కృష్ణమూర్తి పుర్రె, ఎముకలు
బూర్గంపాడు : ‘తాగినోడి నోట నిజం.. తన్నుకుని వస్తాదయ్యా..’ – అన్నాడో కవి.. ఏనాడో! ఇది నిజమేనని నిరూపితమైంది. మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుందా..? చదవండి మరి...
- సారపాక పంచాయతీలోని శ్రీరాంపురం కాలనీకి చెందిన శ్యామల కృష్ణమూర్తి(35) అవివాహితుడు. అతనికి తల్లిదండ్రులు కూడా లేరు. అతను బోర్ మిషన్ వెంబడి కూలీ పనులకు వెళ్తుండేవాడు. ఎక్కడ బోరు పనులు ఉంటే అక్కడే నెలలతరబడి ఉండేవాడు. పనులు పూర్తయిన తరువాత ఇంటికి వచ్చేవాడు.
- అదే గ్రామానికి చెందిన కొర్సా రమేష్ అలియాస్ రామయ్యకు మూడువేల రూపాయలను కృష్ణమూర్తి అప్పుగా ఇచ్చాడు. డబ్బు ఇవ్వాలని ఎంత అడిగినా రమేష్ ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.
- మూడు నెలల కిందట (డిసెంబర్‌లో) డబ్బులు ఇవ్వాలని కృష్ణమూర్తి నిలదీశాడు. అప్పుడు రమేష్ మద్యం మత్తులో ఉన్నాడు. డబ్బులు ఇస్తానంటూ కృష్ణమూర్తిని శ్రీరాంపురం సమీపంలోగల అటవీప్రాంతానికి తీసుకెళ్లి చంపేశాడు.
- బోరు పనులకు కృష్ణమూర్తి వెళ్లుంటాడని గ్రామస్తులు, బంధువులు అనుకున్నారు.
- రమేష్‌కు వెట్టి ముత్తయ్య అనే వ్యక్తి కూడా అప్పు ఇచ్చాడు. తన అప్పు తీర్చాలంటూ రమేష్‌ను అతడు వారం కిందట గట్టిగా అడిగాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రమేష్.. ‘‘అరే.. నన్ను డబ్బులు అడిగితే, కృష్ణమూర్తికి పట్టిన గతే నీకూ పడుతుంది’’ అని బెదిరించాడు. ముత్తయ్యకు అర్థమవలేదు. కృష్ణమూర్తికి ఏదో హాని జరిగిందని మాత్రం గ్రహించాడు. ఈ విషయాన్ని పోలీసులతో చెప్పాడు.
- రమేష్‌ను ఎస్‌ఐ సంతోష్ అదుపులోకి తీసుకుని విచారించారు. కృష్ణమూర్తిని తానే చంపినట్టుగా రమేష్ చెప్పాడు. చంపి పడేసిన ప్రదేశానికి తీసుకెళ్లి చూపించాడు. కృష్ణమూర్తి మృతదేహం పూర్తిగా కుళ్లి పోయింది. కేవలం పుర్రె, ఎముకలు మాత్రమే మిగిలాయి. ఆ స్థలాన్ని పాల్వంచ డీఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు.
- కృష్ణమూర్తి సోదరుడు గంగయ్య ఫిర్యాదుతో కేసును ఎస్‌ఐ సంతోష్ దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment