మార్చి నాటికి 1,460 మెగావాట్లు సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి చివరినాటికి సాంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా 1,460 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని నెడ్‌క్యాప్ మేనేజింగ్ డెరైక్టర్ కమలాకర్‌బాబు తెలిపారు. ప్రస్తుతం 559 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి అవుతోందని చెప్పారు. జనవరి 2014 నాటికి సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 500 మెగావాట్లకు చేరుకోనుందని తెలిపారు. నెడ్‌క్యాప్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 24, 25 తేదీల్లో నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో మొత్తం 20 స్టాల్స్‌లో సౌర ఉత్పత్తులను ప్రదర్శిస్తామని తెలిపారు. ఇందులో మిద్దె మీద ఏర్పాటు చేసుకునే సోలార్ ఫలకాల (రూఫ్‌టాప్) ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం, గ్రిడ్‌కు అనుసంధానించడాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శిస్తామని చెప్పారు. రూఫ్‌టాప్ విధానంలో గ్రిడ్‌కు అమ్మే విద్యుత్‌కు సగటున రూ.3 మేర ధర చెల్లించే అవకాశం ఉందన్నారు.
అదేవిధంగా సోలార్ వ్యవసాయ పంపుసెట్ల వినియోగాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శిస్తామని తెలిపారు. సోలార్ వ్యవసాయ పంపుసెట్లకు 20 శాతం రాష్ట్రం, 30 శాతం కేంద్రం సబ్సిడీగా భరిస్తాయని చెప్పారు. రాష్ట్రంలో మొదటి దశలో ఐదు హెచ్‌పీ సామర్థ్యం కలిగిన ఐదు లక్షల సోలార్ వ్యవసాయ పంపుసెట్లను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన రూఫ్‌టాప్ సోలార్ విధానాన్ని అమర్చుకునేందుకు సగటున లక్ష నుంచి లక్షా పది వేల రూపాయల మేరకు వ్యయమవుతుందన్నారు. ఈ విధంగా 10 వేల కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ విధానం అమలు చేస్తామని, సబ్సిడీ మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో రూఫ్‌టాప్ సోలార్ విధానం అమలు చేయనున్నట్టు వివరించారు.