KAMALAMMA.P.M
-
అట్రాసిటి కేసుల్ని సత్వరం పరిష్కరించాలి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అట్రాసిటీ చట్టం కింద నమోదయ్యే కేసులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యురాలు పీఎం కమలమ్మ స్పష్టం చేశారు. ఈ కేసులో దోషులుగా తేలిన వారు కోర్టు స్టే తెచ్చుకునే లోపే కేసు పరిష్కరించాలని, ఆ మేరకు చర్యలు వే గవ ంతం చేయాలన్నారు. సోమవారం కలెక్టరేట్లో అట్రాసిటీ కేసులు, సబ్‌ప్లాన్ అమలు, భూ సమస్యలపై ఎస్సీ సంఘాలు, సంబంధిత శాఖాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అట్రాసిటీ కేసులన్నీ పీఓటీ యాక్టు కింద కేసులు నమోదు చేసి చార్జీషీటు తయారుచేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. కొందరు అట్రాసిటీ కేసులను నీరుగార్చే యత్నాలు చేస్తున్నారని, అలాంటివాటిపై ప్రత్యేక చొరవ తీసుకుని బాధితులకు నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. జిల్లాలో 134 కేసులు నమోదు కాగా.. 84 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ కేసుల పరిష్కారంపై తనకు పూర్తి నివేదిక ఇవ్వాలన్నారు. ఎస్సీ హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందించాలని, జిల్లాలో అంబేద్కర్పేరున నడుస్తున్న పాఠశాలలపై సమీక్ష నిర్వహించి తనకు నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఎన్.శ్రీధర్‌ను ఆదేశించారు. సమావేశంలో వచ్చిన వినతులపై రెండు వారాల్లో కమిషన్‌కు రిపోర్టు చేయాలన్నారు. కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో 2300 మంది ఎస్సీ లబ్ధిదారులకు రుణాలు అందించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో చేవెళ్ల శాసనసభ్యులు కాలె యాదయ్య, మాజీ మంత్రి పుష్పలీల, దళిత సంఘాల ప్రతినిధులు చెన్నయ్య, అనంతయ్య, రాములు తదితరులు జిల్లాలోని పరిస్థితిని వివరించారు. ఈ సమావేశంలో ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఓఎస్డీ సుబ్బారావు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఎస్పీ రాజకుమారి, జేసీలు చంపాలాల్, ఎంవీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వేధింపులు తాళలేక హత్య
భర్తను నరికి చంపిన భార్య రంగారెడ్డి జిల్లాలో ఘటన శంషాబాద్ రూరల్: నిత్యం నరకయాతన పెడుతున్న తాగుబోతును భార్య గొడ్డలితో నరికి చంపేసింది. శంషాబాద్ మండలం ఘాంసిమియాగూడ శివారులోని ఓ డైయిరీ ఫాంలో శుక్రవారం ఈ ఘటన శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. దోమ మండలం మోత్కూరుకు చెందిన దీమ వెంకటయ్య(37) కుల్కచర్ల మండలం బండి ఎల్కచర్లకు చెందిన తన అక్క కూతురు కమలమ్మ అలియాస్ చిన్నమ్మను పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి నవీన్, శ్రీకాంత్ కుమారులు. వెంకటయ్య మద్యానికి బానిసై నిత్యం భార్యను వేధించేవాడు. ఇదిలాఉండగా కమలమ్మ పెద్దమ్మ కొడుకు సిద్ధులు ఘాంసిమియాగూడలోని పౌల్ట్రీఫాంలో పని చేస్తున్నాడు. ఇతను నెల రోజుల క్రితం కమలమ్మ దంపతులను తాను పనిచేసే పౌల్ట్రీఫాంకు సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో పనికి కుదిర్చాడు. అయినా వెంకటయ్య ప్రవర్తనలో మార్పు రాలేదు. గురువారం రాత్రి మద్యం తాగి వచ్చి కమలమ్మతో గొడవపడగా... ఆమె తన సోదరుడు సిద్ధులుకు విషయం చెప్పి అతడిని తన ఇంటికి తీసుకొచ్చింది. గొడ్డలితో మెడ నరికి.. వెంకటయ్య మరోమారు కమలమ్మతో పాటు సిద్ధులుతో గొడవపడ్డాడు. తమనెక్కడ చంపేస్తాడోనని భయపడ్డ కమలమ్మ అక్కడే ఉన్న కారం పొడిని భర్త కళ్లల్లో చల్లింది. దీంతో వెంకటయ్య కింద పడిపోగా.. అక్కడే ఉన్న గొడ్డలి తీసుకుని మెడపై నరికి చంపింది. గొడ్డలిని గదిలో దాచిపెట్టి, దాని కట్టెను పొదల్లో పడేశారు. ఏమీ ఎరగనట్టు శుక్రవారం ఉదయం తన బావ చనిపోయాడని సిద్ధులు స్థానికులకు చెప్పాడు. శంషాబాద్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. కమలమ్మ, సిద్ధులును విచారించగా మొదట తమకేమీ తెలియదని బుకాయించారు. చివరకు నేరాన్ని అంగీకరించారు. డాగ్‌స్క్వాడ్ బృందం, ఫింగర్ ప్రింట్ నిపుణులు ఆధారాలు సేకరించారు. హత్యకు వినియోగించిన గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకొని, నిందితులను ఠాణాకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.