ టాటూ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పచ్చబొట్టుని మాత్రం త్రిష చెరిపేయలేదు. ఆ విధంగా గత కొన్నేళ్లుగా ఆ చేప పిల్ల స్థానం పర్మినెంట్ అయిపోయింది. ఇప్పుడు త్రిష దేహంపై తాత్కాలిక పచ్చబొట్లు ప్రత్యక్షం అయ్యాయి. ఈసారి ఏకంగా తమిళ హీరో ‘జయం’ రవి బొమ్మను పచ్చబొట్టుగా వేయించుకుంది. ఈ బ్యూటీ చేతులు, తొడ, పొట్ట భాగాల్లో రవి దర్శనమిస్తున్నారు.
అతనిపై ప్రేమ వల్లే త్రిష ఇలా చేసింది. అయితే అది రియల్ ప్రేమ కాదు.. రీల్ ప్రేమ. ఈ ఇద్దరూ జంటగా ‘భూలోగం’ అనే చిత్రం రూపొందుతోంది. ఇందులో రవి అంటే తనకెంత ప్రేమో త్రిష వ్యక్తం చేసే సన్నివేశం ఒకటుంది. ‘చూడు.. నీ మీద ప్రేమతో నా దేహాన్ని ఎలా హింస పెట్టుకున్నానో..’ అంటూ రవికి త్రిష ఆ పచ్చబొట్లు చూపించే సీన్ అది. దర్శకుడు కల్యాణ కృష్ణన్ ఈ పచ్చబొట్లు గురించి చెప్పగానే ముందు కుదరదనేశారట త్రిష. కానీ, సినిమాలో ఆ సన్నివేశానికి గల ప్రాధాన్యతను వివరించి చెప్పడంతో ఆమె ఈ పచ్చబొట్లకు పచ్చజెండా ఊపేశారని సమాచారం. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.