వేధింపులు తాళలేక హత్య | The husband and wife who cut off | Sakshi
Sakshi News home page

వేధింపులు తాళలేక హత్య

Published Sat, Nov 1 2014 12:58 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

వేధింపులు తాళలేక హత్య - Sakshi

వేధింపులు తాళలేక హత్య

  • భర్తను నరికి చంపిన భార్య
  • రంగారెడ్డి జిల్లాలో ఘటన
  • శంషాబాద్ రూరల్: నిత్యం నరకయాతన పెడుతున్న తాగుబోతును భార్య గొడ్డలితో నరికి చంపేసింది. శంషాబాద్ మండలం ఘాంసిమియాగూడ శివారులోని ఓ డైయిరీ ఫాంలో శుక్రవారం ఈ ఘటన శుక్రవారం జరిగింది.  పోలీసుల కథనం ప్రకారం.. దోమ మండలం మోత్కూరుకు చెందిన దీమ వెంకటయ్య(37) కుల్కచర్ల మండలం బండి ఎల్కచర్లకు చెందిన తన అక్క కూతురు కమలమ్మ అలియాస్ చిన్నమ్మను పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి నవీన్, శ్రీకాంత్ కుమారులు. వెంకటయ్య మద్యానికి బానిసై నిత్యం భార్యను వేధించేవాడు.

    ఇదిలాఉండగా కమలమ్మ పెద్దమ్మ కొడుకు సిద్ధులు ఘాంసిమియాగూడలోని పౌల్ట్రీఫాంలో పని చేస్తున్నాడు. ఇతను నెల రోజుల క్రితం కమలమ్మ దంపతులను తాను పనిచేసే పౌల్ట్రీఫాంకు సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో పనికి కుదిర్చాడు. అయినా వెంకటయ్య ప్రవర్తనలో మార్పు రాలేదు. గురువారం రాత్రి మద్యం తాగి వచ్చి కమలమ్మతో గొడవపడగా... ఆమె తన సోదరుడు సిద్ధులుకు విషయం చెప్పి అతడిని తన ఇంటికి తీసుకొచ్చింది.  
     
    గొడ్డలితో మెడ నరికి..

    వెంకటయ్య మరోమారు కమలమ్మతో పాటు సిద్ధులుతో గొడవపడ్డాడు. తమనెక్కడ చంపేస్తాడోనని భయపడ్డ కమలమ్మ అక్కడే ఉన్న కారం పొడిని భర్త కళ్లల్లో  చల్లింది. దీంతో వెంకటయ్య కింద పడిపోగా.. అక్కడే ఉన్న గొడ్డలి తీసుకుని మెడపై నరికి చంపింది. గొడ్డలిని గదిలో దాచిపెట్టి, దాని కట్టెను పొదల్లో పడేశారు.  ఏమీ ఎరగనట్టు శుక్రవారం ఉదయం తన బావ చనిపోయాడని సిద్ధులు స్థానికులకు చెప్పాడు.

    శంషాబాద్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు.  కమలమ్మ, సిద్ధులును విచారించగా మొదట తమకేమీ తెలియదని బుకాయించారు. చివరకు నేరాన్ని అంగీకరించారు. డాగ్‌స్క్వాడ్ బృందం, ఫింగర్ ప్రింట్ నిపుణులు ఆధారాలు సేకరించారు. హత్యకు వినియోగించిన గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకొని,   నిందితులను ఠాణాకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement