మొగుడు.. యముడు..! | husband murdered his wife in khammam district | Sakshi
Sakshi News home page

మొగుడు.. యముడు..!

Published Sat, Jan 6 2018 8:23 AM | Last Updated on Tue, Aug 21 2018 6:02 PM

husband murdered his wife in khammam district - Sakshi

సాక్షి, ఇల్లెందు: ఇల్లెందులో దారుణం జరిగింది. వివాహితను ఆమె భర్తే కిడ్నాప్‌ చేసి, చంపేశాడు. రాత్రి వేళ అందరూ చూస్తుండగా మహిళను కిడ్నాప్‌ చేయడం, కిడ్నాపర్‌ ఆమె భర్తే కావడం, మరుసటి రోజున ఉదయం ఆమె మృతదేహం కనిపించడం.. ఇవన్నీ, ఇల్లెందు పట్టణంలో కలకలాన్ని, భయోత్పాతాన్ని సృష్టించాయి. 

అసలేం జరిగింది..? 
ఆమె పేరు బండారు పద్మ, భర్త పేరు బండారు ప్రభాకర్‌. ఖమ్మంలోని జిల్లాపరిషత్‌ కార్యాలయంలో ఆమె ఉద్యోగిని. రోజూ ఖమ్మం వెళ్లి వస్తోంది. ఈ దంపతుల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే, ఆమె తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇల్లెందులోని కాకతీయ నగర్‌లోగల పుట్టింటిలో ఉంటోంది. గురువారం రాత్రి 7.00 గంటల సమయంలో ఖమ్మం బస్సులో వచ్చింది. ఇల్లెందులోని జగదాంబ సెంటర్‌లో దిగింది. కాకతీయ నగర్‌లోని తల్లి గారింటికి నడుచుకుంటూ వెళుతోంది. ఆమెను ఆటోలో ప్రభాకర్‌ వెంబడించాడు. అదే దారిలోగల కొలిమికొట్టం వద్ద ఆమెను ఆటోలోకి లాగేశాడు. ఆమె గట్టిగా కేకలు వేయడాన్ని, ఇందిరానగర్‌ వైపు ఆటో దూసుకెళ్లడాన్ని, ఆమె కాలికి ఉన్న కట్‌ షూ పడిపోవడాన్ని అక్కడున్న కొందరు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. 

రాత్రంతా పోలీసుల గాలింపు 
ఇల్లెందు ఎస్సై కొమురెల్లి, పోలీసులు వేగంగా స్పందించారు. అన్నివైపులా విస్తృతంగా గాలించారు. ఆటో సమాచారం కోసం అడ్డాల్లో ఆరా తీశారు. వివరాలు తెలియలేదు. ఆమె పేరు పద్మ అని, భర్త పేరు ప్రభాకర్‌ అని, వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఆమెను అతడే కిడ్నాప్‌ చేశాడని.. ఇలా అన్ని వివరాలను వెంటనే సేకరించగలిగారు. ఆమెకు అతడు ప్రాణ హాని తలపెట్టే ప్రమాదముందని పసిగట్టారు. ఆమెను రక్షించేందుకు, కిడ్నాపర్‌ను పట్టుకునేందుకు రాత్రంతా ఇల్లెందు చుట్టుపక్కల అణువణువునా విస్తృతంగా గాలించారు. 

నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహం 
పోలీసులు పసిగట్టినట్టే జరిగింది. ఆమెను వాడు చంపేశాడు. ఇల్లెందు–ఖమ్మం సరిహద్దుల్లో రోడ్డు పక్కన ఐటీఐ ఉంది. దాని పక్క నుంచి మొట్లగూడెం వైపు రోడ్డులో కొంత దూరం వెళ్లాక, ఎడమ వైపున దాదాపు వంద మీటర్ల దూరంలోగల నిర్మానుష్య ప్రదేశంలో పద్మ మృతదేహాన్ని పోలీసులు గురువారం ఉదయం గమనించారు. ఆ ప్రదేశాన్ని, మృతదేహాన్ని టేకులపల్లి సీఐ దోమల రమేష్, ఇల్లెందు ఎస్సై కొమురెల్లితో కలిసి డీఎస్పీ జి.ప్రకాశరావు పరిశీలించారు. అక్కడ విలేకరులతో ఆయన ఇలా చెప్పారు. ‘‘పద్మ, ప్రభాకర్‌ మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఆమె తన పుట్టింటిలో ఉంటోంది. ఆమెపై అతడు కక్ష పెంచుకున్నాడు. మరో ఇద్దరితో కలిసి ఆమెను కిడ్నాప్‌ చేసి ఆటోలో తీసుకెళ్లాడు. ఆమె గట్టిగా కేకలు వేస్తుండడంతో ఆటోలోనే చున్నీతో మెడకు ఉరి బిగించి చంపి, ఇక్కడకు తీసుకొచ్చి పడేసి ఉంటారని భావిస్తున్నాం. నిందితులు పరారీలో ఉన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటాం’’.   

ప్రేమ – పెళ్లి – హత్య 
 ఇల్లెందులోని కాకతీయ నగర్‌కు చెందిన పులిగండ్ల మల్లయ్య–పోషమ్మ దంపతుల కుమార్తె పద్మ. ప్రభుత్వ పాఠశాలలో ఆఫీస్‌ సబార్డినేట్‌(అటెండర్‌)గా పనిచేస్తున్న మల్లయ్య, అనారోగ్యంతో మృతిచెందటంతో ఆయన ఉద్యోగం కూతురు పద్మకు ప్రభుత్వ ఉద్యోగం (టేకులపల్లిలో పోస్టింగ్‌) వచ్చింది. రోజూ ఇల్లెందు నుంచి టేకులపల్లికి ఆటోలో వెళ్లి వస్తుండేది. 
 ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్‌ బండారు ప్రభాకర్‌తో ఏర్పడిన పరిచయం స్నేహంగా, ప్రేమగా మారింది. 12 ఏళ్ల క్రితం వీరికి ఇరు కుటుంబాల పెద్దలు వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు (జయేంద్ర, రిషిక) ఉన్నారు. కొన్నాళ్లకు టేకులపల్లి నుంచి ఖమ్మం జిల్లా పరిషత్‌ కార్యాలయానికి ఆమె బదిలీ అయింది. 
 
‘‘భార్య పద్మ సంపాదనతో అతడు ఖమ్మంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి దిగాడు. ఒక అపార్ట్‌మెంట్, రెండు కార్లు కొన్నాడు. ఖమ్మంలోని ఓ మహిళతో అతడికి దాదాపుగా ఆరు నెలల కిందట వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి అతడు తన భార్యను అనుమానిస్తూ, తరచుగా హింసించసాగాడు. ఆమె తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. పెద్దలు కూడా పంచాయతీలు చేశారు. ఎవరెన్ని చెప్పినా, ఏం చేసినా ప్రభాకర్‌ మారలేదు. పద్మ తట్టుకోలేకపోయింది. అతడికి దూరంగా, ఇద్దరు పిల్లలతో కలిసి రెండు నెలల నుంచి తన పుట్టింటిలో ఉంటోంది. ఇక్కడి నుంచే ఖమ్మం రాకపోకలు సాగిస్తోంది. దీంతో భార్యపై కక్షగట్టాడు. తనతోపాటు ఉండకపోతే చంపేస్తానని బెదిరించాడు. అన్నంత పని చేశాడు’’ (పద్మ తల్లి పోషమ్మ చెప్పిన వివరాలివి).

గురువారం రాత్రి: 7.30 గంటల సమయం. ఆమె అప్పుడే ఇల్లెందులో బస్సు దిగింది. కాకతీయ నగర్‌ వైపు నడుచుకుంటూ వెళుతోంది. ఆమెను ఆటో వెంబడించింది. కొలిమి కొట్టం వద్ద ఆమె పక్కగా ఆటో రావడం, అందులోని ఒకడు ఆమెను లోపలికి లాక్కోవడం, అది వేగంగా దూసుకెళ్లడం.. క్షణాల్లోనే జరిగింది. ఆమె పేరు బండారు పద్మ, వివాహిత, ప్రభుత్వ ఉద్యోగిని. శుక్రవారం ఉదయం: ఇల్లెందు–ఖమ్మం రహదారిలో ఐటీఐ ఉంది. దాని పక్క నుంచి మొట్లగూడెం రోడ్డులో కొంత దూరం వెళ్లాక, ఎడమవైపున మహిళ మృతదేహం ఉంది. ఆమె మరెవరో కాదు.. ముందు రోజు రాత్రి కిడ్నాపైన వివాహిత బండారు పద్మ. ఆమెను కిడ్నాప్‌ చేసింది, చంపింది మరెవరో కాదు.. కట్టుకున్న భర్తే. వాడికి బంధువులైన మరో ఇద్దరు సహకరించారు. 

అమ్మను రోజూ కొట్టేవాడు 
‘ఖమ్మం జడ్పీ ఆఫీస్‌ వెనుక ఇంటిలో కిరాయికి ఉండేవాళ్లం. అక్కడ అమ్మను నాన్న రోజూ కొట్టేవాడు. మేం చూడలేకపోయేవాళ్లం. బడికి వెళ్లడం కూడా మానేశాం. బడికి రావట్లేదని టీచర్‌ అడిగితే సమాధానం చెప్పలేకపోయాం. అమ్మ బాధను చూడలేకపోయాం. ఎవరికి చెప్పాలో తెలియలేదు. ఒకసారి, ఇంట్లోని సామాన్లు ఎత్తుకెళ్లాడు. అప్పుడు, ఆ ఇల్లు ఖాళీ చేసి సామాన్లతో అమ్మమ్మ వద్దకు వచ్చాం. ఇక్కడికి వచ్చిన తరువాత కూడా అమ్మను, అమ్మమ్మను కొట్టాడు. డిసెంబర్‌ 31న, జనవరి1న కూడా వచ్చాడు. అప్పుడు కూడా గొడవపడ్డాడు. అమ్మను చంపుతానని ఆ రోజే చెప్పాడు. నిన్న (గురువారం) సాయంత్రం ఖమ్మంలో బస్‌ ఎక్కిన తర్వాత అమ్మ ఫోన్‌ చేసింది. బస్సు ఎక్కినట్లు చెప్పింది. మా అమ్మ మాతో మాట్లాడడం అదే ఆఖరు’’– పద్మ పిల్లలు జయేంద్ర, రిషిక ఏడ్చుకుంటూ ‘సాక్షి’కి చెప్పిన వివరాలివి. మార్చురీ వద్ద ఆ పిల్లలు, అమ్మమ్మ పోషమ్మ గుండెలవిసేలా రోదించారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement