లక్ష్మణ్ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు, (ఇన్‌సెట్) ఇర్పా లక్ష్మణ్ అలియాస్ భరత్
‘‘పూజారి కాంకేర్ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం ఉంటుంది. నెత్తుటి బాకీ తీర్చుకుంటాం. అమరులైన వీరులకు నివాళులర్పిస్తాం...’’ ఇది, మార్చి 3న, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ చేసిన హెచ్చరిక (ఆడియో టేప్). అంతకు ముందు రోజు (మార్చి 2న) మన రాష్ట్ర సరిహద్దులోగల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారికాంకేర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పదిమంది మావోయిస్టులు మృతిచెందారు. ఒక జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న మావోయిస్టులు అన్నంత పని చేస్తున్నారు. హత్యాకాండ సాగిస్తూనే ఉన్నారు.
చర్ల : ఇప్పటికి 12. పూజారి కాంకేర్ ఎన్‌కౌంటర్ తరువాత మావోయిస్టుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇది. ఇందులో పదిమంది జవాన్లు, ఇద్దరు సామాన్యులు. పూజారి కాంకేర్ ఎన్‌కౌంటర్‌కు కారకులని ఆరోపిస్తూ, చర్ల మండలంలోని పూసుగుప్ప గ్రామస్తుడు ఇర్పా లక్ష్మణ్ అలియాస్ భరత్‌ను, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఊసురు పోలీస్ స్టేషన్ పరిధిలోగల చినఊట్లపల్లికి చెందిన సోడి అందాల్ అలియాస్ నందు అలియాస్ రఘును మావోయిస్టులు బుధవారం సాయంత్రం చంపేశారు. అక్కడ లేఖలు వదిలారు.
- మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ హెచ్చరించిన మూడో రోజునే హత్యాకాండ మొదలైంది. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా దోర్నపాల్ సమీపంలో నాలుగు బస్సులను దహనం చేశారు. ఓ బస్సులో ప్రయాణిస్తున్న కానిస్టేబుల్‌ను చంపేశారు.
- మార్చి 13న మరో దారుణానికి తెగబడ్డారు. ఇదే జిల్లాలోని కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోగల పాలోడు బేస్ క్యాంపునకు జవాన్లు వెళుతున్న మైన్ ప్రూఫ్ వాహనాన్ని మందుపాతరలతో పేల్చివేశారు. ఈ దాడిలో తొమ్మిదిమంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
- తాజాగా, బీజాపూర్ జిల్లాలోని చినఊట్లపల్లి గ్రామ సమీపంలోగల తాలిపేరు వాగు వద్ద పూసుగుప్పకు చెందిన ఇర్పా లక్ష్మణ్ అలియాస్ భరత్‌ను, చినూట్లపల్లికి చెందిన సోడి అందాల్ అలియాస్ నందు అలియాస్ రఘును చంపేశారు. దీంతో, ఎన్‌కౌంటర్ తరువాత మావోయిస్టులు చంపిన వారి సంఖ్య 12కు చేరింది.
- రాష్ట్ర సరిహద్దుల్లో బలగాలు కూంబింగ్ సాగిస్తున్నాయి. మావోయిస్టులు కూడా ఇలా హత్యలు, ఇతరత్రా దుశ్చర్యలు (బస్సులు, లారీలు, జేసీబీలు, పొక్లెయిన్లు, కాంక్రీట్ మిల్లర్లను దహనం చేయడం) సాగిస్తూనే ఉన్నారు.
- ఎన్‌కౌంటర్లు, ప్రతీకార దాడులు, హత్యల నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతందోనని ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు తీవ్ర భయాందోళనతో ఉన్నారు. బలగాలు ఒకవైపు విస్తృతంగా కూంబింగ్ సాగిస్తుండగానే, మావోయిస్టులు మరోవైపు హత్యలు–దుశ్చర్యలకు దిగుతుండడంతో తీవ్ర ఆందోళన–అయోమయం నెలకొంది.
- పూజారి కాంకేర్ ఎన్‌కౌంటర్ జరిగిన నెల కూడా పూర్తవలేదు. ఇంతలోనే 12మందిని మావోయిస్టులు బలిగొన్నారు. మున్ముందు ఇంకెంతగా రెచ్చిపోతారో.. ఎవరెవరిని బలి గొంటారో.. సరిహద్దుల్లో సర్వత్రా ఇదే చర్చ.
Comments
Please login to add a commentAdd a comment